మనుషుల జీవన నేపథ్యమే ‘అనురాగ సంగమం!’

ఏ రచయిత అయినా తన గత జీవిత లేక వర్తమాన జీవిత భావనలను తన సాహిత్యంలో సృజించడం సాధారణంగా జరిగే అంశం. ముఖ్యంగా నవలా సాహిత్యంలో జీవిత పరిధిని గుర్తించడానికి వీలుంటుంది. రచయిత ఆ నవల రాసిన కాలాన్ని, అలాగే ఆ కథ నడిచే కాలాన్ని గమనిస్తే అది ఏ కాలానికి చెందినదో స్పష్టమైపోతుంది. ప్రమీల గారి ‘అనురాగ సంగమం’ నవల రచయిత్రి గతకాలపు భావనలను, నేపథ్యాలను పాఠకులకు పల్లెటూరి వాతావరణంలో, అలాగే ఇంకా పూర్తిగా పట్టణంగా మారని ప్రాంతంలో మనుషుల జీవితాల గురించి, ఇంకో వైపు పట్టణ సంస్కృతిలోనూ ఈ నవలలో మూడు విభిన్న వాతావరణాలతో పరిచయం చేశారు.
ఈ నవలలో అమ్మాయిగా పుట్టినప్పటి నుండి స్త్రీగా మారే వరకు కుటుంబం నుండి సమాజం వరకు ఆ కాలంలో ఎలా ఆమెను కుటుంబ పనులు-వివాహం విషయంలో పెద్ద పిల్లగా, నిర్ణయ భాగస్వామ్యంలో అర్హత లేని అమ్మాయిగా ఎలా చూసేవారో శారద పాత్ర ద్వారా స్పష్టం చేశారు. ఇక్కడ ఏ అణచివేతలు బయటకు కనబడవు. ఆడపిల్లలంటే తల్లిదండ్రులకు ప్రేమే! ఆ అపురూపం వారి మనసుల్లో ఉంటుంది కానీ ఆ ప్రేమకు హద్దులు గీసేవి కూడా ఆ సమాజంలోని ‘అన్‌ స్పోకెన్‌ ట్రేడిషన్స్‌.’ ఈ పరిస్థితి వల్ల సహజంగా పిల్లలను ప్రేమించి, వారి అభిరుచులను అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్న తల్లిదండ్రులు కూడా తమ పిల్లల జీవితాలు ఆ సాంప్రదాయపు అంచుల్లో నడిచిపోవాలని ఎలా తాపత్రపడతారో ఈ పాత్ర ద్వారా రచయిత్రి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇటువంటి సందర్భంలో ఆ కుటుంబంలో విద్యావంతులైన తోబుట్టువులు ఉంటే ఈ వాతావరణంలో మార్పు కూడా వస్తుందని శారద పాత్ర అన్నయ్య వాసు ద్వారా చెప్పారు. ఇది ఈ నవలలో ఒక నేపథ్యం.
శారద పాత్ర ద్వారా అప్పట్లో అమ్మాయిల అమ్మలు తమ ఆడపిల్లలు కాబోయే భర్త తనను కాదనకుండా ఉండేలా జీవితం గడపాలన్న తాపత్రయాన్ని అనేక సందర్భాల్లో చూపించేవారో అన్నది రాశారు. శారద ఉండేది కూడా పల్లెటూరే అయినా ఆ పల్లెటూరికి, తర్వాత తను పాఠకులకు పరిచయం చేయబోయే పల్లెటూరికి ఉండే వ్యత్యాసాన్ని రచయిత్రి ఈ వాక్యాలతో స్పష్టం చేస్తారు… ‘మా ఊరు వ్యవసాయరంగంలో అభివృద్ధి చెందిన ఊరు. ఆధునిక పద్ధతుల్లో మెలకువలు తెలుసుకున్న విద్యను అభ్యసించిన యువకుల ప్రోత్సాహంతో రైతులంతా ప్రయోగాలు చేసి పంటను అభివద్ధి చేసుకున్నవారే! ‘ఆడపిల్లలకు చదువులెందుకు? ఎంత చదివినా కట్నం ఇచ్చి పంపించవలసిందేగా!’ అనుకునే రోజులు కాకపోయినా, స్త్రీ విద్య ప్రోత్సాహం మాత్రం లేదు’, అని శారద ద్వారా రచయిత్రి సాంకేతికంగా మార్పును ఆహ్వానించే మన:స్థితి వారిలో ఉన్నా, స్త్రీ ప్రగతి విషయంలో మాత్రం వారు ఎదగలేదు అని స్పష్టం చేస్తారు. అంటే లోతుగా ఆలోచిస్తే సమాజంలో సాంప్రదాయాలు ప్రగతి స్థాయిని ఎలా ప్రభావితం చేస్తాయి అనే అంశం మనల్ని ఈ సందర్భంలో ఆలోచించేలా చేస్తుంది.
