సివిల్స్‌ ఎంచుకునే ముందు ఓ క్లారిటీ ఉండాలి

There should be clarity before choosing civilsసివిల్స్‌ ప్రజలకు సేవ చేసేందుకు ఓ గొప్ప అవకాశం. అయితే అది సాధించడం అంత తేలికైన విషయమేమీ కాదు. లక్షల మంది పోటీపడితే వందల మంది మాత్రమే ముందుకెళ్తారు. దుర్భిణి వేసి మరీ మెరికల్లాంటి కొద్ది మందినే ఎంపిక చేస్తారు. ‘ఐఏఎస్‌, ఐపీఎస్‌’ లాంటి మూడక్షరాల పదాన్ని గర్వంగా తమ పేరు పక్కన చేర్చుకునే అర్హత అతికొద్ది మందే సాధిస్తారు. ఏదైనా సాధించాలనే లక్ష్యం స్పష్టం ఉండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ యువకుడు. అతనే సంకేత్‌ అజ్మెర. అతని పరిచయం నేటి జోష్‌లో…

సివిల్స్‌ ఎంచుకోవాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది?
నా కుటుంబం, నా కమ్యూనిటీ దీనికి కారణం. మాది మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం, కర్ణాపేట్‌ గ్రామం. అమ్మానాన్నల ఉద్యోగ రీత్యా మేము హైదరాబాద్లో స్థిరపడ్డాం. మాది చిన్న గ్రామం. మహా అయితే 15 ఇండ్లు ఉంటాయి అంతే. అందరూ చిన్న చిన్న ఇండ్లలో ఉండేవారు. చిన్నప్పుడు ఊరికి వెళుతుంటే మా కమ్యూనిటీలో ఇన్ని సమస్యలు ఉన్నాయా అనిపించేది. ఎలాగైనా మా వాళ్ళకు సాయం చేయాలని అనుకున్నాను. సివిల్‌ సర్విస్‌ ద్వారా అయితే నేను అనుకున్నది కొంత వరకైనా చేయగలను అనిపించింది. అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నాను.
మీ ఎడ్యుకేషన్‌ ఎలా కొనసాగింది?
చిన్నప్పటి నుండి బాగా చదువేవాడిని. అమ్మానాన్న చదువులో బాగా ప్రోత్సహించేవారు. ముఖ్యంగా అమ్మతో ఎక్కువగా చర్చిస్తుండేవాడిని. ఐఐటీ ఢిల్లీ నుండి ఇంజనీరింగ్‌ పూర్తి చేసి తర్వాత మాస్టర్స్‌ చేసి ఏడాది పాటు జాబ్‌ కూడా చేశాను.
సివిల్స్‌ రాయాలనే ఆలోచన మీకు మొదటి నుండే ఉందా?
అలాంటిదేమీ లేదు. నిజానికి ఇంటర్‌ తర్వాత అమ్మానాన్న సివిల్స్‌ వైపు దష్టి పెట్టమని చెప్పేవాళ్లు. కానీ నాకు మ్యాథ్స్‌ అంటే ఇష్టం. అందుకే ఇంజనీరింగ్లో చేరాను. ఎమ్మెస్సీ రీసర్చ్‌ చేసిన తర్వాత పీహెచ్‌డీ చేయాలని అనుకున్నాను. అయితే ఇది చేస్తే ప్రజలకు ఎలా ఉపయోగపడతాను అనే సందేహం వచ్చింది. పీహెచ్‌డీ చేస్తే నాకు మాత్రమే ఉపయోగం. దీని వల్ల నా కమ్యూనిటీకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అప్పుడే యూపీఎస్సీ అయితే బాగుంటుంది ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయొచ్చు అనే ఆలోచన వచ్చింది.
మరి మీ సివిల్స్‌ ఆలోచనను ఆచరణలోకి ఎప్పుడు వచ్చింది?
