హ్యాట్స్‌ ఆఫ్‌ జయలక్ష్మి..

Hats off Jayalakshmi..సూర్యుడితో పోటీ పడి మరీ ఆమె పనికి బయలుదేరుతుంది. అమ్మ బండో, నాన్న బండో ఎక్కి ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తుంది. పదిగంటలకు కళాశాలలో విద్యార్థిని అవుతుంది. సాయంత్రం… పాఠాలు చెప్పే పంతులమ్మ, విరామం దొరికితే… సమస్యలపై పోరాడే సామాజిక కార్యకర్త. బస్తీల్లో కొత్తగా అంగన్వాడీలు సాధించుకొని… వాటిల్లోని పిల్లలకు అల్పాహారం అందించిన ఘనత ఆమెది. హైదరాబాద్‌ ‘చిల్డ్రన్స్‌ పార్లమెంట్‌’కు ప్రధానిగా చిన్నారుల్లో చైతన్యం రగిలిస్తున్న డిగ్రీచదువుతూ ఛేంజ్‌ మేకర్‌ అవార్డు అందుకున్న అరిపిన జయలక్ష్మి జీవితం భిన్న కోణాల సమాహారం. గమ్యం ఐఏఎస్‌.
అరిపిన జయలక్ష్మిది రాయలసీమ నుంచి బతుకుదెరుకు హైదరాబాద్‌ వచ్చిన వలస దళిత కుటుంబం. ముగ్గుపిండి అమ్ముకుని బతుకు వెళ్లదీసే కుటుంబం. జయలక్ష్మి తల్లిదండ్రులు హుసేనమ్మ, రామ్మోహన్‌ లు మాత్రం చెత్తబండి నడపడాన్ని ఉపాధి చేసుకున్నారు. చిన్న వయసులోనే పెండ్లి అయినా ఈ జంట బతుకుబండికి చెరో ఇరుసులా చెరోబండి నడిపేవారు. కాలనీ వాళ్లు నెలకు ఇంతని ఇచ్చే డబ్బులే ఆ కుటుంబానికి జీవనాధారం. వీరికి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. ఏ కష్టంచేసి అయినా పిల్లలను చదివించాలని తపన వారిది.
తల్లి కష్టాన్ని పంచుకుంటూ.. 
ఏడో తరగతి నుంచి ఈ రోజు వరకూ తల్లికి తోడు తానూ చెత్త సేకరించడం, తడిచెత్త పొడిచెత్తను వేరు చేయడం, డంపింగ్‌ యార్డ్‌లో పడేయడం అన్నీ చేస్తోంది. ఇది చాలా దారుణమైన పని అని, కష్టమైన పని అని అనేవారు లేకపోలేదు. కాని ”నా మటుకు నాకు ఇది అన్నం పెట్టే వత్తి. నేను దానిని గౌరవిస్తాను” అంటూ ఆ మాటలను కొట్టిపారేస్తోంది జయలక్ష్మి.
తొలి సారి స్కూల్లో…
జయలక్ష్మి చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేది. కాలనీలోని సమస్యలపై మాట్లాడేది. స్కూల్లో ఒకసారి ఇలాగే మాట్లాడితే ‘మాంట్‌ఫోర్ట్‌ సోషల్‌ ఇన్‌స్టిట్యూట్‌’ అనే ఎన్‌.జి.ఓ దృష్టిలో పడింది. పేదవర్గాల కోసం పని చేసే ఆ సంస్థ జయలక్ష్మిని తన కార్యకలాపాల్లో భాగం చేస్తూ ప్రోత్సహించింది. ఏడేళ్ల కిందట మాంట్‌ఫోర్ట్‌ సోషల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అనే స్వచ్ఛంద సంస్థ 56 బస్తీల్లో సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే చిల్డ్రన్‌ పార్లమెంట్‌ నిర్వహిస్తోంది. 6 నుంచి 18 ఏండ్ల వయసు పిల్లలను భాగస్వాములుగా చేసి వారి సమస్యలపై వారే చర్చించుకుని పరిష్కార మార్గాలు అన్వేషించేలా తీర్చిదిద్దింది. ఇందులో భాగమే పార్లమెంట్‌, ప్రధానమంత్రి. ఇక్కడి సమస్యలపై బాగా అవగాహన, చురుకుదనం ఉన్న జయలక్ష్మి ప్రధానిగా ఎన్నికయ్యింది. ”అమ్మానాన్నలు పొద్దునే కూలికి వెళ్లిపోతే… స్కూల్లో మధ్యాహ్నానికిగానీ అన్నం పెట్టరు. అంత వరకూ ఆకలితో ఉండాల్సిందే. ఆలోపు తినేందుకు ఏమైనా ఉంటే బాగుంటుంది కదా” అని ఓ చిన్నారి బాధపడింది. తక్కిన పిల్లలూ ఆమెతో గొంతు కలిపారు. అదే విషయంపై ఓ తీర్మానం చేశారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ ప్రధానమంత్రిగా ఉన్న జయలక్ష్మి ఈ విషయాన్ని తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్‌కు వివరించింది. చిన్నారుల ఆకలి బాధకు స్పందించి 56 బస్తీల్లో ఉన్న అంగన్‌వాడీలలో ఉదయం అల్పాహారం అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత మరో 21 బస్తీల్లోకి దీన్ని విస్తరించింది. దీనిపై స్పందిస్తూ.. ”స్లమ్స్‌లో ఉండే పిల్లల వికాసం కోసం నేను పని చేశాను. హైదరాబాద్‌లో 56 స్లమ్స్‌ ఉంటే వాటిలో 21 చోట్ల అంగన్‌వాడీ కేంద్రాలు లేవు. మేమందరం మహిళా సంక్షేమ శాఖ దగ్గరకు వెళ్లి మాట్లాడి వాటిని సాధించాం” అంటుంది జయలక్ష్మి.
