కరుణాంతరంగ గీతకల కవి మిట్టపల్లి

‘కరుణమయుడు మదిన కరణయు జూపగా/ కావ్య రచనన జేయ కాంక్షబుట్టె/ లోకరక్షకుండు నాకిల దైవంబు/ ప్రస్తుతింతు నెపుడు భక్తితోడ’ అని చెప్పుకుని, ‘దైవపుత్రుడ మిమ్ము దల్తునెపుడు’ అంటూ కరుణామయుడైన క్రీస్తు తనలో కవితాకాంక్షకు కారణమని చెప్పుకున్నాడు సిద్ధిపేట జిల్లా కవి మిట్టపల్లి పరశురాములు తన ‘పరశురామ శతకం’లో. ‘అమ్మానాన్న గురువు నాదిదైవంబులు/ పెద్దవారి సేవ పెరుగు సద్ది’ అంటూ బాలల కోసం చక్కని పద్యాలు రాసిన మిట్టపల్లి పరశురాములు ఆగస్టు 15, 1959న సిద్ధిపేట జిల్లా సీతారాం పల్లిలో పుట్టారు. తల్లితండ్రులు శ్రీమతి ఎల్లవ్వ – శ్రీ మల్లయ్యలు.
తెలుగు సాహిత్యంలో ఎం.ఎ చదివి ఉపాధ్యాయవృత్తిలో రాణించిన పరశురాములు తెలుగు స్కూల్‌ అసిస్టెంట్‌గా పదవీ విరమణ చేశారు. పద్యం, గేయం, కథా రచనతో పాటు ఇతర లఘు రూపాలు, ప్రక్రియల్లో రచనలు చేస్తున్న పరశురాములు వివిధ సాహిత్య, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందువరుసలో నడుస్తారు. వృత్తిలో భాగంగా బాల కార్యికులను గుర్తించి బడిలో చేర్పించిన సందర్భాలు తనకు తృప్తినిచ్చిన అంశాలని అంటారాయన. ప్రవృత్తిరీత్యా కవిత్వంతో మమైకమైన వీరు జిల్లా స్థాయిలో అనేక కవిసమ్మేళనాలు తన ఆద్వర్యంలో జరిపారు. పిల్లలకు, యువతకు కవిత్వం, పద్యం పట్ల అవగాహన కలిగించేందుకు అవగాహనా తరగుతులు నిర్వహించారు. ఉపాధ్యాయునిగా వివిధ సంస్థల నుండి జిల్లా రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్న పరశురాములు గురజాడ పురస్కారం, తెలుగు రక్షణ వేదిక పురస్కారం మొదలుకుని వివిధ సంస్థల సత్కారాలు పొందారు.
కవిత్వం, పద్యంతో పాటు ఇతర లఘు కవితా రూపాల్లో రచనలు చేసిన పరశురాములు ‘శత పద్య కంఠీరవ’, ‘కవితా భూషణ’ పురస్కారాలతో గౌరవింపబడ్డారు. అచ్చయిన మిట్టపల్లి పరశురాములు రచనల్లో తొలి పుస్తకం ‘పరశురామ శతకం’. చక్కని, చిక్కని పద్యాల హారం, బాలలకోసం ఆయన అందించిన చక్కని బహుమానం. ఇందులోని పద్యాలు నీతులు, జీవన రీతులతో సాగి పిల్లలకు, పెద్దలకు నచ్చుతాయి. ‘ఆటపాటలందు అలరారు పిల్లలు/ కలిసి మెలిసి యుండ కలుగు మేలు’, ‘విద్య వలన పెరుగు వినయ విధేయత/ చదువు మనిషినెపుడు సంస్కరించు’, ‘అమ్మ జూడ నిలలొ నాది దైవంబెగా/ అమ్మ కన్న మిన్న సొమ్ము లేదు’, ‘కులము మతములనుచు కుమ్ములాడ వలదు/ కులము కన్న మిన్న గుణము గాదె’, ‘మంచి స్నేహితుడు మనకు మార్గము జూపించు’, ‘మాటలెన్నొ మనిషి మాటలాడును గాని/ నడువలేడు తాను నుడివినట్లు’ వంటి పద్యపాదాలు మిట్టపల్లి ఆచోచనల్లోంచి ఆవిర్భవించిన మేటి వాక్యాలు. ఇవి కవిని, ఆయన ఆశయాలు, ఆశలను తెలిపే వాక్యాలు.