కోవిడ్‌ టైంలో చాలా ఫ్రీ టైం దొరికింది. నా కెరీర్‌ గురించి మరింత లోతుగా ఆలోచించే అవకాశం కూడా అప్పుడే వచ్చింది. ఏం చదివితే నేను ప్రజలకు ఉపయోగపడతాను అని ఆలోచిస్తూ ఈ నిర్ణయానికి వచ్చాను. సమాజంలో ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. అయితే అందరికంటే ఎక్కువగా గిరిజనులు చాలా వెనుకబడి ఉన్నారు. వారి సమస్యలను కొంత వరకైనా పరిష్కరించ వచ్చు అని భావించాను. ముఖ్యంగా పేదలు, గిరిజనులు, వద్ధులు వీరికి సేవ చేయాలనేది నా ఆశయం.
కోచింగ్‌ ఏమైనా తీసుకున్నారా?
2021లో ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక ఏడాది ప్రిపరేషన్‌, ఒక ఏడాది ఎగ్జామ్స్‌ కోసం కేటాయించాలని ముందే నిర్ణయించుకున్నాను. నిజానికి ఈ నిర్ణయం తీసుకునే ముందు నా సీనియర్స్‌ లో కొంత మందితో మాట్లాడి నేనూ చేయగలను అనే నమ్మకం వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళిపోయాను. రెండేండ్లల్లో పూర్తి చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నాను. ఏ బుక్స్‌ చదవాలి, కోచింగ్‌ అవసరమా, ఎలా చదవాలి అని ప్లాన్‌ చేసుకున్నాను. ఇంజనీరింగ్‌ నుండి వచ్చాను కాబట్టి సివిల్స్‌ లో ఓనమాలు కూడా తెలియదు. కాబట్టి ముందు కోచింగ్లో చేరాను. మూడు నెలలు కోచింగ్‌ తీసుకున్న తర్వాత నా అంతట నేను ప్రిపేర్‌ కావొచ్చు అనే నమ్మకం వచ్చింది.
మీ ప్లానింగ్‌ ఎలా ఉండేది?
మ్యాథ్స్‌ నా ఆప్షనల్‌. ఎలాగో నాకు ఇష్టమైన సబ్జెక్ట్‌ కాబట్టి విపరీతంగా ప్రాక్టీస్‌ చేసేవాడిని. రివిజన్‌ కూడా బాగా చేశాను. ఏడాది టార్గెట్‌ పెట్టుకున్నాను కదా! 12 నెలల్లో ఒక్కో నెలలో ఏది ప్రిపేర్‌ కావాలి, ఎంత కంప్లీట్‌ చేయాలో ప్లాన్‌ చేసుకున్నాను. అలాగే నెలలో నాలుగు వారాలు కాబట్టి వారంలో ఎంత కంప్లీట్‌ చేయాలి అని. ఇంకో ప్లాన్‌. అలాగే రోజుకు ఎంత సేపు చదివితే వారంలో అనుకున్నది పూర్తి చేయగలను. అలా ఒక టైం టేబుల్‌ని రెడీ చేసుకున్నాను. దీన్ని సీరియస్‌గా ఫాలో అయ్యాను, వారంలో ఆరు రోజులు బాగా ప్రిపేర్‌ అయ్యి ఏడో రోజు పూర్తిగా గాని సగం రోజు గానీ రిలాక్స్‌ అయ్యేవాడిని. ప్రతి రోజు ఎన్ని గంటలు చదువుతున్నా యాప్‌లో ట్రాక్‌ చేసుకున్నాను. ఏ రోజైనా ప్రిపరేషన్‌ కాస్త తగ్గినట్టు అనిపిస్తే తర్వాత రోజు కవర్‌ చేసుకునేవాడిని. రోజుకు 8 నుండి 10 గంటలు కచ్చితంగా చదివేవాడిని. రివిజన్‌ కు ఎక్కువ టైం కేటాయించాను. మొదటి ట్రయల్‌ కోసం ఎగ్జామ్స్‌ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. తర్వాతి ఏడాది సీరియస్‌గా రాసి సెలక్ట్‌ అయ్యాను.
