ఫోర్బ్స్‌ మెచ్చిన తెలంగాణ బిడ్డ

Telangana child appreciated by Forbesసరికొత్త ఆలోచనలు.. సాధించాలనే కసి ఉంటే చాలు. యువత అనుకున్నది సాధించి తీరుతుంది. చేస్తున్న పని విజయవంతమైతే కొందరు కోట్లు కూడా కూడబెడతారు. కానీ, కొందరు మాత్రం భిన్నం. ఎంత సంపాదించామన్నది కాదు.. జనానికి ఎంత ఉపయోగపడుతున్నాం అనే ఆలోచిస్తారు. సృజనాత్మక దారిలో ముందుకెళ్లాలనుకుంటారు. తమ ఆలోచనలు పదిమందికి ఉపయోగపడాలని ఆశిస్తారు. కేవలం ఆలోచనలుంటే సరిపోదు. వాటిని ఆచరణలో పెట్టినప్పుడే ఫలితాలు వస్తాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నరేందర్‌ చింతం. స్వయం కృషితో ఎదిగిన ఈ పల్లెటూరి పిల్లగాడు.. ప్రపంచ యవనికపై నేడు తెలంగాణ ఖ్యాతిని చాటుతూ అఫీషియల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫోర్బ్‌ జాబితాలో చోటు సాధించాడు. అతి పిన్న వయసులో అత్యున్న శిఖరాలకు ఎదిగిన కరీంనగర్‌ జిల్లా వాసి పరిచయం ఈ వారం జోష్‌.
కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం మక్తపల్లి అనే మారుమూల గ్రామంలో మద్యతరగతి వ్యవసాయ కుటుంబంలో చింతం రాములు, కనకలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఎల్‌ఎండీ కాలనీలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్‌ పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఇంటర్‌ నుండి డిగ్రీ వరకు కరీంనగర్‌లో పూర్తి చేశారు. 2004-2005 మధ్య రాష్ట్రంలో తీవ్రమైన వర్షబావ పరిస్థితి నెలకొన్నది. ఆ కాలంలో వర్షాలు లేకపోవడంతో బోర్లు వేసి నష్టపొవడం… అప్పులపాలు అయ్యారు. ఉన్న పదెకరాలు అమ్ముకోవాల్సిన వచ్చింది. చదువు మధ్యలోనే ఆపేయాల్సిన గడ్డు పరిస్థితులు. కానీ, వాటిని అధిగమించి 2007లో హైదరాబాద్‌లో ఎంబీఏ డిగ్రీ అందుకున్నాడు. కొన్ని రోజులు బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు.
మలుపు తిరిగిన జీవితం
నరేందర్‌ ప్రతిభను ఆనతికాలంలోనే బెంగళూరులో తాను పనిచేస్తున్న కంపెనీ గుర్తించింది. సీనియర్లు చాలా మందే ఉన్నా కంపెనీ వర్క్‌ నిమిత్తం నరేందర్‌నే అమెరికా పంపింది. ఆ తరువాత అతి కొద్దికాలంలోనే అతడు అమెరికా, ఇటలీ, జర్మనీ, బ్రిటన్‌, స్కాట్లాండ్‌, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌ లాంటి అనేక దేశాలు వత్తిరీత్యా పర్యటించి, అతికొద్ది సమయంలోనే ఎక్కువ దేశాలు తిరిగిన సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్ట్‌గా పేరు సంపాదించారు.
