తెలుగు తెర‌పై తెలంగాణ క‌త్తి‌వీరుడు

అవి 1951 ప్రారంభపు తొలి రోజులు. నెప్ట్యూన్‌ స్టూడియోలో ‘నిర్దోషి’ షూటింగ్‌ జరుగుతున్నది. చిత్రం దాదాపు అయిపోవచ్చింది. అప్పుడే హెచ్‌.ఎం.రెడ్డిగారు కారు దిగి స్టూడియోలోకి రాబోతున్నారు. అప్పుడు ఇరవైఏళ్లు కూడా నిండని అమాయకంగా కనిపించే ఒక కుర్రాడు ఆయనకు ఎదురుగా వెళ్లి నిర్భంగానే అడిగాడు ”సార్‌… మీతో మాట్లాడాలి” అని, ఆయనది పెద్దపులిలా గంభీరంగా కనిపించే విగ్రహం. సాధారణంగా ఆయన దగ్గరకు వెళ్లాలంటే ఎవరికైనా గుండెలు గడగడా కొట్టుకుంటాయి. అలాంటిది అర్భకుడిలా కనిపించే ఈ కుర్రవాడి మాటలకు ముచ్చటపడిన రెడ్డిగారు అతడిని తేరిపారా చూసి ”ఏమప్పా! ఎవరు నువ్వు? ఏం సంగతి?” అని నెమ్మదిగానే అన్నాడు. దాంతో ఆ కుర్రవాడికి కాస్త ధైర్యం వచ్చింది. ”సార్‌ మాది 150 ఇళ్లున్న తెలంగాణా పల్లెటూరు గుడిబండ. ఆ గ్రామ జమిందార్లం. ఒక్కడిని సినిమాల్లో నటించాలని వచ్చాను. నాకు నాటకానుభవం కూడా వుంది. ఓ చిన్న వేషానికి కూడా ఒప్పుకున్నాను. ఒకే ఒక్క డైలాగ్‌ వున్న చిన్న పాత్ర అది. తీరా అందరూ ఒప్పుకున్నాక, నేను వేషం వేసుకుని సెట్లోకి వచ్చాక ఎవరో ఒక తెల్ల జుట్టాయన నన్ను అవమానించి ‘నువ్వు ఈ పాత్రకు సరిపోవు’ అని కసిరి, నన్ను వేషం తీసేయమన్నారు. ఏమైనా న్యాయమా? పెద్దలు మీరే చెప్పాలి” అని చెప్పాల్సింది చెప్పేశాడు. చుట్టూ వున్నవారు ఇదంతా చూస్తూ నివ్వెరపోయారు. అంతా విన్న ఆయన చిన్నగా నవ్వి ”సరే, నువ్వు నాతో రా” అంటూ సెట్లోకి వచ్చి కుర్చీలో కూర్చున్నారు. అతడిని ఎదురుగా పిలిచి ‘నీకు ఆ డైలాగ్‌ వచ్చా. ఏదీ ఓ సారి చెప్పు” ఆదేశించారాయన. తడబాటు లేకుండా ఎలాగూ నాటకాల అనుభవం వుండడంతో బట్టీ పట్టిన డైలాగును రెడ్డి గారికి వినిపించాడు. ఆయనకు నచ్చింది. ”వెరీ గుడ్‌! నువ్వెళ్లి వేషం వేసుకురా” అని ఆదేశించారు. ఆ వెంటనే వెళ్లి వేషం వేసుకురావడం, షాట్‌ డైలాగ్‌ చెప్పడం, షాట్‌ ఓకే అవడం వెంటవెంటనే జరిగిపోయినవి. అలా ధైర్యంగా రెడ్డిగారి మెప్పు పొందిన ఆ యువనటుడే తెలుగు తెరపై జానపద సినీ కథానాయకుడిగా ఒక వెలుగు వెలిగిన టి.ఎల్‌.కాంతారావు. ఇది టి.ఎల్‌ కాంతారావు శతజయంతి సంవత్సరం.
