ఆకాశమంత కవిత్వం

data structure”డియర్‌ ఆకాశ్‌,

ఈ రోజు (26.6.2022) నవతెలంగాణ సోపతిలో నీ బీటెక్‌ జర్నీ కవిత చదివినంక (నీ కవితలను నవ తెలంగాణ పత్రికలలో ప్రచురించి నీకు ధైర్యాన్ని ఇచ్చిన అనంతోజు మోహనన్నకు ప్రేమలు) మనసంతా వానకు తడిసిన విత్తనపు సాలు లెక్క మారింది. పదేళ్ళ క్రితం పాల్కురికి సోమనాథుని పాఠాన్ని చెబుతుంటె కనురెప్ప వేయకుండ విన్న ఎం.వి.ఆకాశేనా ఇది రాసింది? బడి అయిపోయినంక బస్సెక్కిందాక నిలబడి సాగదోలిన నా ప్రియమైన ఆకాశమేనా ఇది రాసింది? ఎంతని ప్రేమనైనా గుండెలోనె దాచుకొని ఋషి లెక్క కనిపించె వెస్ట్‌ మారేడుపల్లి నా స్టూడెంటేనా ఇది రాసింది?” అని మనసులో ఎంత సంతోషపడ్డనో మాటల్లో చెప్పలేను.
నేను వెస్ట్‌ మారెడుపల్లిలోని విద్యాకిరణ్‌ టెక్నో స్కూల్‌లో టీచర్‌గా పనిచేసింది రెండేళ్ళే అయినా జీవితాంతం మరిచిపోని ప్రేమను పంచింది. సికింద్రాబాద్‌కు ఏ పని మీద వొచ్చినా విద్యా కిరణ్‌ టెక్నో స్కూల్‌ను తలువకుండా, మిమ్మల్ని కలువకుండా పోయిన రోజులు లేవు. మీ స్కూల్‌ నుంచి నేను వెళ్ళిపోయేటపుడు ఎనిమిదవ తరగతిలో నీవు రాసిన కొలవరి సాంగ్‌ గుర్తుందా? ఎన్నెన్ని వెచ్చటి కన్నీటి జ్ఞాపకాలో ఆ పాట చుట్టూ. పేరడి పాటను ఎంతో ఉద్వేగంగా నడిపిన నీ ప్రతిభ గురించి ఇప్పటికీ మా బడిపిల్లల ముందు గుర్తుచేసుకుంట.
ఇప్పటి వరకు నీవు రాసిన కవితలన్నీ ఊహాలోకంలో విహరించి రాసినవి కావు. జీవితంలో ఎదురైన వాస్తవ దశ్యాలను నీలోకి తీసుకొని, తనివితీరా అనుభవించి, పలువరించి రాసినవి. ఇప్పటిదాక ఏడెనిమిది కవితలే రాసినా, నిరు పేదల జీవితాన్ని చిత్రించినవి, శ్రామికుల చెమట బొట్ల ముందు మోకరిల్లి రాసినవే ఉన్నయి.
కార్మికుల దినోత్సవం సందర్భంగా రాసిన ‘నెత్తుటి యోధులు’ కవితలో కార్మికుల శ్రమను గొప్పగా కవిత్వకరించావు.
”ఎర్రని మట్టి గంపను నెత్తిన పెట్టుకొని/ ఐదు అంతస్తులు మేడ ఎక్కుతుంటే/ సూర్యుడినే ఆకాశానికి/ తీస్కపోతున్నటు కనిపిస్తరు”
మట్టిగంపలో పెట్టుకొని సూర్యుడిని ఆకాశానికి తీసుకపోతారడనం గొప్ప ఊహ. నీ భావుకత సహజమైనదో, గొప్పదో చెప్పడానికి ఇలాంటి వాక్యాలు చాలు.
