మోసగాళ్లతో జాగ్రత్త

Beware of scammers– పుప్పాల కష్ణమూర్తి
ఊటుకూరు గ్రామంలో నివసించే దీనయ్య అనే జాలరి వద్ద ఓ నల్ల కుక్క ఉండేది. ఉదయమే వల తీసుకొని చెరువుకు వెళ్లి చేపలు పడుతుంటే, ఒడ్డున ఉండి రొట్టెకు, బుట్టకు కాపలా కాసేది. కాకులు, గద్దలు అటు వైపు వస్తే వెంటపడి తరిమేది. మనుషులు వస్తే, గట్టిగా అరిచేది. కుక్క కాపలా కాస్తుందనే ధైర్యంతో బట్టలు, బుట్ట, రొట్టె ఒడ్డు మీద పెట్టి చెరువు లోనికి వెళ్లి వేట చేసేవాడు. వలకు పడ్డ చేపల్ని, ఒడ్డుకు తెచ్చి దులిపి, తాటాకు బుట్టలో వేసేవాడు. తిరిగి వలతో చెరువులోకి వెళ్లేవాడు. తన ముందు చేపల బుట్ట ఉన్నా, అన్నం నుంచి మాంసం వాసన వస్తున్నా ఆ కుక్క ముట్టుకునేది కాదు. దీనయ్య మధ్యాహ్నం అన్నానికి వచ్చి, చెట్టు కింద కూర్చొని తింటూ, కుక్కకు కొంత పెట్టేవాడు. మాంసం అయితే బొక్కలు వేసేవాడు. సంతోషంగా తినేది. సాయంత్రం చేపలు పట్టడం పూర్తికాగానే బుట్టలోని చేపల్లో కొన్ని చిన్న చేపలు తీసి కుక్క ముందు వేసేవాడు. అది ఆనందంగా తోక ఊపుకుంటూ తిని, యజమాని వెంట ఇంటికి వెళ్ళేది.
ఓ రోజు ఊర కుక్క ఒకటి చెరువు వైపు వచ్చింది. అది గతంలో కొమరయ్య కుక్క. గొర్రెల మందకు కాపలా కాసేది. ఓనాడు యజమాని మందని కుక్కకు అప్పజెప్పి, ఊళ్లోకి వెళ్లి వచ్చేసరికి గొర్రె పిల్లను చంపి చక్కా తినేసింది. చూసిన కొమరయ్య దాన్ని నాలుగు బాది వెళ్ళగొట్టాడు. దానితో పక్క ఊరికి పారిపోయి ఆహారం వెదుక్కుంటూ వచ్చింది. ఆవారాగా తిరుగుతూ, బజార్ల వెంట దొరికింది తింటూ కడుపు నింపుకోసాగింది. దానికి చెరువుగట్టున కాపలా కాస్తున్న నల్ల కుక్క అమాయకంగా కనిపించింది. నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళసాగింది.
”నా దగ్గరకు రాకు. మా యజమాని ఆహారానికి, తను పట్టే చేపలకు కాపలా ఉన్నాను. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో” అని అరిచింది నల్లకుక్క. చెరువులో దీనయ్య వెనక్కు చూసి, ”నా కుక్క దాన్ని తరిమేస్తుందిలే” అనుకున్నాడు.
”నిజంగా నువ్వు ఎంత తెలివి తక్కువ దానివి, చక్కటి చేపల్ని శుష్టుగా తిని, కోరిక తీర్చుకోక కాపలాకాస్తున్నావా? నీవు ఎంత నమ్మకంగా పనిచేసినా, మీ యజమాని, పనికిరాని చేపలే నీకు వేస్తుంటాడు . ఇంకా ఆహారం అంటావా… తాను కడుపు నిండా తిని, మిగిలింది పిరికిడు పెడతాడు . జీవితంలో ఒక్కసారన్నా కడుపునిండా చక్కటి చేపల్ని తిను. మీ యజమాని తినే ఆహారాన్ని తిని చూడు. ఎంత రుచిగా ఉంటుందో! మీ యజమాని వచ్చి అడిగితే, నేను పిట్టల్ని తోల బోయేసరికి నక్క వచ్చి తిని పోయిందని చెప్పు” అని ఉపాయం చెప్పింది. ఇదేదో బాగానే ఉందనిపించింది నల్లకుక్కకు. ‘పెద్ద చేపలు ఎప్పుడూ తినలేదు. ఎప్పుడూ పరక పిల్లలే వేస్తుంటాడు. దీనయ్య భార్య కోడి కూర వండి కట్టింది. తినక ఎన్ని రోజులు అయిందో..?’ మనసులో ఆలోచించసాగింది.