(టి.ఎల్‌.కాంతారావు శతజయంతి సందర్భంగా)

కత్తి పట్టి మెరుపువేగంతో శత్రువును మట్టి కరిపించే ‘విజయసింహుడు’. ఆపదలో ఉన్న రాకుమారిని రక్షించే ఖడ్గవీరుడు’. తెలుగు జానపద చిత్రసీమలో అజేయుడు, ‘అగ్గిదొర’. నటనలో అసామాన్య ప్రతిభా సంపన్నుడు. వెండి తెరపై కత్తియుద్ధాలతో స్వైరవిహారం చేసి తొలి తెలంగాణ సినీ కథానాయకుడిగా పేరొందిన మహానటుడు తాడేపల్లి లక్ష్మీకాంతారావు. టి.ఎల్‌. కాంతారావు పేరు చెప్పగానే మనకు ఆయన నటించిన సుమారు 50 జానపద సినిమాలు ఒకదాని వెంట ఒకటి గుర్తుకు వస్తాయి. ధైర్యవంతుడైన రాకుమారుడు మాంత్రికుని మాయాజాలం నుండి తన రాజ్యాన్ని, రాకుమారిని ఎలా రక్షిస్తాడో కాంతారావు సినిమాలు చూస్తే మనకు ఒక స్వాప్నిక జగత్తు ఆవిష్కారమవుతుంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల వారి చేతుల్లో, ఒక సామాజిక వర్గం కనుసన్నల్లో నడిచే తెలుగు సినిమా రంగంలో ఒక తెలంగాణవాడిగా, ఒక అగ్ర హీరోగా కాంతారావు నిలదొక్కుకుని మనగలిగాడంటే అదొక అరుదైన జీవన విజయగాథ. అతడు మనవాడు మన కథానాయకుడు. అచ్చ తెలంగాణవాడు. నాటి ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ దగ్గరలోని గుడిబండ గ్రామంలో తాడేపల్లి కేశవరావు, సీతారామమ్మ దంపతులకు 1923 నవంబర్‌ 16న జన్మించారు కాంతారావు. మూడేళ్ల ప్రాయంలోనే తండ్రిని కోల్పోయారాయన. కోదాడలోనే ఉర్దూభాషలో వస్తానియా (7వ తరగతి) వరకు చదువుకున్నారు. చిన్నతనంలోనే నాటకాల పట్ల ఆసక్తి పెంచుకున్న కాంతారావు చదువుకునే రోజుల్లోనే రంగస్థలంపై చిన్న చిన్న వేషాలు వేశారు. తన 15వ ఏట చదువు చాలించిన ఆయన సొంతవూరిలోనే వంశపారంపర్యంగా సంక్రమించే ‘పటేల్‌’గా ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలోనే ఒకసారి తమ వూరికి ‘సురభి’ నాటక కంపెనీ వచ్చింది. వాళ్లంతా కొన్నాళ్లు అక్కడే మకాం వేసి వరుసగా నాటకాలు వేశారు. ఆ విధంగా తొలిసారిగా సురభి నాటక సమాజం వారి నాటకంలో బ్రహ్మదేవుని వేషం వేశారు కాంతారావు. ఆ తరువాత సురభి నాటక సమాజంలో చేరి మధుసేవ, కనకతార, గయోపాఖ్యానం వంటి తెలుగు నాటకాల్లో, హిందీలో మేవాడ్‌, బొబ్బిలి వంటి నాటకాల్లో నటించారు. ఇంతలో ఆయన మనసు సినిమాలవైపు మళ్లింది. అప్పటికి ఖర్చులకు తన భూమి అమ్మి వేశారు. ఆ డబ్బుతో మద్రాసు వెళ్లారు. 1952 డిసెంబర్లో విడుదలైన ‘ఆదర్శం’ సినిమాలో ఇద్దరు హీరోల్లో ఏదో ఒక వేషం వస్తుందని ఆశించినా ఏ అవకాశం రాలేదాయనకు. ఇది తెలంగాణ నిర్మాతలు తీసిన తొలిచిత్రం.. మద్రాసులో సినిమాల్లో నటించడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో కాంతారావు ఇక ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ మధ్యకాలంలో మద్రాసులో వేసిన మేవార్‌ నాటకంలో మొహబ్బతాఖాన్‌ వేషం వేయవలసిన టి.కృష్ణ (ఎడిటర్‌) కారణాంతరాల వల్ల పాల్గొనలేక పోతున్నానని, ఆ పాత్రను కాంతారావును వేయవలసిందిగా కోరారు. అప్పటికి హిందీ నాటకాల్లో నటించిన అనుభవం ఉండటం వల్ల ఆ వేషం కాంతారావు వేశారు. నాటకంలో ఆయన నటన చాలామంది ప్రశంసలందుకున్నది. మరునాడు టి.కృష్ణను కలవడానికి ‘రోహిణీ ఆఫీసుకు వెళ్లగానే అక్కడున్న వారంతా ప్రశంసలు కురిపించారు. ఐతే తనకెలాగూ సినిమా అవకాశాలు వచ్చేటట్లు లేవని ఇక తిరిగి ఇంటికి పోవాలని నిర్ణయించుకుని వెళ్లేముందు టి.కృష్ణకు చెప్పి వెళ్లాలని ఆయన దగ్గరికెళ్లారు.