బాలల కోసం వీరు రాసిన బాల గేయ సంపుటి ‘వెన్నెల వెలుగులు’. నిజంగా ఇవి పిల్లలకు చక్కని వెలుగులను ఇచ్చే గేయాలే అనడం అబద్దం కాదు. ఇందులోని గేయాలన్ని మొగ్గలో మొగ్గ తొడిగినవే! ‘వెన్నెలమ్మ రావే/ వెలుగు నిచ్చి పోవే/ తేరుమీద రావే తెలివినిచ్చి పోవే/ పడవ మీద రావే/ పాలిచ్చి పోవె/ బండి మీద రావే/ బంతి మాల తేవే…’ అంటూ మనకు తెలిసిన దానిని మరింత వెన్నెల వెగులుగా కూరుస్తాడు. అదే కోవలో ఊరును గురించి కీర్తిస్తాడు. ‘ఊరు తల్లి చెరువురా! ఊరుకే మేలురా!!/ .. మాఊరి పెద్ద చెరువు/ మా బ్రతుకు తెరువురా’ అని సాగుతుంది చెరువు గీతం. ఆడపిల్ల పరశురాములు గేయ సంపుటిలోని మరో మంచి గేయం. ఇందులో కవి ‘ఆడపిల్లలున్న ఇల్లే స్వర్గసీమ’ అని కీర్తిస్తూ… ‘చదువకుంటే తెలివంటా/ చదువుకుంటే విలువంటా/ చదువుకుంటే కలిమంటా/ చదువుకుంటే బలిమంటా’ అంటూ చదువకు విలువను ఎంతో అందంగా, గొప్పగా చెబుతాడు. ఇంకా… ‘బాలలం మేం బాలలం/ అందమైన గులాబీలం/ … పాపలం మేము పాపలం/ మధురమైన ఫలాలం/ బుడుగులం మేము బుడుగులం/ బుడిబుడి నడకల చిలకలం’ అంటాడు. వారాల గురించి మరో గేతం ఇందులో ఉంది. ‘ఆదివారం నాడు/ అరటి గెల వేసింది/ సోమవారం నాడు/ చూడగా పండింది/ మంగళవారం నాడు/ మామయ్య వచ్చాడు/ బుధవారం నాడు/ బంధువులే వచ్చారు/ గురువారం నాడు/ గబగబా గెలవేసి/ శుక్రవారం నాడు/ శుభ్రముగా చేసి/ శనివారం నాడు/ చకచకా పంచగా/ ఆబాల గోపాలం ఆరగించారు’ అని రాస్తాడు. ఇంకా చిలక గురించి, బొమ్మలండి బొమ్మలు వంటి మరికొన్ని మంచి గేయాలిందులో ఉన్నాయి. ‘అమ్మనే ఈ జగతికి/ ఆది దైవమ్మురా!/ అమ్మనే సృష్టికి/ ప్రతిరూపమ్మురా!’ అని కీర్తిసాడీ కవి. బాలల కోసం పద్యాలు, గేయాలతో పాటు వివిధ సామాజిక సేవాకార్యాలను నిర్వహిస్తున్న బాలల గేయధాములు, మిట్టపల్లి పరశురాములు. త్వరలో మరిన్ని మంచి రచనలు రావాలని, తేవాలని కోరుతూ… దిల్‌సే ముబారక్‌బాద్‌! జయహో! బాల సాహిత్యం.

– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

Spread the love