చిల్డ్రన్‌ పార్లమెంట్‌ 
తొమ్మిదో తరగతి చదువుకునేప్పుడు హైదరాబాద్‌ చిల్డ్రన్‌ పార్లమెంట్‌కు ప్రధానమంత్రిగా ఎన్నికైంది. ఇదేమంత చిన్న విషయం కాదు. ప్రతి బస్తీ నుంచీ ఓటింగ్‌ జరుగుతుంది. బస్తీ ప్రతినిధులందరూ కలసి ప్రధానిని ఎన్నుకుంటారు. సామాజిక అవగాహన, నాయకత్వ లక్షణాలు ఉన్న వారినే ఎన్నుకుంటారు. ఈ పార్లమెంట్‌కూ స్పీకర్‌, ఉపప్రధాని, హోంమంత్రి.. ఇలా అన్ని పదవులూ ఉంటాయి. వీరంతా ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 సుస్థిరాభివద్ధి లక్ష్యాలపైన, స్థానిక సమస్యలపైన చర్చిస్తారు. గతంలో డ్రైనేజీలతో పడుతున్న ఇబ్బందుల గురించి జలమండలి ఎండీ దానకిశోర్‌ దష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి కాల్వలు బాగు చేయించడంతోపాటు, దోమల నివారణకు ఫాగింగ్‌ చేయించారు. మురుగు సమస్య, అంగన్‌వాడీలు, రోడ్లు, విద్యుత్తు సరఫరా, తెల్లరేషను కార్డులు, ఇళ్లు.. అనేక సమస్యలను చిల్డ్రన్‌ పార్లమెంట్‌లో చర్చించి, అధికారుల దష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకుంటుంది. వీరి బస్తీలో ఇటీవల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన సంచలనం రేపింది. దీనిపై పిల్లలతో పార్లమెంట్‌ నిర్వహించి పరిస్థితులలో మార్పు తీసుకువచ్చారు. మద్యపానం, వాటి అమ్మకాలకు వ్యతిరేకంగా చిల్డ్రన్‌ పార్లమెంట్‌ తీర్మానం చేసింది.
కోవిడ్‌ సమయంలో.. 
ఇంగ్లిష్‌ మీడియంలో చదవాలనుకుని తన వాడ నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకున్న జయలక్ష్మి తన వాడలోని పిల్లలకు సాయంత్రాలు ట్యూషన్‌ చెప్తూ వారి చదువుకు మేలు చేస్తోంది. ‘కోవిడ్‌ సమయంలో మా కాలనీలో నేను కార్యకర్తగా పని చేశాను. కోవిడ్‌ రాకుండా చాలా వరకు సక్సెస్‌ అయ్యాను’ అంది.
నా లక్ష్యం ఐఏఎస్‌.. 
‘యువతకు నాయకత్వ లక్షణాలు ఉండాలి. హక్కుల కోసం పోరాడాలి. అమెరికాలో శాంతియుత పోరాటాల విజయగాథలను అధ్యయనం చేయగలగడం నా అదష్టం. ఒక యువ ప్రతినిధిగా పోరాడుతూనే ప్రజల సేవ కోసం ఐఏఎస్‌ సాధించాలనుకుంటున్నాను. అందుకు కావలసిన సహాయం పొందగలననే అనుకుంటున్నాను. నాకు ఎంతమంచి పేరున్నా చెత్త అమ్మాయి అనే పిలుస్తారు కొందరు. వారి చేత ఉత్తమ అమ్మాయి అనిపించుకునేందుకు, లక్ష్యం లేని వారి బుర్రలే చెత్త అని నిరూపించేందుకు మరింత కష్టపడతాను’ అంది జయలక్ష్మి.
అన్ని ఉండి ఈ రోజుల్లో ఏదైన సాధించాలంటే.. ఎంతో కష్టం. కానీ ఏమిలేని ఓ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఒక బలమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈమెకు మనం నిజంగా హ్యాట్స్‌ ఆఫ్‌ చెప్పాల్సిందే. సాధించాలనే లక్ష్యం బలం ఉంటే.. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సాధించవచ్చని నిరూపించింది. ఎవరికీ సక్సెస్‌ అనేది అంత సులువుగా రాదు. ఎంతో కష్టపడి చదివితే కానీ ఆ సక్సెస్‌ అనే తీపి ఫలాలను రుచిచూడలేం. అలాగే జీవితంలో ఫెయిల్‌.. పరీక్షలో ఫెయిల్‌ అయ్యామని బాధపడే వారికి జయలక్ష్మి జర్నీ ఒక మంచి ఉదాహరణ. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ సమీపంలో అతి పెద్ద మురికివాడ.. సింగరేణి కాలనీలో ఉంటూ, చెత్త బండి లాగుతూ చదువుకుంటున్న ఈ అమ్మాయి ఇలా అమెరికా వరకూ చేరుకోవడం సామాన్యం కాదు. పోరాడే తత్వం, సాధించాలనే పట్టుదల ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. జయలక్ష్మిలోని అసాధారణమైన చొరవ, తపన ఆమెను ఇలా ముందుకు నడుపుతున్నాయి.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417 

Spread the love