అప్పుడు టి. కృష్ణ రోహిణీ వారి ‘నిర్దోషి (1851) సినిమాకు పనిచేస్తున్నాడు. ”సినిమాల్లో నటించాలనే సరదా తీరకుండానే ఎట్లా పోతా”వని ‘నిర్దోషి’లో ఒక పల్లెటూరి రైతు వేషం ఉంది వేయమన్నాడు. అది ఒకే ఒక్క డైలాగ్‌ ఉన్న పాత్ర! కానీ ఆయన నటన, పలుకు రెండూ నచ్చి వెంటనే ఆ పాత్రకు నాలుగు డైలాగులు రాయించి రీషూట్‌ చేయించారు దర్శకుడు హెచ్‌.ఎం. రెడ్డి. సరిగ్గా ఇక్కడే కాంతారావు నట జీవితం మలుపు తిరిగింది. నటనలో నిగూఢమైన మెరుపును కనిపెట్టిన రెడ్డిగారు కెమెరామెన్‌ పి.ఎల్‌.రారు ని పిలిచి ముఖవర్చస్సును, సౌండ్‌ ఇంజనీర్ని పిలిచి డైలాగ్‌ డెలివరీ పరిశీలించి ”ఇతడే నా తరువాతి సినిమా హీరో” అని ప్రకటించారు. అట్లా తెలుగు సినిమా రంగంలోకి తొలి తెలంగాణ హీరో కాంతారావు ప్రవేశం జరిగింది. 1953లో ‘ప్రతిజ్ఞ’ సినిమాతో మన కాంతారావు హీరోగా వెండితెరకు పరిచయమైనారు. అదీ తెలుగు, తమిళ భాషల్లో. తమిళంలో బాగా ఆడకపోయినా తెలుగులో శతదినోత్సవాలు జరుపుకున్నది. ఆయన తొలి చిత్రం ‘ప్రతిజ్ఞ’కిది సప్తతి సంవత్సరం. హీరోయిన్‌ గా సావిత్రి, ప్రతి నాయకునిగా నెల్లూరు రాజనాల కల్లయ్య నటించాడు. అయితే రాజనాలకు మొదటి నుండీ హీరో వేషంపై మోజు ఉండటంతో తనకు విలన్‌ వేషం వచ్చినా యూనిట్‌ వారిని మేనేజ్‌ చేసుకుని టైటిల్స్‌లో తన పేరు ముందుగా, తరువాత కాంతారావు పేరు వచ్చేటట్లు చేశారు. దాంతో కాంతారావును విలన్‌ గా అనుకునే పరిస్థితి వచ్చింది. కాంతారావుకు ఈ పరిస్థితి నుండి బయటపడటానికి చాలాకాలమే పెట్టింది.
