చిన్న వయసు.. పెద్ద మనసు

Young age. Big mindఅమ్మా! నేను స్కూలుకి వెళుతున్నా .. టైమయింది అన్నాడు హితార్థ్‌. చిన్నా .. ఈరోజు నువ్వు స్కూలుకి వెళ్లొద్దు. నాతోపాటు ఆస్పత్రికి రావాలి అన్నది తల్లి. స్కూలుకి వెళ్లొద్దు అనే మాట తల్లి నోట వినగానే ఎగిరి గంతేశాడు. దేనికమ్మా! వెళ్లొద్దు అంటున్నావు అడిగాడు హితార్థ్‌. నీ చిట్టి తమ్ముడు ఉధీర్ణ్‌ కు ఏడాది నిండింది కదా! ఈరోజు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి టీకా వేయించాలి. నాన్నకు ఆఫీసులో మీటింగు ఉంది. పొద్దునే బయలుదేరి వెళ్లారు. అందుకే తోడుగా నిన్ను రమ్మంటున్నా అన్నది తల్లి. తమ్ముడిని నేను ఎత్తుకుంటానమ్మా! సంతోషంగా అన్నాడు. వద్దు .. నువ్వు సరిగ్గా వాడ్ని ఎత్తుకోలేవు. ఇప్పుడు నువ్వు చదివేది మూడో తరగతి. నాలుగులోకి వచ్చాక ఉధీర్ణ్‌ ను ఎత్తుకోవచ్చు అన్నది తల్లి. తల్లి మాటలు హితార్థ్‌ను నిరుత్సాహపర్చాయి.
తల్లి ఇంటికి తాళం వేసింది. ఇంతలో ఆటో పక్కన ఆగింది. హితార్థ్‌ తల్లితో కలిసి ఎక్కాడు. అమ్మా! తమ్ముడు భలే ముద్దొస్తున్నాడు. కాసేపు నా ఒళ్లో కూర్చోబెట్టు అన్నాడు. ఆటోలో ప్రయాణిస్తూ అలా చెయ్యకూడదు. ఇంటికి వెళ్లాక నీ ఒళ్లో కూర్చోబెడతాను అన్నది తల్లి. హితార్థ్‌ సంతోషంతో తమ్ముడు ఉధీర్ణ్‌ బుగ్గలు నిమిరాడు. తల్లి హితార్థ్‌ను దగ్గరకు తీసుకుంది. ఇంతలో ఆసుపత్రి వచ్చింది. తల్లి ఆటో దిగి ఉధీర్ణ్‌ను భుజం మీద వేసుకుంది. హితార్థ్‌ కూడా ఆటో దిగాడు. నువ్వు నాకు చెప్పకుండా ఎటూ పోవద్దు. ఎవరు పిలిచినా వెళ్లొద్దు. నా చెయ్యి వదలకూడదు అన్నది తల్లి. అలాగే అన్నాడు హితార్థ్‌. ఓపీ రాయించుకోటానికి తల్లి లైనులో నిలబడగా వెనకాలే హితార్థ్‌ కూడా నిలబడ్డాడు. ఓపీ రాయించుకున్నాక చీటీ తీసుకుని సంబంధిత పిల్లల వైద్యుని సంప్రదించింది హితార్థ్‌ తల్లి. అక్కడ నర్సు వైద్యుని సలహా మేరకు పరీక్షించి టీకా వేసింది. సూది తగలగానే ఉధీర్ణ్‌ గుక్కపట్టి ఏడవటం ప్రారంభించాడు. తమ్ముడు ఏడుస్తుంటే హితార్థ్‌ కూడా ఏడవటం ప్రారంభించాడు. తల్లి ఒకవైపు ఉధీర్ణ్‌ను సముదాయిస్తూనే హితార్థ్‌ను దగ్గరకు తీసుకుంది. వైద్యుడు వేసిన టీకాకు పిల్లవాడికి జ్వరం వస్తుందని భయపడవద్దని చెప్పారు. జ్వరం తగ్గకపోతే సిరప్‌ వాడమని ఓపీ చీటి మీద రాశారు. ఇంతలో పిల్లలు ఏడుపు ఆపారు. ఉధీర్ణ్‌ను భుజాన వేసుకుని హితార్థ్‌ చేయి పట్టుకుని మందులు ఇచ్చే ప్రదేశానికి బయలుదేరింది. మందులు పంపిణీ చేసే ప్రదేశంలో రెండు లైన్లు