యువతకు చాలా సరదాలుంటాయి. స్నేహితులతో పార్టీలు చేసుకోవడం, టూర్లకు వెళ్లడం, సినిమాలు చూడటం, ఆటలు ఆడటం… ఇలా అనేకం ఉంటాయి. కానీ, వాటంటిన్ని వదులుకొని తమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. జనం జీవితాల్లో మార్పు కోసం పరితపించే వారు కొందరుంటారు. ఆ కొందరు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారు. విఫలమైన ప్రతిసారీ వారిలోని లోపాలను సరిచేసుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసిన వీరంతా కష్టాల కడలిలో ఎగసిన స్ఫూర్తి కెరటాలు. సివిల్ సర్వీసెస్ – దేశంలో కోట్లాది మంది యువత మదిలో మెదిలే అత్యున్నత ఉద్యోగం. అన్ని పరీక్షల కంటే అత్యంత క్లిష్టంగా, అనేక వడపోతలతో సాగే ఈ ప్రక్రియ గురించి వింటేనే… వామ్మో మనకెలా సాధ్యం..? అనే భయం కలుగుతుంది. ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్.. ఇలా 24 అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యేందుకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల కోసం ఎంపియ్యేందుకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలకు ఇప్పుడు హైదరాబాద్ అడ్డాగా మారింది. సివిల్స్ విజేతల ఫ్యాక్టరీగా హైదరాబాద్ అవతరించింది. సివిల్ సర్వీసెస్‌లో తెలుగు బిడ్డల జైత్రయాత్ర గత నాలుగేండ్లుగా కొనసాగుతూనే ఉంది.
తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఏపీల నుంచి సుమారు 60 మంది విజేతలుగా నిలిచారు. మహబూబ్‌నగర్‌కు చెందిన దోనూరు అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. తెలంగాణ అభ్యర్థులు వరుసగా రెండో సంవత్సరం జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం విశేషం. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు వందలోపు ర్యాంకులు, 11 మంది 200లోపు ర్యాంకులు పొందారు. విజేతలుగా నిలిచినవారిలో మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ఐఐటీ కాన్పుర్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేసిన లఖ్‌నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ పరీక్షలో తొలి స్థానంలో నిలిచారు. ఒడిశాలోని అనుగుల్ జిల్లా తాల్చేరు వాసి అనిమేష్ ప్రధాన్ ద్వితీయ స్థానంలో నిలిచారు. పి.కె.సిద్ధార్థ్ రామ్‌కుమార్, రుహానీలు వరుసగా నాలుగు, అయిదు స్థానాలు దక్కించుకున్నారు. తొలి అయిదు స్థానాలు సాధించిన వారిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
లక్ష్యమే నన్ను నడిపింది
‘జీవితంలో కచ్చితంగా ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. దాన్ని చేరుకునేందుకు ఈ ప్రపంచం నీకు ఏదో ఒకలా సహాయ పడుతుంది..’ అన్న ఆల్కెమిస్ట్ పౌల్ కోయెల్హో మాటల్నే స్ఫూర్తిగా తీసుకుంది కేరళకు చెందిన సారిక. సెరెబ్రల్ పాల్సీ కారణంగా చిన్న వయసు నుంచి చక్రాల కుర్చీకే పరిమితమైన ఆమె.. ఈ శారీరక లోపాన్ని అధిమించి తానేంటో నిరూపించుకోవాలనుకుంది. ఈ సంకల్పంతోనే సివిల్స్ సాధన చేసిన సారిక.. తాజా ఫలితాల్లో 922 ర్యాంకు సాధించింది. తద్వారా శారీరక లోపాలు విజయానికి ఏ మాత్రం అడ్డు కావని నిరూపించింది. ‘సెరెబ్రల్ పాల్సీ కారణంగా నా కుడి చేయి పనిచేయదు. వీల్ ఛెయిర్‌ను కదిలించడం, రాయడం, తినడం, ఇతర పనులన్నీ ఎడమ చేత్తోనే చేస్తుంటా. అమెరికాకు చెందిన జెస్సికా కాక్స్ నా జీవితానికి అతిపెద్ద స్ఫూర్తి ప్రదాత. రెండు చేతులు లేకపోయినా కాళ్లతో విమానం నడిపి.. పైలట్ లైసెన్స్ సాధించిందామె. డిగ్రీ పూర్తయ్యాక సివిల్స్ సాధన మొదలుపెట్టా. ఇక నా సివిల్స్ జర్నీలో అమ్మానాన్నలూ ఎంతగానో సపోర్ట్ చేశారు. రెండో ప్రయత్నంలో నాకు ర్యాంకొచ్చింది. నాన్న ఖతార్‌లో పనిచేస్తున్నప్పటికీ.. నా సివిల్స్ పరీక్షల కోసం ఇండియాకొచ్చారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలకు హాజరయ్యే క్రమంలో అమ్మానాన్నలు నాతోనే ఉన్నారు. ఎన్ని సవాళ్లెదురైనా నాలో ధైర్యం నింపారు. ఏదేమైనా నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది..’ అంటోందీ సివిల్స్ ర్యాంకర్.