”ఇంకేం ఆలోచించకు. ఇద్దరం చక్కగా తిందాం. కోరిక తీర్చుకుందాం. ఒకవేళ మీ యజమాని నిన్ను వెళ్లగొడితే, నా వెంట రా. స్వేచ్ఛగా తిరుగుతూ, చక్కటి ఆహారం తిందాం” అని ఊరకుక్క బుట్టని కిందకి నెట్టింది. అందులోని చేపలు బిల బిలా వెలుపలికి వచ్చాయి. రెండు కుక్కలు వాటిని చక్కగా తినసాగాయి. దీనయ్యకు ఏదో అనుమానం వచ్చి వెనక్కు చూశాడు. ఇంకేముంది … రెండు కుక్కలు కలిసి చక్కగా చేపల్ని తినసాగాయి. దీనయ్య పెద్దగా కేక పెడుతూ, ఒడ్డుకు పరిగెత్తుకు రాసాగాడు. తను వచ్చేసరికి చేపల్ని గబగబా తినేసాయి. పట్టరాని కోపంతో కట్టె తీసుకొని, రెండు కుక్కల్ని వెంట పడి బాది దూరంగా వెళ్ళగొట్టాడు. తన అన్నాన్ని, బుట్టను పక్కనున్న చెట్టు కొమ్మకు కట్టి, తిరిగి చెరువులోకి వెళ్లాడు వల తీసుకొని.
ఊర కుక్క వెంట వెళ్ళిన నల్ల కుక్కకు, ఉదయం కాగానే ఆకలి అయింది. యజమాని వద్ద ఉంటే పొద్దున్నే చద్దన్నం పెట్టేవాడు. ఊర కుక్కను అడిగింది. అది నేరుగా చెత్తకుండీ వద్దకు తీసుకుపోయింది. ”అందులో ఏమన్నా ఆహారం ఉంటదేమో… వెతికి తీసుకో..” అన్నది. చెత్తంతా కెలకగా దానికో ఎండిపోయిన రొట్టె ముక్క దొరికింది. వెలుపలకు తీసి తినబోయే సరికి, ఊర కుక్క దాని మీద కలబడి, రొట్టె ముక్కను గుంజుకుని తినసాగింది.
”ఇది అన్యాయం. నన్ను యజమాని నుంచి దూరం చేసింది కాక, రొట్టె ముక్కను గుంజుకుంటావా?” అన్నది కోపంగా. ”నిన్ను వెంట తీసుకొచ్చింది నేను. ముందు నా ఆకలి తీరిన తర్వాతే నువ్వు ఆహారం తినాలి. అయినా ఎవరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేయడమేనా? నీ దగ్గర చేపలు ఉండటం చూసి, బురిడీ కొట్టించి చేపలు తిన్నాను. యజమాని రావడం కాస్త ఆలస్యం అయితే, ఆ కోడి మాంసం కూర కూడా తినేవాడిని” అన్నది ఊరకుక్క.
”యజమానిని మోసగించినందుకు, నాకు తగిన శాస్తి జరిగింది” అని, ఊర కుక్కను వదిలేసి గ్రామంలోకి వెళ్లింది. ఆకలితో, తలుపు తెరిచి ఉన్న ఓ ఇంటిలోకి చొరబడింది. కనపడ్డ అన్నం కుండలో మూతి పెట్టి తినసాగింది. ఇంతలో ఇల్లాలు వచ్చి చూసింది. కోపంతో చేతిలోని గంజిని కుక్క మీదకు విసిరింది. కుక్క ఒళ్లంతా కాలింది. కుయ్యో … మొర్రో …. మంటూ బజార్లోకి పరుగు తీసింది. కాలిన ఒళ్ళు నాలుకతో నాక్కుంటూ .. బడి గేటు పక్కన పడుకుంది.
పాఠశాల వదిలిపెట్టగానే ఇంటికి వస్తున్న, దీనయ్య కొడుకు బాలయ్య కుక్కని చూశాడు. ‘ఇది మా కుక్క . మీద ఎవరో వేడినీళ్లు పోసినట్లుంది’ అని ప్రేమగా కుక్క దగ్గర కూర్చొని, తల మీద చేయి వేసి దువ్వాడు. అది కన్నీరు కార్చింది. ”మన ఇంటికి వెళదాం రా. నాన్న నిన్ను ఏమీ అనకుండా చూచే పూచీ నాది” అని కుక్కతో అన్నాడు.
బాలయ్య మాటలు అర్థం చేసుకున్నట్లు, వెంట వెళ్ళింది. దీనయ్య కోపంతో కట్టెతో కొట్టబోయాడు. కానీ కొడుకు అడ్డు వస్తూ, ”చాలా మంచి కుక్క నాన్న. నన్ను చిన్నప్పుడు, నీటిలోంచి కాపాడింది. వేరే కుక్క మాటలు విని, చేపలు తిని ఉంటుంది. ఇంకెప్పుడూ అలా చేయదులే” అని సర్ది చెప్పాడు. దీనయ్య కొడుకు మాటలకు కరిగిపోయాడు. పెరుగు కలిపిన అన్నాన్ని తెచ్చి, కుక్క ముందు పెట్టాడు. అది గబగబా తినేసింది. కాలిన గాయాల మీద, తండ్రి కొడుకులు కలిసి బర్నాల్‌ మందు రాశారు. ”ఇంక నేను బతుకుతాను. జీవించినంత కాలం, యజమానికి సేవ చేస్తాను. చెప్పుడు మాటలు విని, ఈ కుటుంబాన్ని దూరం చేసుకోను” అని గట్టిగా నిర్ణయించుకుంది.

Spread the love