వాస్తవిక నగర జీవితాన్ని అద్దంలో చూపించిన కవిత ‘మంచీళ్ళొచ్చినై’. కొన్ని గల్లీలకు నీళ్ళు రానపుడు వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులను కండ్లకు కట్టినట్టు చూపించావు. హైద్రాబాద్‌ అనంగనే విలాసాలకు లోటు లేని నగరంగానో, గొప్ప దర్శనీయ స్థలంగానో చెబుతుంటారు గాని ఇలాంటి జీవితాల గురించి ఇంకా రావలసిన అవసరం ఉంది.
”సాయంత్రం ఐతే/ రాత్రైనా ఇంటికిరాని కొడుకు/ గురించి చూసినట్టు/ మంచినీళ్ళ గురించి ఎదురు చూస్తరు
బోరునీల్లు విడిచేది గంటసేపే/ ఒచ్చేదే ఇంటికి రెండు బిందలే/ పుస్తకాలలో చదువుకున్న కురుక్షేత్రాన్ని/ రోజు ఇంటి ముందుట చూస్తుంటం
డ్రమ్ముల కాడికెల్లి/ చిన్న సర్వల దాకా/ నీళ్ళ పండుగ చేసుకుంటయి/ రాత్రికి ఒండే అన్నంకి/ బియ్యం కూడా ఇప్పుడే/ కడిగి పెట్టుకుంటరు”
గల్లీలలో నీళ్ళ కోసం ఎదురుచూసే ఎదురుచూపులను కవిత్వీకరించడంలో ఎంతో సహజత్వం ఉంది.
డ్రమ్ముల దగ్గర నుంచి చిన్న చిన్న సర్వల దాక నీళ్ళు పట్టుకునే దశ్యాన్ని చెప్పడంలో నీ సూక్ష్మ పరిశీలన పరిశీలన తెలుస్తుంది.
మనల్ని వద్దనుకునే వాళ్ళు గొప్పవాళ్ళ దగ్గర ఉండడం కన్నా మనల్ని కావాలనుకునే చిన్న వాళ్ళ దగ్గర ఉండాలి అనే జీవిత సత్యాన్ని ఒక మినీకవితలో చెప్పావు.
”వెలుగు నన్ను ఒదిలేసినా/ కటిక చీకటి చేయందించింది/ పండుటాకును చెట్టు కొమ్మ వద్దనుకున్నా/ సిరులు పండించె నేల గుండెకు అద్దుకుంది”
ఈ మినీకవితలో నీదైన అనుభవాన్ని ఎంతో గాఢతతో వ్యక్త పరిచావు. దేనికీ తొందరపడని తనం, అందరినీ కలుపుకొని నడిచే స్నేహ గుణం, సున్నితమైన దశ్యాలకు కదిలిపోయే తత్వం, పెద్దరికంగా ఆలోచించె విధానం నీలోని ప్రత్యేకత. అవి నీ కవిత్వంలో కనబడకుండా ఎలా ఉంటాయి చెప్పు ?
‘బి.టెక్‌ జర్నీ’ కవిత బి.టెక్‌ పూర్తి చేసిన విద్యార్థి మళ్ళీ తన కాలేజి జ్ఞాపకాల్లోకి వెళ్ళినట్లుగా ఉంది. కాలేజీలోకి అడుగుపెట్టింది మొదలు ఫైనల్‌ ఇయర్‌ దాక బి.టెక్‌ జీవితమంతా ఈ కవితలో కనబడింది. క్లాసురూంలలో ఎలాంటి కేరింతలు ఉంటాయో, క్యాంటిన్ల దగ్గర ఎలాంటి సరదాలు ఉంటాయో చెబుతూనే బి.టెక్‌ చదువులు ఎలా సాగుతాయో చెప్పావు. బి.టెక్‌ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరిని వాళ్ళవాళ్ళ కాలేజి రోజుల్లోకి తీసుకపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కవిత చదవగానే ”పాదమెటు పోతున్న/ పయనమెందాకైనా” పాట గుర్తొచ్చింది. కొంత భాగమైనా ఆ కవితను మళ్ళీ గుర్తు చేస్తా.