చీకటి వెనుక వెలుతురు
విశాఖపట్నానికి చెందిన వేములపాటి హనిత రెండో కోవకు చెందుతుంది. మొదటి మూడు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ దగ్గరే ఆగిపోయిన ఆమె.. నాలుగో ప్రయత్నంలో మెయిన్స్, ఇంటర్వ్యూ దశలు కూడా దాటి సివిల్స్‌లో 887వ ర్యాంకు సాధించింది. అరుదైన వ్యాధి కారణంగా చక్రాల కుర్చీకే పరిమితమైనా తన కలను సాకారం చేసుకుంది. ‘సివిల్స్ లక్ష్య సాధనలో నాకు ముందు నుంచీ సరైన గైడెన్స్ లేదు. కానీ ప్రతి ప్రయత్నంలో నన్ను నేను మెరుగుపరచుకున్నా. చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాను. ఆ పట్టుదలే ర్యాంకు తెచ్చిపెట్టింది. మన జీవితానికంటూ ఓ సార్థకత ఉండాలని పదే పదే మా గురువు గారు చెబుతుండేవారు. సివిల్స్ అందుకు చక్కని మార్గమంటూ దిశానిర్దేశం చేశారు. ఆయన మాటలే నన్ను సివిల్స్ వైపు అడుగులు వేయించాయి. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటొచ్చినప్పుడు Transverse Myelitis’ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డా. దీంతో ఒక్కసారిగా నడుస్తూనే సడెన్‌గా కింద పడిపోయా. నాలుగ్గంటల్లోనే పక్షవాతం రావడంతో నడుం కింది భాగం చచ్చుబడిపోయింది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. వెన్నెముకలో ఇన్ఫెక్షన్ వల్ల ఈ సమస్య వచ్చినట్లు, ఇక జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితమవ్వాల్సి వస్తుందని వైద్యులు చెప్పారు. ఆ క్షణం మానసికంగా ఎంతో క్షోభను అనుభవించా. ఆ తర్వాత కోలుకొని డిగ్రీ పూర్తిచేశా.. నాలుగో ప్రయత్నంలో సివిల్స్ కలనూ సాకారం చేసుకున్నా. నా ఈ జర్నీలో అమ్మానాన్నల ప్రోత్సాహం ఎంతో ఉంది. సాధారణ వ్యక్తుల్లాగే ప్రత్యేక అవసరాలున్న వారినీ ఈ సమాజం సమాన దష్టితో చూడాలనేది నా కోరిక. ఓ సివిల్ సర్వెంట్‌గా నేనూ ఇదే చేయాలనుకుంటున్నా. చీకటి వెనుక వెలుతురు ఉంటుందని నేను నమ్మిన సిద్ధాంతమే నన్ను ఈ రోజు మీ అందరి ముందు నిలబెట్టింది..’ అంటూ తన జర్నీని పంచుకుంది హనిత.
పట్టుదలతో సాధించలేనిది లేదు
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం, వెలిచాలకు చెందిన నందాల సాయి కిరణ్ సివిల్స్‌లో 27వ రాంక్ సాధించారు. సాధారణ కుటుంబంలో పుట్టారు సాయికిరణ్. తండ్రి కాంతారావు చేనేత కార్మికునిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. క్యాన్సర్ బారినపడి 2016లో మతి చెందాడు. బీడీ కార్మికురాలైన తల్లి లక్ష్మి రెక్కల కష్టంపై కుటుంబం నడిచింది. దీనితో తాను చదువుకునే వయసులోనే కుటుంబానికి సాయంగా ఉండేందుకు తాను ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యారు. చివరికి దేశంలోనే 27వ ర్యాంక్ సాధించి పట్టుదలతో సాధించలేనిది ఏదీ లేదని నిరూపించి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సాయి అక్క స్రవంతి ప్రస్తుతం ఏఈఈగా ఉద్యోగం చేస్తుంది.
రోజుకు 14 గంటలు చదివాను..
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన దోనూరు అనన్యరెడ్డి… దోనూరు మంజుల, సురేశ్‌రెడ్డిది వ్యవసాయ కుటుంబం. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్దమ్మాయి అనన్య. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని యూనివర్సల్ పాఠశాలలో ప్రాథమిక విద్య, కాకతీయ పాఠశాలలో ప్రాథమికోన్నత విద్య, గీతం పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్ నారాయణ ఐఏఎస్ జూనియర్ కళాశాలలో ఇంటర్… ఢిల్లీలోని మిరిండా హౌస్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అప్పటి నుండే… సివిల్స్ వైపు దష్టి పెట్టిన ఆమె… ఆంత్రోపాలజీ ఆప్షనల్ సబ్జెక్టుగా సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. ప్రతిరోజు 12 నుంచి 14 గంటలపాటు పుస్తకాలతో కుస్తీ పట్టడంతో తొలి ప్రయత్నంలోనే విజయం ఆమెను వరించింది.
తల్లీ మరణం కృంగదీసినా
అనుగుల్ జిల్లాలోని తాల్‌చేర్‌కు చెందిన అనిమేశ్.. కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నారు. రావుర్కెలాలోని ఎన్‌ఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం దిల్లీలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీస్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. 2022లో సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించా. సోషియాలజీని ఆప్షనల్‌గా ఎంచుకున్నా. రోజుకు 5-6 గంటల పాటు చదివా. పరీక్ష కోసం ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. సివిల్స్ ఫలితాలు చాలా సంతప్తిని ఇచ్చినా… 2015లో తండ్రిని, సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు తల్లిని కోల్పోవడం అత్యంత విషాదం. ”ఐఏఎస్‌కు తొలి ప్రాధాన్యం ఇచ్చానని, ఒడిశా క్యాడర్ ఆశిస్తున్నాను. నా రాష్ట్ర ప్రజలు.. ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, వెనుకబడిన ప్రాంతాల వారి అభ్యున్నతి కోసం పని చేయాలనుకుంటున్నా” అని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. పార్లమెంటరీ డిబేటింగ్, మీడియా అడ్వకసీ- జర్నలిజం, ఫ్రీ-స్టైల్ డ్యాన్స్ అతని హాబీలు.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417