‘ప్రతిజ్ఞ’ సినిమా విజయవంతమైనా ఆ వెంటనే రెండో సినిమాకు అవకాశం రాలేదు. రెండేళ్ల తరువాత గాని విఠలాచార్య సాంఘిక చిత్రం ‘కన్యాదానం’ (1955)లో నటించారాయన. ఈ సినిమా అంతగా అడకపోయినా ఎన్‌.టి.ఆర్‌. తీసిన ‘జయసింహ’ (1955)లో తమ్ముడు విజయసింహుడు వేషం ఇచ్చారు. ‘జయసింహ’ గొప్ప విజయం సాధించి కాంతారావుకి మంచి పేరు రావడమే గాక భవిష్యత్తుకు ఆటంకాలు లేని బాట వేసిపెట్టింది. ఆ తరువాత ‘భక్త మార్కండేయ’, ‘గౌరీమాహాత్మ్యం’ (శివునిగా), ‘ఇలవేలుపు’లో గెస్ట్‌ పాత్రల్లో (1956), ‘సతీ అనసూయ’ (1957), ‘శ్రీరామాంజనేయ యుద్ధం’, ‘గంగా గౌరి సంవాదం’ (1959) పౌరాణిక చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న వేషాలు వేసిన కాంతారావు నట జీవితాన్ని మలుపు తిప్పిన దర్శకుడు విఠలాచార్య. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సినిమాలు నిర్మించి విడుదల చేయడం ఆయనలోని ప్రత్యేకత. ఆ తరువాత విఠలాచార్య తానొక జానపదం తీయాలనుకుని కాంతారావును హీరోగా ఎంపిక చేసుకుని ‘జయ-విజయ’ (1959) తీశారు. ఈ సినిమా విజయం సాధించడంతో కాంతారావు విఠలాచార్యల కాంబినేషన్లో ఎన్నో హిట్‌ జనపదాలు రూపొంది తెలుగు సినిమారంగంలో జానపద చిత్రాలకు ఒక అధ్యాయం ఏర్పడింది. విఠలాచార్య డైరెక్షన్లో కాంతారావు ‘కనకదుర్గ పూజా మహిమ'(1960), ‘వరలక్ష్మీ వ్రతం’ (1961) ‘మదన కామరాజు కథ’ (1962), గురువును మించిన శిష్యుడు’ (1963), ‘నవగ్రహ పూజా మహిమ’ (1964), విజయసింహ (1965), ‘జ్వాలాద్వీప రహస్యం’ (1966), ‘ఇద్దరు మొనగాళ్లు’ (1967) ‘భలే మొనగాడు’, ‘పేదరాశి పెద్దమ్మ’ (1968) చిత్రాలతో కలిపి మొత్తం డజన్‌ సినిమాల్లో హీరోగా నటించారు. ఈ కాంబినేషన్లో కాంతారావు పక్కన నాయికలుగా కృష్ణకుమారి, రాజశ్రీలను తప్ప మరొకరిని ఆ రోజుల్లో ఊహించేవారు కాదు. కాంతారావు జానపద చిత్రాల విజయపరంపర అటు ఎన్‌.టి.ఆర్‌. పౌరాణిక చిత్రాలకు, ఇటు నాగేశ్వరరావు విషాద నాయక చిత్రాలకు సమాంతరంగా సాగింది. అదొక ప్రభంజనం. ఆ ప్రభంజనం ఎన్‌.టి.ఆర్‌.ని సైతం జానపదాల్లో నటించక తప్పని పరిస్థితిని కల్పించింది. కాంతారావుతో కలిసి ‘చిక్కడు దొరకుడు’. ‘మర్మయోగి’ వంటి జానపదాల్లో నటించారాయన.
ఎన్‌.టి.ఆర్‌. శ్రీకృష్ణుడు, రాముడు వేషాలు వేయకపోతే నిర్మాతలకు కనిపించే మరో నటుడు కాంతారావు మాత్రమే. నర్తనశాల (1963), బభ్రువాహన 1964), పాండవ వనవాసం, సతీ సక్కుబాయి, ప్రమీలార్జునీయం (1965) చిత్రాలలో శ్రీకృష్ణుడుగా నటించి మెప్పించారు. కాగా శ్రీరామునిగా పాదుకాపట్టాభిషేకం (1966) వీరాంజనేయ, సతీసులోచన చిత్రాల్లో నటించారాయన. ఇంకా శ్రీకృష్ణ రాయబారం, వీరాభిమన్యులో అర్జునుడిగా కాంతారావు నటన ఎన్టీఆర్‌ తో పోటీపడింది. ఒకవైపు సాంఘికాలలో అక్కినేని జగ్గయ్యల కాంబినేషన్‌, మరోవైపు జానపద, పౌరాణిక, సాంఘికాలన్నింటిలోనూ కాంతారావు ఎన్టీఆర్‌ జోడి విజయయాత్ర సాగించినవి. కంచుకోట, మర్మయోగి, చిక్కడు దొరకడు వంటి జానపదాలు, ఇక పౌరాణికాలు సరేసరి. సాంఘికాలలోనూ తనదైన ముద్ర వేశారాయన. రక్త సంబంధం (1961), ఆప్తమిత్రులు (1963), దేశద్రోహులు (1964), అడిబతుకు (1965), పల్నాటి యుద్ధం (చారిత్రాత్మకం- 1966), ఏకవీర (1969) వంటి చాలా చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినవి. తెలంగాణకు చెందిన ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి తన మిత్రులతో కలిసి బెంగాలీ సినిమా ‘దీప్‌ జాలాజారు’ను తెలుగులో ‘చివరకు మిగిలేది’గా తీశారు. ఇందులో కాంతారావుది ప్రత్యేక పాత్ర. సినిమా కళాత్మకంగా గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్నది. సావిత్రి నటన ఉన్నత శ్రేణికి చెందినదిగా విమర్శకుల ప్రశంసలందుకున్నది. కానీ ఆర్థికంగా ఫెయిలైంది. ఆయన నటించిన సాంఘిక చిత్రాలలో శభాష్‌ రాముడు, శభాష్‌ రాజా, బికారి రాముడు, పెళ్లికాని పిల్లలు, ఖైదీ కన్నయ్య, శాంతి నివాసం, చిట్టి తమ్ముడు, ఎదురీత, కానిస్టేబుల్‌ కూతురు, మంచిరోజులు వస్తాయి. తోటుట్టువులు, చదువుకున్న భార్య, శ్రీమతి, మా వదిన, పిన్ని, ఎవరు మొనగాడు వంటి చిత్రాలు కాంతారావు నటించిన సాంఘికాలలో కొన్ని కృష్ణకుమారి, దేవిక, రాజశ్రీ, కాంచన, భారతి, జయంతి వంటివారు ఆయనకు రెగ్యులర్‌ హీరోయిన్లు. వారిదంతా సుమారు రెండు దశాబ్దాలపాటు సాగిన విజయవంతమైన కాంబినేషన్‌. ఆయన నటించిన సినిమాల సంఖ్య 400 పై మాటే.
క్యారెక్టర్‌ రోల్స్‌ లోనూ ఆయనది విలక్షణమైన ముద్ర. దేవుడు చేసిన మనుషులు. సాహసవంతుడు వంటి చిత్రాల్లో విలన్‌ గా కూడా నటించిన కాంతారావు బాల భారతం, మహాకవి క్షేత్రయ్య, నేరము-శిక్ష, అల్లూరి సీతారామారాజు, దేవదాసు, ఓ సీత కథ, గాజుల కిష్టయ్య, పాడిపంటలు, ముత్యాలముగ్గు వంటి సుమారు 200 చిత్రాల్లో కారెక్టర్‌ రోల్స్‌ చేశారు. ఇక డజన్ల కొద్ది టి.వి. సీరియల్స్‌ లో నటించారు. ఆయన నటించిన ఆఖరి చిత్రం ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’: (2007). చివరి రోజుల్లో అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌ నగరంలోని నల్లకుంటలో ఒక కిరాయి ప్లాట్లో జీవనం గడిపిన కాంతరావు 2009 మార్చి 22న తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య హైమావతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా పదివేల రూపాయలు జీవనభృతి ఇచ్చింది. 2000 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వంచే రఘుపతి వెంకయ్య పురస్కారంతో కాంతారావు గౌరవమందుకున్నారు. నిజానికి కాంతారావే గనుక తెలుగు సినిమా రంగంలోకి వెళ్లకుంటే జానపద సినిమాల ప్రభావమే ఉండేది కాదనడంలో అతిశయం లేదు. ఆయన జనం మెచ్చిన నటుడు. సామాన్య ప్రేక్షకుడి ఊహలకు కార్యరూపమిచ్చి తెలుగు సినిమా కళామతల్లి నుదుటి తిలకంగా నిలిచిపోయారు. మొత్తంగా తెలుగు సినిమా రంగంలో తెలంగాణ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించి మన ఆత్మగౌరవ పతాకంగా ఎగిరిన జానపద కథా నాయకుడు తాడేపల్లి లక్ష్మీకాంతారావు. కాంతారావు శతజయంతి ఉత్సవాలను తెలుగు సినీ పరిశ్రమ తో బాటు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడాది పాటు నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