160 ప్రపంచ స్థాయి జర్నల్స్‌…55 ఇన్నోవేటివ్‌ పేటెంట్లు
ప్రపంచంలోని అత్యున్నత విద్యాసంస్థ అయిన MIT కేంబ్రిడ్జ్‌ నుండి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా పట్టా పొందిన నరేందర్‌ 2015లో అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే తన సజనాత్మకను ప్రపంచానికి తెలిసేలా చేశారు. అమెరికా వెళ్లిన తర్వాత రీసెర్చ్‌ చేసి సుమారు 55 ఇన్నోవేటివ్‌ పేటెంట్లను పబ్లిష్‌ చేశారు. దానితో పాటు అనేక ప్రపంచస్థాయి కాన్ఫెరెన్సులకు కీ నోట్‌ స్పీకర్‌గా వ్యవహరించారు. పదకొండు ప్రపంచ స్థాయి జర్నల్‌ సంస్థలకు చీఫ్‌ ఎడిటర్‌గా పని చేస్తూ, సుమారు 160 ప్రపంచ స్థాయి జర్నల్స్‌ ప్రచురించి అనేక విద్యాసంస్థలకు టెక్నికల్‌ కమిటీ మెంబర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని దక్కించుకున్నారు.
అత్యంత తక్కువ సమయంలో కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదిగి ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ మ్యానుఫాక్చరింగ్‌ కంపెనీలో సీనియర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఆర్కిటెక్ట్‌ స్థానాన్ని సంపాదించారు. అనేక ఇన్నోవేటివ్‌ జర్నల్స్‌ మార్కెట్లో విడుదల చేసి, అత్యంత ప్రతిష్టాత్మకమయిన ఫోర్భ్స్‌ జర్నల్‌లో అఫియల్‌ ఎగ్జిక్యూటివ్‌గా స్థానం సంపాదించగలిగారు. ఇటీవల దేశరాజధాని న్యూఢిల్లీలో ఢిల్లీ విధాన సభ స్పీకర్ర్‌ శ్రీరాం నివాస్‌ గోయ చేతుల మీదుగా అత్యంత అరుదైన భారత సమ్మాన్‌ నిధి అవార్డును టాప్‌ టెన్‌ రేసర్‌గా ఎక్కువ రీసర్చ్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ పేటెంట్స్‌ కలిగిన వ్యక్తిగా అందుకున్నారు. ఆయన భార్య వినీత కూడా అక్కడే ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె సహకారం అతని విజయానికి తోడ్పాటునిస్తుంది.
నరేందర్‌ చింతం ఇన్నోవేషన్స్‌
నరేందర్‌ రీసర్చ్‌లో కొన్ని ముఖ్యమైనది ఆర్టిఫిషియల్‌ ఇటెలిజెన్స్‌ ఆధారిత కళ్ళజోడు. దానిలో పర్సనల్‌ వర్చువల్‌ అసిస్టెంట్‌ను జోడించారు. రోజువారి కార్యక్రమాలు మొత్తం ఆ వర్చువల్‌ అసిస్టెంట్‌ గైడ్‌ చెయ్యటం, ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు, ఎంతవరకు నిజం మాట్లాడుతున్నారు అని చెప్పడం క్యారెక్టర్‌ అనాలిసిస్‌ చేస్తుంది. చెవిలో తనకు కావల్సిసిన వార్తలు చదవడం, కళ్ళజోడు నుండి ప్రొజెక్టర్‌ ద్వారా ఎమైల్స్‌ చూపెట్టడం, రిపొర్ట్స్‌ చూపెట్టడం నావిగేషణ్‌ చూపెట్టడం, చుట్టు పక్కల ఎలాంటి షాప్స్‌ ఉన్నాయో వివరిస్తుంది. తనకి ఏమేం అవసరం? లాస్ట్‌ ఇయర్‌ ఎన్ని సార్లు ఆ షాప్‌ లో ఏం కొన్నారు? లాంటి వివరాలతో పాటు, ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌, ఇంట్లో సామాన్లు ఏం నిండుకున్నాయో తాను ఏం కొనాలో రిమైండ్‌ చేయనుంది ఈ డివైజ్‌.
అలాగే మనిషి ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన హెచ్చరికలు సైతం చేస్తుంది. తినే వస్తువులలో క్యాలరీలు ఎంత వున్నాయో, క్యాలరీస్‌ క్యాలుక్యులేట్‌ చేసి చెప్పడం, బీపీ షుగర్‌ లాంటివి మానిటర్‌ చేసి అలర్ట్‌ చెయ్యడం, హెల్త్‌ ప్రొఫైల్‌, ఎమర్జెన్సీ కాల్స్‌, ఆటోమేటిక్‌ ఆంబులెన్స్‌ కాల్స్‌ చెయ్యడం, అత్యవసర పరిస్థితిని వీడియో తీసి పోలీసులకు అందిచడం, ఎవరయి కొత్త వ్యక్తి కలినప్పుడు అతని సోషల్‌ ప్రొఫైల్‌నను అనలైస్‌ చేసి అతని వ్యక్తిత్వాన్ని అంచానా వేయడం, క్రెడిట్‌ కార్డ్‌ బిల్స్‌ పే చెయ్యడం, ఫినాన్షియల్‌ అడ్వైస్‌ ఇవ్వడం, మెయిల్స్‌ కంపోస్‌ చేయ్యడం లాంటి, ప్రజెంటేషన్‌ AI ద్వారా ప్రిపేర్‌ చెయ్యడం లాంటి ఇన్నోవేటివ్‌ ఆవిష్కరణలు సష్టించారు చింతం నరేందర్‌.
నరేందర్‌ మరో ఆవిష్కరణ మహా ఏఐ
నరేందర్‌ కూతురు పేరు మహా శ్రీవర్థిని. ఆ పేరుతోనే మహా ఏఐ అని ప్రారంభించారు. మహా ఏఐ అనే కంపెనీని స్థాపించి అనేక పరిశోధనలతో సుమారు ఆరేండ్ల నిర్విరామ కృషితో ప్రోటోటైప్‌ చేసి లండన్‌, ఆస్ట్రేలియాతో పాటు ఇండియాలో పేటెంట్స్‌ పబ్లిష్‌ చేశాడు. అలాగే సోలార్‌ ఎనర్జీతో నడిచే వెహికల్స్‌, పొల్యూషన్‌ ఫ్రీ ఏసీ బైకులు, క్లౌడ్‌ కంప్యూటరింగ్‌, ఐఓటీ ఆర్కిటెక్చర్లలో అనేక సప్లరు చైన్‌, యార్డ్‌ మెనేజ్‌మెంట్‌, ఆటోమాటిక్‌ డ్రోన్‌ రోబో, జీపీఎస్‌ ద్వారా ఆక్సిడెంట్‌ ప్రదేశానికి వెళ్ళి ప్రథమ చికిత్స, రక్తం ఆగడానికి ఆక్సిజన్‌ మాస్క్‌ ఇచ్చే డ్రోన్‌ ఆవిష్కరణలు, ఎనిమిది విప్లవాత్మకమైన న్యూఅరల్‌ నెట్‌వర్క్‌, ఆర్టిఫియల్‌ ఇంటలెజెన్స్‌, రీసర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ పుస్తకాలు ప్రచురించి విశేష ఆదరణ పొందారు.