”జీవితంలో వెనుకబడుతాను అనుకున్నాడేమో/ మా M1 సార్‌ ఎప్పుడు క్లాస్కొచ్చినా/ లాస్ట్‌ బెంచ్‌ నుంచి ముందుకు తిస్కొచేట్టోడు/ క్లాస్‌ బంక్కొట్టి మల్టీప్లెయర్‌ గేమ్స్‌ ఆడుతుంటే/ ఇంక మిరు మారరా అని అనే M3 మేడం మాటలు/ మా లక్ష్యాన్ని గుర్తు చేసేవి/ ఎగ్జామ్‌ హల్లో వెనుక ఆన్సర్‌ షీట్ను/ చూడడం కోసం చేసే ప్రయత్నం/ ఏ సర్కస్‌ ఫీట్కు తీసిపోదు/ చివరి క్షణంలో చెమటబొట్టు/ కంటిరెప్పను పలకరిస్తూ అన్సర్‌ శీట్తో చేయి కల్పడం/ ఇంకా నా కళ్లముందే కదులుతుంది/ ఎగ్జామ్స్‌ తర్వాత బావర్చిలో ఫ్రెండ్స్‌ అందరం కలిసి తిన్న బిర్యానీ వాసన ఇంకా చేతులకి అలానే ఉంది/ అస్సైన్మెంట్‌ సబ్మిషన్‌ రోజు/ పెన్ను పెపర్లతో మేమంత కుస్తిపడుతుంటే/ పక్కనోని అసైన్మెంటును జిరాక్స్‌ తీసి సబ్మిట్‌ చేసే/ కష్ణలీలలు మా ఫ్రెండ్‌ ఒక్కడికే సాధ్యం

ఇస్త్రీ చొక్కా ఎసుకొని చేతికో వాచి తగిలించి/ కొత్త పెళ్లి కొడుకులా ముస్తబయ్యి/ లాబ్‌ ముందు నిల్చునేటోల్లం/ వైవాలో అడిగిన క్వశ్చన్‌లకు/ అరుంధతి నక్షత్రం దిక్కు తలలు తిప్పెటోలం/

సీనన్నకు గొంతినంగనే మా ఆకలి తెలిసేదేమో/ ఫోన్‌ కొట్టంగనే క్యాంటీన్లో ఎంతపెద్ద లైన్‌ ఉన్నా/ ముందు మాకు ఫ్రైడ్‌ రైస్‌ పంపించేటోడు/ సాయంకాలం పానిపూరి తిని ఖాతాపుస్తకంలో/ హజీరు వేయించుకునేవాళ్ళం

జ, జంం, జీaఙa అంటూ/ కంప్యూటర్‌ లాంగ్వేజ్‌ వెనుక/ ఎన్నో పరుగులు తిసాము/ GRE,Toefl అంటూ/ విమానాన్ని పట్టుకోడానికి జింకపిల్లలక్క/ చంగుచంగుమని మరెన్నో గంతులేసాం/ Data structures ఇంకాSQL టేబుల్స్‌లో/ మా జ్ఞాపకాలను పదిలంగా భద్రపరిచాము”
సబ్జెక్టుల విషయంలో బి.టెక్‌ విద్యార్థులు మాట్లాడుకునే భాష (M1,M3), తరగతి వాతావరణం కవితకు తాజాదనాన్ని తెచ్చాయి. కంప్యూటర్‌ విద్యకు సంబంధించిన పరిభాష కూడా ఈ కవితకు కొత్త అభివ్యక్తిని తెచ్చింది. చాలా ఒడుపుగా కంప్యూటర్‌ భాషలను, పరిభాషను పోలికలుగా వాడుతూ కవితను నడిపించావు.
GRE (Graduate Record Examinations), toefl(టోఫెల్‌-Test of English as a Foreign Language) లు విదేశాలకు పోవడానికి రాసే పరీక్షలు. విమానాన్ని పట్టుకోవడానికి జింక పిల్లల లెక్క అనడంలో ఆ పరీక్షల లక్ష్యం స్పష్టంగా సమన్వయం కుదిరింది.Sql (Structured Query Language) టేబుల్‌ అనేది కంప్యూటర్లో మనకు కావలసిన డేటాను స్టోర్‌ చేసేది. data structure బతీవ కూడా అలాంటిదే. వీటిల్లో జ్ఞాపకాలను భద్రంగా స్టోర్‌ చేశామని చెప్పడం చాలా కొత్తగా ఉంది.
