పాడుబుద్ధి

పాడుబుద్ధిపినాకినీ నదీతీరంలోని ఓ మర్రి చెట్టు మీద రాములమ్మ అనే ముసలికాకి ఉండేది. ఆ చెట్టుమీదే కాకుండా పక్కనున్న చెట్ల మీద కూడా అనేక కాకులు గూళ్ళు కట్టుకొని ఉండేవి. బయట తిరిగి ఆహారం సంపాదించుకోలేని ముసలికాకి ఆ గూటికి, ఈ గూటికి వెళ్ళి.. వారికి ఆమాట ఈమాట చెప్పి, అవి పెట్టింది తిని కాలం వెళ్ళబుచ్చేది. ఒకరి విషయాలు మరొకరికి కథలు కథలుగా చెప్పేది. అలా చెప్పేటప్పుడు ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పి ఆనందించేది.
ఒకసారి ఆ మర్రిచెట్టు మీదికి ఎక్కడ నుండో ఓ కాకుల జంట వచ్చి కొత్తగా గూడు కట్టుకున్నాయి. రెండూ ఎంతో ఉత్సాహంగా కబుర్లు చెప్పుకొనేవి. ఒకటి రెండు సార్లు ముసలికాకి వాటిని పలకరించిది. కాని అవి ముసలికాకిని పట్టించుకొలేదు. అన్ని కాకులు తనకు గౌరవం యిచ్చి.. తనతో కబుర్లు చెప్పించు కుంటూవుంటే.. ఈ కొత్తజంటకు అంత పొగరా? అని లోలోపల రగిలి పోసాగింది.
ఒకరోజు ముసలికాకి పక్క కొమ్మ మీది కాకుల గూటికి వెళ్ళి, ”ఏమేవ్‌.. సుబ్బులమ్మా..! అదిగో ఆ కొమ్మ మీదున్న కొత్త కాకుల జంటను చూశావా..?” అంది.
”చూశాను. చక్కని జంట. ముచ్చటగా వున్నాయి…” చెప్పింది సుబ్బులమ్మ కాకి.
”ముచ్చటా.. నా బొందా..? ఆ మగ కాకి ఏమంత మంచిది కాదు. పొద్దున్నే రెండూ ఆహారం కోసం బయటకెళ్తాయా..! ఆడదేమో.. పాపం ఆహారం కోసం చాలాదూరంగా వెళ్తుంది. ఈలోగా మగదానికి మరో ఆడది జతవుతుంది. రెండూ.. అదిగో..ఆ గుబురు చెట్టు మీద కొమ్మల్లో చేరి ఒకటే పకపకలు, యిక యికలు. ఆ మగకాకి రెండు గూళ్ళ సంసారం చేస్తుంది…” మెల్లగా చెవిలో చెప్పింది.
”అవునా..!!” అని బుగ్గ నొక్కుకుంది సుబ్బులమ్మ.
ముసలి కాకి ఆరోజు నుండి ఈ సంగతి అక్కడక్కడా.. మిగతా గూళ్ళలో కూడా చెప్పింది. కొన్ని ముసలికాకి మాటలు నమ్మాయి. మరికొన్ని నమ్మలేదు. యెలాగైతేనేమి. ఈ మాటలు ఆనోటా.. ఈ నోటా.. పాకి ఆ జంటదాకా వెళ్ళాయి.
పుకారు నమ్మిన ఆడకాకి, మగకాకితో గొడవ పడింది. తను తప్పు చేయలేదని.. తనను నమ్మమని ఎంతగానో ప్రాధేయపడింది మగకాకి. కాని ఆడ కాకి వినిపించుకోక తన పుట్టింటికి వెళ్ళింది.
ఇదంతా గమనిస్తున్న సుబ్బులమ్మ కాకి మనసు బాధపడింది. ఇది ఆ ముసలికాకి నిర్వాహకం అని, దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకొంది. తన మగకాకితో జరిగిందంతా చెప్పింది.
అదికూడా .. ”దీన్ని ఇలాగే వదిలేస్తే మరిన్ని కాకుల సంసారాల్లో చిచ్చు పెడుతుంది. దానికి ఇప్పుడే ఏదో ఒకటి చేయాలి..” అంది.
వెంటనే తన మిత్రులైన మరికొన్ని కాకుల్తో ఈ సంగతి చెప్పింది. అది విన్న మిగతా కాకులు నిజమే మనమంతా జాగ్రత్త పడకపోతే.. మనందరి కాపురాలు కూలిపోతాయి, పదండి. ఇప్పుడే దాని సంగతి తేలుస్తాం” అని అన్నీ బయలదేరాయి.
అన్నీ కలసి.. ముసలికాకి గూడు దగ్గరకు వెళ్ళేససరికి, లోపల నుండి దాని నవ్వు వినిపించి, బయట ఆగాయి.
లోపల నుండి మాటలు వినపడ్డాయి.. ”ఏంటోరు.. నేనంటే అంత అలుసా? చెట్టుమీది కాకులన్నీ నా పెద్ద్దరికాన్ని గౌరవించి, మర్యాదలు చేస్తాయి. అవన్నీ నేను చెప్పే మాటలు వింటుంటే.. కొత్తగా వచ్చిన మీకింత పొగరా..? ఈ ముసలి కాకి రాములమ్మతో పెట్టుకుంటే ఏమవుతుందో..తెలిసిందా..? చక్కని జంటట..! అందుకే వాటి కాపురంలో చిచ్చు పెట్టాను. నా దెబ్బకి చెరో దిక్కు పట్టుకుపోయాయి. ఎవరైనా సరే.. నాతో పెట్టుకుంటే.. అంతే..!” అంటూ బిగ్గరగా నవ్వుకోసాగింది.
బయట వింటున్న కాకులకి దాని పాడుబుద్ధి అర్ధమైంది. అన్నీ లోపలకెళ్ళి, ”ముసలిదానివని దగ్గరతీసి యింత ఆహారం పెడుతుంటే.. తిని మంచిగా ఆలోచించక.. యిలా పాడుబుద్ధితో.. పక్కవారి కాపురాల్లో నిప్పులు పోస్తావా? నువ్వు ఒక్క క్షణం కూడా ఈ చెట్టు మీద వుండడానికి వీల్లేదు” తమ ముక్కులతో పొడిచి పెట్టాయి. వాటి దాటికి తట్టుకోలేక అది గూడు వదిలి పారిపోయింది.
కొన్ని కాకులు అలిగిపోయిన ఆడకాకికి వెతుక్కుంటూ వెళ్లి, దానికి అసలు విషయం చెప్పి తిరిగి తీసుకొచ్చాయి. చెప్పుడుమాటలు విని ప్రేమతో చూసుకుంటున్న తన మగ కాకిని అనుమానించినందుకు అది బాధపడింది. తమను కలిపిన మిగతా కాకులకు ఆ జంట ధన్యవాదాలు చెప్పాయి.
ఆ ముసలికాకి ఎక్కడకు వెళ్ళిందోగానీ.. మళ్లీ ఆ మర్రిచెట్టు ఛాయలకు రాలేదు.

– కైపు ఆదిశేషారెడ్డి, 9985714281

Spread the love