ఉన్నాయి. పురుషుల లైను రద్దీగా ఉండగా, మహిళల లైనులో తక్కువ మంది ఉన్నారు. హితార్థ్‌ తల్లి మందుల కోసం మహిళల లైనులో నిలబడింది. హితార్థ్‌ ఓ పక్కన నిలబడ్డాడు. ఇంతలో పురుషుల లైనులో తొక్కిసలాట ప్రారంభమైంది. అంతవరకు లైనులో ముందు వరుసలో నిలబడ్డ ఓ వృద్ధుడిని కొందరు పక్కకు తోసేశారు. దాంతో ఆ వ్యక్తి కింద పడ్డాడు. అతను పైకి లేవాలని ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటం లేదు. అతని చేతిలోని మందుల చీటి ఫ్యాన్‌ గాలికి దూరంగా పడింది. హితార్థ్‌ పరుగును వెళ్లి చీటి తెచ్చి తాతా! తీసుకో అని ఇచ్చాడు. బాబూ! దాహం వేస్తుంది అన్నాడు వృద్ధుడు. హితార్థ్‌ పరుగున తల్లి దగ్గరకు వెళ్లి బాటిల్‌ తెచ్చి మూత తీసి తాతా! తాగు అంటూ ఇచ్చాడు. ఆ వృద్ధుడు గబగబా నీళ్లు తాగి తేరుకున్నాడు. హితార్థ్‌ వైపు కృతజ్ఞతగా చూస్తూ లైను దగ్గరకు వెళ్లాడు.
ప్రతి ఒక్కరూ వృద్ధుని వెనక్కి తోసేశారు. కొందరేమో ఆయన వయసును కూడా గుర్తించలేదు. పైగా ఇప్పుడే వచ్చి ముందు నిలబడతావా! అని మాటలు తూలారు. వృద్ధుడు ఎంత ప్రయత్నించినా ముందుకు పోలేక పోతున్నాడు. చివరకు చేతగాక ఒక బల్ల మీద కూర్చొన్నాడు. ఇదంతా చూస్తున్న హితార్థ్‌కు వృద్ధుడి పరిస్థితి జాలనిపించింది. మెల్లగా దగ్గరకు వెళ్లాడు. తాతా! ఏం కావాలి? అని ప్రశ్నించాడు.
బాబూ! ఉదయం అనారోగ్యంగా ఉంటే ఇక్కడకు వచ్చి డాక్టరుకి చూపించుకున్నాను. మందులు రాశారు. వాటి కోసం ఈ అవస్థ. లైనులో నిలబడలేకపోతున్నాను. ఎవరూ సాయం చేయటం లేదన్నాడు వృద్ధుడు.
తాతా! నీ మందుల చీటి నాకివ్వు.. తెచ్చిస్తా అన్నాడు హితార్థ్‌. వృద్ధుడు ఇచ్చిన చీటీ తీసుకుని తల్లి వద్దకు వెళ్లాడు. అమ్మా! ఇది దూరంగా బల్లపై కూర్చొన్న తాత మందుల చీటి. మందులు తీసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. అందరూ తోసేస్తున్నారు. ఎలాగైనా మందులు ఇవ్వాలమ్మా! అన్నాడు. సరే చీటీ ఇవ్వమనగా హితార్థ్‌ ఇచ్చాడు. ముందువరుసకు చేరుకున్న ఆమె మొదట ఉధీర్ణ్‌ మందులు తీసుకుంది. ఆ తర్వాత వృద్ధుడు మందులు కూడా తీసుకుంది. అవి హితార్థ్‌కి అందించగా పరుగున తీసుకెళ్లి తాతా! అంటూ చేతిలో పెట్టాడు. వృద్ధుడు హితార్థ్‌ ను ఉద్దేశించి నా ఆయుష్షు కూడా పోసుకుని నిండునూరేళ్లు చల్లగా ఉండు అని దీవించాడు. ఇతరులను ఆదుకోవాలనే ఆలోచన హితార్థ్‌లో రావటంతో తల్లి సంబరపడింది. అనంతరం ఆటోలో ఇంటి బాట పట్టారు.

– తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర, 9492309100

Spread the love