ఎనలేని ప్రతిభతో స్ట్రీట్‌ లైట్స్‌ ద్వారా ఎనర్జీ సేవ్‌ చేయడానికి ఐఓటీ ఆధారిత ఆబ్జెక్ట్‌ బేస్డ్‌ డిటెక్షన్‌ ద్వారా కేవలం మనుషులు లేదా జంతువులు ఉన్నప్పుడు మాత్రమే వెలిగేలా స్ట్రీట్‌ లైట్లను అవిష్కరించారు. మిగతా టైంలో ఆఫ్‌ అయ్యే విధంగా ఉంటూ పక్కా స్ట్రీట్‌ లైట్‌ వెలగకపొతే ఆటోమెటిక్‌గా ఇంకో లైట్‌ టికెట్‌ క్రియేట్‌ చేసి ఈ కామర్స్‌ ద్వారా ఆటోమెటిక్‌గా ఆర్డర్‌ చేసి సంబంధిత అధికారికి నోటిఫై చెయ్యడం లాంటి అనేక విప్లవాత్మక పేటేంట్స్‌ సంపాదించడంతో పాటు, ఫారెస్ట్‌లో మిషన్‌ లెర్నింగ్‌ ఆధారిత సీడ్‌ బాల్స్‌ డ్రోన్స్‌ ద్వారా వేయడం, జీవరాశుల సంఖ్యను బట్టి అడవులల్లో పండ్ల మొక్కలు వాటికి కావలసిన ఆహారానికి సంబంధించిన AI బేస్డ్‌ అనాలిసిస్‌ చేసి అక్కడ సీడ్‌ బాల్స్‌ వేయడం, ఎక్కడెక్కడ విస్తతంగా చెట్లు ఉన్నాయో చూసి అక్కడ పెరిగే చెట్లను సాయిల్‌ అనుకూలతలను బట్టి డ్రోన్‌ ద్వారా విరివిగా సీడ్‌ బాల్స్‌ వెయ్యడం లాంటి అనేక విశిష్ట సేవలకు రీసర్చ్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన అనేక అవార్డులు అందుకున్నారు నరేందర్‌. ఇంతకు ముందు పిల్లర్స్‌ ఆఫ్‌ ద నేషన్‌, ఇండియన్‌ ఎమినెంట్‌ అవార్డు, అబ్దుల్‌ కలాం పురస్కార్‌ అవార్డ్‌, ఇంటర్నేషనల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు లాంటి పలు గౌరవ పురస్కారాలు అందుకున్నారు.
తన వంతుగా సమాజానికి
తన కుటుంబం బాగుంటే చాలు.. పక్కవాడికి ఏమైతే ఏంటి అనుకుంటున్న సమాజంలో సాయం చేయాలన్న ఆలోచనను విస్మరిస్తున్నారు. రూపాయి సాయం చేసి వంద రూపాయల పబ్లిసిటీ కోరుకునే రోజుల్లో కూడా ఎంతో మందికి ఇలా సాయం చేస్తూనే.. అటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారిని అరుదుగా చూస్తుంటాం. ఎన్నో కష్టనష్టాలను చవి చూసి.. స్వశక్తితో ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తిగానే కాదు, చదువు విలువ తెలిసిన వ్యక్తిగా మరి కొంతమందికి చదువుకు సాయం చేస్తున్నాడు. 32 మంది లా విద్యార్థులను చదివిస్తున్నాడు. మరి కొంతమంది గ్రూప్‌ 1, 2 లకు ప్రిపేర్‌ అవుతున్న వారికి తన వంతు సాయం చేస్తున్నాడు. ప్రభుత్వ విద్యాలయాలకు మంచి నీటి సౌకర్యానికి కషిచేస్తున్నారు. ఎంతో మంది ఐఐటిలో చదువుతున్న విద్యార్థులకు వారి ప్రాజెక్ట్‌ వర్క్‌ సంబంధిత విషయాలలో తన సలహాలు ఇస్తూ తోడ్పడుతున్నాడు.
అన్నార్తులు అనాథలుండని
అన్నార్తులు అనాధులుండని ఆ నవయుగమదెంత దూరం అని ప్రశ్నించారు దాశరథి. నరేందర్‌ కూడా అలాంటి సమాజానే కాంక్షిస్తున్నాడు. అందుకే అన్నార్తులున్న చోట అన్నదానాలకు చేయూతనిస్తున్నాడు. మరణం ఎవరికైనా సహజమే. కానీ, బంధులందరూ ఉంటే మరణానంతరం వారి దేహలకు గౌరవంగా అంతిమ సంస్కారాలు జరిపిస్తారు. ఎవరు లేని వారు, కుటుంబాలు పట్టించుకొని వారు కూడా ఈ దేశంలో చాలామందే ఉన్నారు. అలాంటి అనాథ శవాల పట్ల కూడా నరేందర్‌ కు గౌరవ భావమే ఉంది. కాబట్టే అలాంటి వారి దహనసంస్కారాలకు అయ్యే ఖర్చులు తాను పంపిస్తూ స్థానికుల ద్వారా ఆ పనులు పూర్తి చేస్తున్నాడు.

– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417

Spread the love