ప్రియమైన అమ్మ

ప్రియమైన అమ్మతరగతి గదిలో పిల్లలంతా కేరింతలు కొడుతూ, గొడవ చేస్తుండగా సుందరం మాస్టారు తరగతి గదిలోకి ప్రవేశించారు. ఒక్కసారిగా తరగతి అంతా నిశ్శబ్దంగా మారింది. సుందరం మాస్టారు గొంతు సరిచేసుకొని కళ్లజోడు పైనుండి చూస్తూ ”ఏమిటర్రా పిల్లలూ! ఇప్పటి దాకా తెగ మాట్లాడేస్తున్నారు .. దేని గురించి?” అంటూ పాఠ్యపుస్తకాలు తీయండి అన్నారు
పిల్లలంతా నీరసంగా ”అలాగే మాస్టారూ..!” అంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ సమయం ఎప్పుడు అయిపోతుందా అన్నట్లు గోడ గడియారం వైపు చూస్తూ పుస్తకాలు తెరిచారు. ఇది గమనించిన సుందరం మాస్టారు వారిలో ఉత్సాహం నింపడానికి ”ఈ రోజు పాఠాలు మీరు చెప్పండిరా పిల్లలూ” అన్నారు.
పిల్లలంతా ఏమీ అర్థం కానట్టు అమాయకంగా చూస్తూ ఉన్నారు
”ఏమిటర్రా! మీరు అలా నా ముఖంవైపు చూస్తున్నారు. మొదలు పెట్టండి” అన్నారు. వారిలో విఘ్నేష్‌ భయం భయంగానే చిన్నగా లేచి మాస్టారు! ”మేమా..? మరీ…. మరీ” అంటూ ఏమి చెప్పాలి అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు.
వాడి చూపుకి అర్థం తెలిసిన సుందరం మాస్టారు ”మీరు ఏదీ చెప్పినా వింటాను .. అది మీ కథైనా, మీకు తెలిసిన కథైనా. నీ గురించైనా, మీ అమ్మ గారి, నాన్నగారి గురించైనా… ఇలా ఏదైనా మీ ఇష్టం” అన్నారు మాస్టారు
”మరీ… పాఠం సంగతో” అన్నాడు విఘ్నేష్‌.
”గొప్ప గొప్ప వారి జీవితచరిత్రలే కదా మనం పాఠాలుగా చెప్పుకునేదీ.. వారు చేసిన కషి గురించి, వారి జీవితం నుండి మనం నేర్చుకోవలసిన మంచి, ఇలా మీకు తెలిసిన, చూసిన లేదా చేసిన ఏదైనా మంచి గురించి చెప్పండి” అన్నారు సుందరం మాస్టారు.
”అలాగైతే నేను చెప్తా మాస్టారూ..” అంటూ రవి పైకి లేచాడు
వాడి ఉత్సాహానికి మురిసిపోయి సంతోషంతో ”చెప్పు” అన్నారు సుందరం మాస్టారు.
”అమ్మ తెలుగు భాషలో ఒక తియ్యని పదం. అమ్మ చాలా విషయాలు నేర్పిస్తుంది. మనకు గురువులు బడిలో చదువు నేర్పిస్తే అమ్మ మనకు తన ఒడిలో చదువు, సంస్కారం నేర్పిస్తుంది. అందుకే ఆది గురువు అమ్మ. ఎంతమంది పిల్లలున్నా అమ్మ ప్రేమలో లోపం, లోటు ఉండదు.
అమ్మ తన జీవితంలో చేసిన పొరపాట్లు మనం చేయకూడదని ముందు జాగ్రత్తలు చెబుతుంది. అమ్మ తనకు ఇష్టమైనవి మన కోసం త్యాగం చేసి, మన ఆనందం కోరుకుంటుంది. మనల్ని మంచిదారిలో నడిపిస్తుంది. అమ్మ తన మధురమైన గొంతు ద్వారా మనకు సష్టిలోని అన్నింటినీ పరిచయం చేస్తుంది. మనతో కొట్లాడుతూ మనపై నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ. అన్నం వద్దని మారాం చేస్తే బుజ్జగించి, బ్రతిమిలాడి తన 5 వేళ్ళను ప్రేమగా మార్చి మనకు గోరుముద్దలు తినిపిస్తుంది. చిన్నప్పుడు మనకి అమ్మ విలువ తెలియదు కానీ ఒక్కసారిగా అమ్మ లేకపోతే అప్పుడు తెలుస్తుంది మనకి అమ్మ విలువ ఏంటో. అమ్మ మనల్ని తిడితే మనకి కోపం వస్తుంది. కానీ ఒకసారి ఆలోచిస్తే తప్పు మనదే అనిపిస్తుంది. అమ్మ కోపంలో బాధ్యత ఉంటుంది. మనం అల్లరి చేస్తే గాని అమ్మ మనల్ని తిట్టదు. మనకి ఏదైనా దెబ్బ తగిలితే మనం అమ్మా అని అంటాం. అమ్మ మన దగ్గర లేకపోయినా అమ్మకి ఆ కేక వినిపిస్తుందంట. మనం బడికి వెళ్లేటప్పుడు మన అమ్మ దూరంగా నిలబడి నవ్వుతూ టాటా చెబుతుంటే ఆ నవ్వుని చూసి సంతోషించని బిడ్డ ఈ లోకంలో ఎక్కడైనా ఉంటాడా?
మనం అమ్మను గౌరవించాలి. మనం బాగా చదువుకుంటే, పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకుంటే మన అమ్మ చాలా ఆనందిస్తుంది. మన ఎదుగుదలే తల్లికి నిజమైన సంతోషాన్ని ఇస్తుంది. మనల్ని హీరోగా భావించే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ. మనం అమ్మకు పనులలో సహాయపడాలి. మన పనులను అమ్మ పై వేయకూడదు. నేనంటే మా అమ్మకు చాలా ఇష్టం. ఇంతే మాస్టారు” అన్నాడు రవి . పిల్లలంతా గట్టిగా చప్పట్లు కొట్టారు .
”విన్నారుగా పిల్లలూ! ఈ సృష్టిలో అమ్మ ప్రేమ ఒక్కటే కల్మషం లేనిది. అలాగే కల్మషం లేని మనస్సు పిల్లలది. మీరు కూడా అమ్మ మనసుని కష్టపెట్టకుండా చూసుకుంటారు కదూ!” అని అన్నారు సుందరం మాస్టారు.
పిల్లలందరు సంతోషంతో ”చూసుకుంటాం మాస్టారు” అన్నారు. ఈలోగా బడి గంట మోగింది. సుందరం మాస్టారు తరగతి గది బయటకు నడిచారు. పిల్లల మనసు ప్రేమతో నిండింది.
ధూళిపాళ్ళ లిఖిత్‌ సాయి
6 వ తరగతి.

Spread the love