మీ స్నేహితులు, బంధువుల నుండి సహకారం ఎలా ఉంది?
యూపీఎస్సీ అనగానే అనేక అనుమానాలు ఉంటాయి. చాలా మంది అవసరమా అనేవాళ్ళు ఉంటారు. ముందు మనకే సెలక్ట్‌ అవుతామో లేదో అనే భయం ఉంటుంది. ఎందుకంటే ఇందులో సక్సెస్‌ కంటే ఫెల్యూర్సే ఎక్కువ. నాకు తెలిసిన వాళ్ళు ఐదారుగురు చాలా సార్లు రాసినా సెలక్ట్‌ కాలేకపోయారు. అలాంటి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడి వాళ్ళు ఎలాంటి పొరపాట్లు చేశారో తెలుసుకొని అలాంటివి చేయకూడదని తెలుసుకున్నాను. అలాగే సెలక్ట్‌ అయిన నా సీనియర్స్‌ తో మాట్లాడి వాళ్ళ గైడెన్స్‌ కూడా తీసుకున్నాను, అలాగే ఇంజనీరింగ్లో నా క్లాస్‌మేట్‌ రవితేజ అని ఇప్పుడు తమిళనాడులో పని చేస్తున్నాడు. అతను నాకు బాగా సపోర్ట్‌ చేశాడు.
మీ కుటుంబం గురించి చెప్పండి?
మా అమ్మ అజ్మెర సవిత, ఇస్రోలో సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌. నాన్న అజ్మెర ప్రేమ్‌ సింగ్‌. హార్టీ కల్చర్‌ డిపార్ట్‌ మెంట్‌ లో డిప్యూటి డైరెక్టర్‌ గా ఉన్నారు. ఇద్దరూ హైదరాబాద్లోనే మంచి స్థాయి ఉద్యోగాల్లో ఉన్నారు. అమ్మ చిన్నప్పటి నుండి చదువులో నన్ను బాగా ప్రోత్సహించేది అమ్మతో ఎప్పుడూ చర్చిస్తూ ఉండేవాడిని. సివిల్స్‌ కు ప్రిపేర్‌ అయ్యేటపుడు కూడా అమ్మతో రెగ్యులర్‌గా మాట్లాడేవాడిని. తనకు కూడా ఈ సబ్జెక్ట్‌ కొత్తే. అయినా తను తెలుసుకుని మరీ నాతో చర్చించేది. అది నాకు బాగా ఉపయోగపడింది. ఇక మా నాన్న చాలా చిన్న స్థాయి నుండి వచ్చి ఇప్పుడు ఒక మంచి స్టేజికి చేరుకున్నారు. ఇది చిన్నప్పటి నుండి నన్ను బాగా ఇన్‌స్పైర్‌ చేసింది.
గిరిజనులు ఇంకా అభివద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. దీనికి కారణం ఏమనుకుంటున్నారు?
దీనికి రెండు కారణాలు ఉన్నాయి. గిరిజనుల భాష అందరికీ అర్ధం కాదు. వాళ్ళకు తెలుగులో చదువు చెప్పినా, మాట్లాడినా అర్థం కాదు. ఇంగ్లీష్‌ కూడా అంతే. కమ్యూనికేషన్‌ సమస్య ఎక్కువ, కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్లో అయినా వారికి చెప్పే చదువు వారి భాషలో ఉండాలి. దీనివల్ల కొంత వరకైనా చదువుకుంటారు. అలాగే వాళ్ళు సుదూర ప్రాంతాల్లో, కొండల్లో, గుట్టల్లో ఉంటారు. అలాంటి వాళ్ళు మన దగ్గరకు రావడం కన్నా మనమే వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి. అధికారులు రెగ్యులర్‌ గా ఆ ప్రాంతాలకు వెళతారు. అప్పుడు రోడ్లు పడతాయి, ట్రాన్స్‌పోర్ట్‌ పెరుగుతుంది. కమ్యూనికేషన్‌ పెరుగుతుంది. ఇవి జరిగితే కొంత వరకు అభివద్ధి చెందే అవకాశం ఉంటుంది.
