సింధూర తీరాలు

ఎర్రని అలల మీద చెలియ లేఖలు రాసి
దోసిలితో తోసిందో ఏమో గాజుల గలగలలు
గస్తీ కాస్తూ నా వైపే చేరవేస్తూ ఉన్నాయి
ఎదురు తీరాలు అగుపడకున్నా
ఆలింగనాలూ అసాధ్యమైనా
ఎదలను కోసే వ్యధలన్నీ ఒక్కటే
ప్రేమ సందేశాల్ని అందించే
శ్వేత కపోతాలను ఏ డేగలు
పీక్కు తిన్నాయో కానీ నెత్తుటి అలలు మాత్రం
నెచ్చెలి దు:ఖాన్ని మోసుకు రావటం
లోక విషాదం వడిసెల కట్టబడి
పెనుగులాడే కన్న పేగులు
కదన రంగాన విసురబడుతున్న
కపాలాల పోలికేకలు
రణ దాహానికి సాక్ష్యం నిలిచిన
అస్థిపంజరాల రాశుల శిఖరాలు
ఇది ఏ తృష్ణ చిత్రించిన రంగుల చిత్రమో
ఏ తుపాకుల అంచుల మీద
స్వర పరచిన తూటాల పాటనో
ఏ కోరలు చిమ్ముతున్న
విషపు వికటాట్టహాసమో కానీ
శిథిలాల నడుమన
స్తన్యంబాసి నోరు తెరిచి
పసి హస్తం ఒక్కటి
సూర్యోదయాన్ని అడ్డగిస్తోంది
– పర్కపెల్లి యాదగిరి

Spread the love