రంగుల పెట్టె

ఒకనాడు రంగుల పెట్టెలోంచి
హరివిల్లు కరిగిపోతూ
నేలపై అచ్చుపోయడాన్ని చూసాను
అది బాల్యం.
ఇవాళ మళ్ళీ రంగుల పెట్టెలోంచి
ఎరుపు రంగు వొలకడాన్ని చూస్తున్నాను
ఇది బాంబు పొగలు కమ్ముకున్న సమయం
ఉదయమో రాత్రో అర్దం కాదు సమయం ఏదైనా
వొక్క ఎరుపు మాత్రమే వొలుకుతుంది
ఆ పిల్లల వొళ్ళంతా పచ్చినెత్తురు పారుతుంది!
సీతాకోకచిలకల్లాంటి పిల్లలు
పగిలిన ఎర్రటి రంగు డబ్బాల్లాగా నెత్తురోడుతున్నారు.
నన్నెవరైనా అడిగితే ఏమని చెప్పను
బాల్యానిది రక్తం రంగని చెప్పనా?
లేదా, బాంబు పొగల రంగని చెప్పనా?
లేదా గాలికి రంగు లేనట్టుగా బాల్యానికీ రంగులుండవని
అతిపెద్ద అబద్దాన్ని చెప్పనా?
యుద్ధనేలపై బాల్యమంటే.. హరివిల్లు బూడిదైన ఆకాశం!
– దొంతం చరణ్‌

Spread the love