దేశం అభివద్ధి చెందాలంటే అధికారుల పని ఎలా ఉండాలంటారు?
మన దేశంలో అడ్మినిస్ట్రేషన్‌ వర్క్‌ బాగా జరుగుతుంది. అయితే ప్రభుత్వం తెస్తున్న స్కీంల గురించి ప్రజలకు కింది స్థాయి వరకు అవగాహన ఉండడం లేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలకు తెలియాలి. వీటిపై అవగాహన కల్పించడానికి టెక్నాలజీని ఉపయోగించాలి. దీని కోసం జిల్లా స్థాయిలో కొన్ని మార్పులు జరగాలి. అన్నీ డిజిటల్‌గా జరిగేలా చూడాలి. నేను ఏ జిల్లాకు వెళ్ళినా డిజిటల్‌ రంగాన్ని ఉపయోగించి అలాంటి మార్పు తీసుకురావాలి అనుకుంటున్నాను.
మీకు నచ్చిన ఐఏఎస్‌ అధికారులు ఎవరైనా ఉన్నారా?
పరమేశ్వరన్‌ అయ్యర్‌ అనే ఒక ఆఫీసర్‌ బుక్‌ చదివి చాలా ఇన్‌స్పైర్‌ అయ్యాను. ఆయన గతంలో నీతి అయోగ్‌ చైర్మన్‌ గా ఉన్నారు. కింది స్థాయి వరకు వెళ్ళి ఆయన ఎంతో కషి చేశారు. ఒక ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఎంత చేయాలో దాని కంటే చాలా ఎక్కువ చేశారు. ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఆయన పుస్తకాన్ని చాలా సార్లు చదివాను.
పోస్టింగ్‌ ఇచ్చిన తర్వాత దేనికి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారు?
వ్యవసాయంపై దష్టి పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే మన దగ్గర అవకాశాలు ఎక్కువ ఉన్నా ఉత్పత్తి చాలా తక్కువ వస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర లేదు. దీనికోసం ఏదైనా చేయాలనుకుంటున్నా. రైతుల కోసం ఎన్నో స్కీంలు ఉన్నాయి. వాటిని సరిగ్గా ఉపయోగిస్తే రైతులకు గిట్టుబాటు ధర కచ్చితంగా వస్తుంది. రైతుల ఆత్మహత్యలే ఉండవు. అలాగే ఎడ్యుకేషన్‌ కూడా చాలా అవసరం. క్వాలిటీ, క్వాంటిటీ రెండూ పెంచాలి. ఇప్పటికీ చాలా మంది పదో తరగతి వరకు చదివితే చాలు అనే ఆలోచనలో ఉన్నారు. కానీ కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలి. తమలోని స్కిల్స్‌ డెవలెప్‌ చేసుకొని ఉపాధి పొందాలి. అందుకే నా జిల్లా పరిధిలో ఆదాయ మార్గాలను చేయాలనుకుంటున్నాను. అలాగే గిరిజనుల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారికి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలి.
ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో గ్రూప్‌ పరీక్షలు క్యాన్సిల్‌ అవుతున్నాయి. వీటి ప్రభావం యువతపై ఎలా ఉందంటారు?
కచ్చితంగా ఉంటుంది. యూత్‌ చాలా ఒత్తిడికి గురౌతున్నారు. ఇన్నేళ్లు వాళ్ళు పడిన శ్రమకు ఫలితం కనబడకపోయే నిరుత్సాహానికి గురౌతున్నారు. అయితే యూత్‌ ఇలా డీలా పడిపోవడం సరైనది కాదు. మనం ఏదైనా ఒక జాబ్‌ కోసం ప్రిపేర్‌ అవుతున్నామంటే కేవలం ఆ ఒక్కదానిపైనే ఆధారపడవద్దు. మనకున్న స్కిల్క్స్‌ని ఉపయోగించి ఇంకా ఏదైనా చేయవచ్చా అనేది కూడా ఆలోచించాలి. ఉదాహరణకు నేను ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ని. కాబట్టి క్లాసులు తీసుకొనే వాడిని. దీని వల్ల నాలో కాన్ఫిడెన్స్‌ వచ్చింది. ఫైనాన్షియల్‌ గా కూడా సపోర్ట్‌ ఉండేది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచించుకోవాలి. ఒక్కదానిపైనే ఆధారపడొద్దు.