ఇంకో నేపథ్యం ‘అమ్మోరిపల్లె’ చుట్టూ నిర్మించారు రచయిత్రి. ‘అందరికి పల్లెటూర్లు అంటే ఇష్టం ఉంటుంది’ అనే భావన ఒక ప్రకటనలా బలపడిపోయి ఉంది. నిజానికి 1960-1990 మధ్య ఎక్కువగా పల్లెటూర్లలో పుట్టి పెరిగిన వాతావరణం ఎక్కువ ఉంది. సాధారణంగా బాల్యంలో ఏ బాధ్యతలు లేకపోవడం, ఆ వాతావరణంలో ఇప్పుడు ఉన్న చదువు ఒత్తిడి కూడా లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల ఆ దశ ఆ కాలంలో ఉన్నవారికి చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతంలో అక్షరాస్యత శాతం కూడా తక్కువ కనుక చదువు విషయంలో పట్టణాల్లోలా ఒత్తిడి చేసే వాతావరణం కూడా ఎక్కువగా కనిపించదు. భవిష్యత్తులో ఎలా బతుకుతామో అన్న భయం ఆ చిన్న మనసుల్లో కలగకుండా తమ లానే తమ పిల్లలు కూడా ఏదో కాయకష్టం చేసుకుని అయినా బతికేస్తారు అనే ధీమా ఆ నేపథ్యంలో బలంగా కనబడుతూ ఉంది. ఈ కారణాల వల్ల ఎక్కువగా పల్లెటూరి జ్ఞాపకాలు బాల్యంలో ఎంతోమందికి మధుర స్మృతులుగా ఉండవచ్చు. నాగరికతకు పూర్తి దూరంగా, ఉన్న పల్లెటూరిలోకి పట్నం నుంచి వచ్చిన సూర్యం జీవిత ప్రస్థానంతో ఈ నేపథ్యంలో ఇంకో కథ మొదలవుతుంది. నిజానికి లోతుగా ఆలోచిస్తే మనిషి ఎప్పుడు కంఫర్ట్‌ జోన్‌ ను ఏర్పరుచుకునే ప్రక్రియలో భాగంగా తన చుట్టూ తన కోసం ఉండేవారిని కోరుకుంటాడు. ఈ పల్లెటూరి వాతావరణంలో అలా ఒకరి కోసం ఒకరు ఉండే సమిష్టి బంధం ఉంది. కానీ అడవి జంతువుల ప్రమాదమో లేక ప్రకతి వైపరీత్యాలు సంభవించినప్పుడో వాటిని ఎదుర్కునే మెకానిజం వారి దగ్గర లేదు. ఈ పల్లెటూరిలో ఉండేవారు ‘లివింగ్‌ ఇన్‌ ద మూమెంట్‌’ జీవులు! అలా ఉండటంలో తప్పు లేదు కానీ అక్కడ జీవితం ముగిసిపోయే పరిస్థితి వస్తే ఎలా ఇంకొక చోట బతకాలి అన్న ఆలోచన వారికి రాదు. ‘తమ జీవితం అక్కడే మొదలైంది కనుక అక్కడే ముగిసిపోతుంది’ అన్న లైఫ్‌ ఫిలాసాఫీతో వారు జీవిస్తూ ఉంటారు. ఇలా జీవించే వ్యక్తుల మధ్య సూర్యం పట్టణం నుండి వచ్చి, విద్య-నాగరిక జీవన విధానం పట్ల ఒక అవగాహన ఉండి, ఎలా అక్కడ కొంత సంతోషాన్ని వెతుక్కున్నా, పూర్తిగా ఇమడలేక, ఆ ‘కంఫర్ట్‌ జోన్‌’ నుండి అతని కుటుంబాన్ని పట్టణానికి వచ్చిన స్థితిగతులను కూడా ‘ప్రగతికి దూరంగా ఉండటం ప్రకృతికి దగ్గరవ్వడం కొన్నిసార్లు కావచ్చు,కానీ మనుగడ కోసం మనిషి నాగరికతను అవలంబించడంలో తప్పు లేదు’ అని నిరూపిస్తూ రచయిత్రి ఈ రెండు జీవన విధానాల మధ్య ఉన్న గ్యాప్‌ ను ఈ ‘సూర్యం’ పాత్ర ద్వారా పూడ్చే ప్రయత్నం చేశారు.