ల్యాబ్లో అడుగుపెట్టిన విద్యార్థులను కొత్త పెళ్ళికొడుకుతో పోల్చి వెంటనే వైవాలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పక దిక్కులు చూడడాన్ని అరుంధతి నక్షత్రం దిక్కు చూస్తారని చెప్పడం విషయ కవిత మీద నీకున్న శ్రద్ధను తెలియజేస్తుంది. పోలికల మధ్య సమన్వయం చెడకుండా జాగ్రత్తపడ్డావు.
ఏ కవితకైనా ఎత్తుగడ, ముగింపులు ప్రాణనాడులలాంటివి. కవితలోనికి వెళ్ళడానికైనా, కవిత చదివినంకా ఇంకా అది మనల్ని వెంటాడడానికైనా వీటి ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. ఈ కవితలో నీవిచ్చిన ముగింపు అలాంటిదే. ‘నాలుగేళ్ళు నా ఇల్లైన కాలేజీ గుర్తొస్తుంది’ అనడం ద్వారా ఒక కుటుంబంగా జీవించిన కాలేజి ప్రేమలన్నింటిని చూపించావు.
హైద్రాబాద్‌ జీవితం నీ కవిత్వానికి ముడిసరుకు కావాలి. చిత్తు కాగితాలు ఏరుకునె వాళ్ళ దగ్గర నుంచి సాయంత్రం క్లినిక్లో పని చేసే మిత్రుల జీవితాల వరకు నీ చూపు విస్తరించాలి. కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వెస్ట్‌ మారెడు పల్లి ప్రజల జీవనాడి దొరికిచ్చుకోవాలి. సిటీలైఫ్‌ను సరికొత్తగా దర్శించాలి.
నాయిన ఆటో నడుపుతూ నిన్ను, అన్నను ఎంత కష్టపడి చదివించిండో దగ్గరి నుండి చూసిన వాడిని. దండ కడియానికి కేంద్ర సాహిత్య యువ పురస్కారం వచ్చినపుడు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అభినందన సభ ఏర్పాటు చేసినపుడు నాన్ననే తన ఆటోలో స్వయంగా దించి వెళ్ళడం ఎంతో గౌరవం అనిపించింది.
హైద్రాబాద్‌ పోయిన కొత్తలో నగరజీవితం పట్ల ఒక నిరసన భావం ఉండేది. హైదరాబాద్‌ జీవితం తీరిక లేనిది, మనుషుల మధ్య అంత అనుబంధాలు ఉండవనే అనుకునేది. కానీ విద్యాకిరణ్‌ స్కూల్‌లో పని చేసినన్ని రోజులు వాటన్నింటిని దూరం చేసింది. ప్రేమిస్తే ప్రాణమైన ఇచ్చె హైద్రాబాదీల తత్వం మీ స్నేహం వలన నాకు తెలిసింది. ఆకాశ్‌! ఎప్పుడూ చెబుతుంటాను మీరంతా నా ఆత్మీయ ప్రపంచమే కాదు, ఆత్మ కూడా.
2013లో మా నాయిన చనిపోయినపుడు మీ టెన్త్‌ క్లాస్‌ బ్యాచంతా చూడడానికి భవాని టీచర్‌తో కలిసి మా ఊరికి వచ్చిండ్రు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలను తల్చుకుంటే గుండె సెలిమె నిండుతది. ఆసిఫ్‌, భరత్‌, విష్ణు, రాకేష్‌ అన్నను అడిగినట్లు చెప్పు. ఆకాశ్‌! ఇక ఉంటాను, సరేనా. అత్యంత ప్రేమతో
మీ తగుళ్ళ గోపాల్‌
– తగుళ్ళ గోపాల్‌
9505056316

Spread the love