మెయిన్స్‌కు ఎలా ప్రిపేరయ్యారు?
ప్రిలింమ్స్‌ తర్వాత మెయిన్స్‌కు వంద రోజులు టైం ఉంటుంది. ఆ వంద రోజుల్లో ఎంత చదవగలిగితే అంత చదవాలి. నేను ప్రతి రోజూ 10 గంటలు చదివేవాడిని. సిలబస్‌ మొత్తం నా టేబుల్‌పైన పెట్టుకున్నాను. మాక్‌ టెస్టులు రాసేవాడిని. మంచి మార్కులు వచ్చిన వాళ్ళతో మాట్లాడి వారి సూచనలు తీసుకొని ప్రాక్టీస్‌ చేశాను. వంద రోజులు ఇదే ప్రాక్టీస్‌ కొనసాగించాను. రోజు రోజుకు మార్కులు పెరుగుతూ ఉండేవి. చివరకు రాయగలను అనే నమ్మకం వచ్చింది. అయితే ఎగ్జామ్‌ రాయడానికి మూడు గంటలు మాత్రమే ఉంటుంది. ఈ టైం సరిపోదు. కాబట్టి రాయడం కూడా ప్రాక్టీస్‌ చేయాలి.
ఇంటర్వ్యూలను ఎలా ఫేస్‌ చేశారు?
నేను రెండు ఇంటర్వ్యూలు ఇచ్చాను. మొదటి సారి వందకు 160/276 మార్కులు మాత్రమే వచ్చాయి. అప్పుడు చేసిన పొరపాటు ఏంటంటే ఇంటర్వ్యూ అంటే చాలా భయపడ్డాను. ఆ భయంతో తెలిసి కూడా సమాధానాలు చెప్పలేకపోయాను. తర్వాత ఆ భయాన్ని పోగొట్టుకొని స్కిల్స్‌ ను పెంచుకొని ప్రాక్టీస్‌ చేసి ఇంటర్వ్యూ ఇచ్చాను.. దాంతో స్కోర్‌ 190కి పెరిగింది.
మీ ట్రైనింగ్‌ ఎలా నడుస్తుంది?
ట్రైనింగ్‌ చాలా కష్టంగా ఉంటుంది. ముందు మూడు నెలలు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ ఇలా అన్ని సర్వీసెస్‌ వారికి కలిపి ట్రైనింగ్‌ ఇస్తారు. ఇందులో ఫిజికల్‌ యాక్టివిటీస్‌ తో పాటు హిమాలయాలకు తీసుకెళ్ళి ట్రెక్‌ చేయిస్తారు. అలాగే ట్రైబల్‌ ప్రాంతాలకు వెళ్ళి వారం రోజులు ఉండాలి. ఇదంతా చాలా కష్టమే. కానీ ఎంత కష్టపడితే అంత నేర్చుకోవచ్చు. ముస్సోరీలో ఈ ట్రైనింగ్‌. ఫేస్‌ 1 ట్రైనింగ్‌ ఆరు నెలలు ఉంటుంది. ఇప్పటికి నాలుగు నెలలు అయిపోయింది. 40 రోజులు భారత్‌ దర్శన్‌ పేరుతో ఇండియా టూర్‌ చేసి సెలవులకు హైదరాబాద్‌ వచ్చాను.. ఇంకా రెండు నెలల్లో జిల్లా ట్రైనింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. తెలంగాణకే కేటాయించారు. ముందు అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పొస్ట్‌ ఇస్తారు.

– సలీమ,
94900 99083

Spread the love