ఇంకొక పల్లెటూరిలో పెరిగిన వాతావరణం అశోక్‌ది. ఇక్కడ కామందులు, పని వారి మధ్య వ్యత్యాసాలు, వ్యక్తిని వ్యక్తిగా గౌరవించలేని పల్లెటూరి ఆచారాలు, భూస్వాముల చేతుల్లో నలిగిపోయే పేద జనుల మధ్య పెరిగిన వ్యక్తి అశోక్‌. అంటే రచయిత్రి అప్పట్లో జీవనంలో మాధుర్యంతో పాటు ఆ అమాయకత్వం వల్ల బానిసలుగా మారిపోయే ప్రవృత్తి ఉండటాన్ని కూడా ఈ పాత్ర ద్వారా చెప్పి, పల్లెటూరి వాతావరణంలోని రెండు కోణాలను స్పష్టం చేశారు. నాగరికత ఎంత పెరిగినా సరే స్త్రీకి గౌరవం అన్నది వివాహం వల్ల వస్తుంది, ఆ వివాహం అన్నది స్త్రీ సౌందర్యం, ఏ అంగవైకల్యం లేకుండా ఉంటేనే సాధ్యమవుతుంది, అంగవైకల్యం ఉన్న స్త్రీలకు ఎంత సామర్థ్యం ఉన్న ఎన్ని చోట్ల వివక్షకు గురవుతారో చెప్పే పాత్ర శ్రేయది. ఇక వాసు పాత్ర ఈ పట్టణ, పల్లెటూరి జీవితాల్లో ఉన్న పాత్రలకు నేస్తంగా ఉంటూ, కథ చివరకు వచ్చేసరికి ఒక ముగింపు వాక్యంగా నిలబడటం.
మనిషి ఎప్పుడూ జీవించడానికి పోరాటం చేస్తూనే ఉండాలి. మధురమైన జీవితం ఎల్లకాలం ఉండదు, భద్రత కూడా అనేకసార్లు ఉండకపోవచ్చు. మనకు వ్యక్తిగా ఎన్ని అభిప్రాయాలున్నా, ఏ నేపథ్యం నుండి వచ్చినా సరే, ‘survival of the fittest’ గా ఉండగలిగితేనే మనం ముందుకు వెళ్తాం అని ఈ నవలలోని ముఖ్య పాత్రల జీవితాలు గట్టిగా చెబుతాయి. రచయిత్రి పల్లెటూరి జీవితాలను ఇందులో చిత్రీకరించినా, అవి బయటకు మధుర ఊహల్లో తేలిపోయే పాత్రలు కావు, ఘర్షణ పడుతూ, తమ అస్థిత్వం కోసం, మనుగడ కోసం పోరాడే మనస్తత్వం ఉన్నవి కనుకే ఇది కొంత ‘నోస్తాల్జియా’ తాలూకు నవల అయినా ఇంకొంత అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మనిషి ఎప్పుడూ ఎలాంటి పరిస్థితిలో అయినా ముందుకు సాగడానికి ఉండాల్సిన సంసిద్ధత, కావాల్సింది దక్కించుకునే పట్టుదల గురించి కూడా పరోక్షంగా చెప్పే నవల.
అమెరికాలో దాదాపుగా అయిదు దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్నా, ఇక్కడి మట్టి -సంస్కృతి మర్చిపోకుండా ఆ మధురానుభూతులను, అప్పటి పరిస్థితులను స్పష్టం చేసేలా నవల రాసిన ప్రమీల గారికి అభినందనలు.

అనురాగ సంగమం
రచన : ప్రమీల
పేజీలు : 192, వెల : 50/-
ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు

— శృంగవరపు రచన

Spread the love