(ఫొటోలు : క్రియేటివ్‌ లింక్స్‌ సౌజన్యంతో)

జానపద చిత్రాలకు చిరునామా
వేగంగా సినిమాలు తీసేవారికి, జానపద చిత్రాలు తీసేవారికి ఏకైక హీరోగా కాంతారావు నిలదొక్కుకున్నారు. ఆ తరువాత జి.విశ్వనాథం, సి.ఎస్‌. రావు కె.ఎస్‌.ఆర్‌. దాస్‌, బి.ఎ. సుబ్బారావు వంటి దర్శకులు తీసిన స్వర్ణగౌరి, నువ్వానేనా (1962), దేవసుందరి, సోమవార వ్రత మాహాత్మ్యం (1963), బంగారు తిమ్మరాజు, తోటలో పిల్ల కోటలో రాణి, (1964) విజయసింహ, ప్రతిజ్ఞా పాలన, ఆకాశరామన్న, ప్రచండ భైరవి, పక్కలో బల్లెం (1965), భూలోకంలో యమలోకం (1966), అగ్గిదొర, దేవుని గెలిచిన మానవుడు, కంచుకోట, రహస్యం (1967), వీరపూజ, అగ్గిమీద గుగ్గిలం, దేవకన్య, దేవుడిచ్చి భర్త, రాజయోగం, రణభేరి (1968), బొమ్మలు చెప్పిన కథ, పంచకళ్యాణి దొంగలరాణి, రాజసింహ, ఉక్కుపిడుగు, గండర గండడు (1969 మెరుపువీరుడు, జన్మభూమి, సుగుణసుందరి కథ, రైతే రాజు, ఖడ్గవీర (1970), కత్తికి కంకణం. అందం కోసం పందెం, అడవి వీరులు (1971), విజయరాముడు (1974) వంటి జానపద చిత్రాలలో మన కాంతారావు కథానాయకుడుగా ఒక వెలుగు వెలిగారు.

నారదుడంటే కాంతారావే
జానపద చిత్రాల్లోనే గాక పౌరాణికాలలో సైతం తనదైన ముద్ర వేయగలిగిన పాత్రలు పోషించగలగడం మన కాంతారావులోని ప్రత్యేకత. మరోవైపు ఎన్టీయర్‌- కాంతారావులది హిట్‌ కాంబినేషనై కూర్చున్నది. జయసింహ, భట్టివిక్రమార్క వంటి చిత్రాల్లో అన్నదమ్ములుగా మరొకరిని ఊహించలేం. ఇక ‘లవకుశ’లో లక్ష్మణునిగా కాంతారావు నటన హిమాలయా శృంగాన్ని అందుకున్నదంటే అతిశయం లేదు. సీతను అడవిలో వదలివచ్చే దృశ్యాల్లో కాంతారావు నటన అనితరసాధ్యమైనది. ఈ సినిమాకుగాను ఉత్తమ సహాయ నటుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు. కాంతారావు నటించిన తొలి పౌరాణికాలు ‘శ్రీ గౌరీ మాహాత్మ్యం’, ‘భక్త మార్కండేయ’ (1956), రెండింటిలోనూ శివుడి వేషాలే. తర్వాత ‘సతీ అనసూయ’లో అశ్వనీ దేవతల్లో ఒకరిగా నటించినా, ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ (1958)లో మళ్లీ శివుడి వేషాన్ని వేశారు. పౌరాణిక చిత్రాల్లో కాంతారావు శివుడు, కృష్ణుడు, అర్జునుడు, శ్రీరాముడు వంటి పాత్రలు వేసినా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చినవి నారదుని పాత్రలే. 1950ల నుండి 70ల వరకు పౌరాణికాలలో నారదుని పాత్రలు ఎక్కువగా పోషించింది కాంతారావే. ఒకరకంగా తెలుగు సినిమా పౌరాణికాల్లో నారదుని వేషానికి ఆయనకే పేటెంట్‌ హక్కు ఉండింది. నారదునిగా కాంతారావు తొలిసారిగా ‘గంగా గౌరి సంవాదం’ (1958)లో నటించారు. ఆ తరువాత రెండు దశాబ్దాలకు పైగా నారదునిగా కాంతారావును తప్ప మరొకరిని ఊహించుకునే పరిస్థితే లేదు. ‘గంగా గౌరి సంవాదం’తో మొదలుకుని ఆ తర్వాత వరుసగా దీపావళి (1960), సతీ సులోచన (1961), శ్రీ సీతారామ కళ్యాణం (1961), మోహినీ రుక్మాంగద (1962), శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963), శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణ తులాభారం(1966), శ్రీకృష్ణసత్య, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (1971), శ్రీరామాంజనేయ యుద్ధం (1973), సతీ సావిత్రి(1978) వంటి డజనుకు పైగా చిత్రాలలో ఆయన నారదుడిగా నటించి మెప్పించారు. నారదుడి పాత్ర పోషణలో కాంతారావు నటన ప్రతిభను చూసిన ఎన్టీ రామారావు ముచ్చటపడి ”బ్రదర్‌… నేను పౌరాణిక పాత్రలు ఎన్ని చేసినా నారదుడు పాత్రను మాత్రం మీకే వదిలేస్తున్నాను” అని అన్నారట. అలాగే నారద పాత్ర గురించి ఎన్టీఆర్‌ కు మరో ఆలోచన రాకుండా తన ప్రతిభతో ఆ పాత్రను మరింతగా రాణించేలా మెరుగులు దిద్ది తనకు తానే సాటి అనిపించుకున్నారు. కాంతారావు ‘శ్రీకృష్ణతులాభారం’ చిత్రంలో సత్యభామ నుంచి శ్రీకృష్ణుడిని దానంగా స్వీకరించడం, ”భలే మంచి చౌక బేరము” అంటూ నడివీధిలో కృష్ణుడిని అమ్మకానికి పెట్టడం వంటి సన్నివేశాలలో నారదుడిగా కాంతారావు వెండితెరపై తన నటన వైదుశ్యంతో స్వైర విహారం చేస్తారు. ఈ సినిమా అంతా కాంతారావు చుట్టూనే తిరుగుతుంది .అంతకుముందే నాగేశ్వరరావు రామారావు కలిసి నటించిన ”శ్రీకష్ణార్జున యుద్ధం”లో నారదుడిగా కాంతారావు నటన ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతెందుకు రామారావు యముడి పాత్రను పోషించిన ”సతీసావిత్రి”లో నారదుడిగా కాంతారావు నటించారు. బహుశా కాంతారావు నారదుడిగా నటించిన ఆఖరి చిత్రం ఇదే కావచ్చు. టిఎల్‌ కాంతారావు కన్నా ముందు నారదని వేషంలో జీవన్‌ స్వామి, ఈలపాట రఘురామయ్య, పువ్వుల సూరిబాబు, అక్కినేని నాగేశ్వరరావు (భూకైలాస్‌, కష్ణ మాయ)ఆ తర్వాత పద్మనాభం, రేలంగి, రమణారెడ్డి, శోభన్‌ బాబు, చంద్రమోహన్‌ వంటి వారు నారదుడిగా నటించినా వారు కాంతారావులాగా మెప్పించలేకపోయారు.

కలిసిరాని చిత్ర నిర్మాణం
అయితే కాంతారావు సినిమాల్లో విజయ యాత్ర కొనసాగిస్తూ చిత్ర నిర్మాతగా మారారు. నిర్మాతగా ఆయనకు కలిసి రాలేదు. 1969లో తన భార్య పేరిట హేమా ఫిలింస్‌ అన్న సంస్థను ప్రారంభించి వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తాను హీరోగా ‘సప్త స్వరాలు’ సినిమాను నిర్మించారు. తెలంగాణ ఉద్యమం మొదలు కావడంతో కాంతారావు సినిమాను దెబ్బతీశారు. దాంతో కాంతారావు సినిమా అపజయం పాలయింది. ‘సప్త స్వరాలు’కు పోటీగా భావనారాయణ ‘లవ్‌ ఇన్‌ ఆంధ్ర’ సినిమా తీసి విడుదల చేశారు. దురదృష్టవశాత్తు రెండు సినిమాలు ఫెయిల్‌ అయినవి. ఆ తర్వాత కాంతారావు ‘గండరగండడు’, ‘ప్రేమ జీవులు’ సినిమాలను నిర్మించారు. ఆయన తీసిన చివరి చిత్రం 1989లో వచ్చిన ‘స్వాతి చినుకులు’. ఐదు సినిమాలు నిర్మిస్తే కొద్దిపాటి లాభాలు తీసుకొచ్చింది ఒక్క ‘గండర గండడు’ మాత్రమే. నిర్మాతగా నష్టపోవడంతో కాంతారావు సినీ జీవితం అంతా కూడా కింద మీద అయిపోయింది. హైదరాబాద్‌ కు మకాం మార్చి సినిమాలలో, టీవీ సీరియల్స్‌ లో చిన్న చిన్న వేషాలు వేస్తూ కాలం గడపవలసి వచ్చింది. ఒకనాడు వెండితెరపై వెలుగు వెలిగిన మహానటునికి కలిగిన దీనస్థితి.

– హెచ్‌.రమేష్‌ బాబు, 77807 36386

Spread the love