బతుకుమగ్గంపై కలనేత కవితాక్షరాలు

గజ్జెల రామకృష్ణ తొలి కవితా సంకలనం ‘దీపముండగానె’. వృత్తి జీవితంలోని ఆర్తిని, దైన్యాన్ని వ్యక్తీకరించి, బతుకులో అంతుచిక్కని కోణాలను స్పృశిస్తోంది. పోగుపోగుకూ కలల మగ్గం మీద కవితా ఊహల భావాలను అద్భుత కవనాలుగా నేయగల నేర్పరి అయిన కవితా హృదయం ఈ సంపుటిలో ప్రతిబింబిస్తోంది. ”కట్టె కొట్టినా… బొమ్మ చెక్కినా… చెప్పు కుట్టినా… డప్పు మోగించినా… బట్ట ఉతికినా… మగ్గం నేసినా” అంటూ తెలంగాణ సీమలో బహుజనుల బాధలు, ఛిద్రమైన జీవన కథనాలను, ఉప్పు, నిప్పు, శ్రమ, ప్రేమా బతుకు వాస్తవాలను రామకృష్ణ కళ్లకు కట్టింప చేస్తారు. ఆకాశంపైకి చూస్తూ చిగురు పిట్టలు ఎప్పుడొస్తాయని ‘దిగులు పూసిన చెట్టు’ ఈ సంపుటిలో కనబడుతుంది. రాత్రీపగలూ కలలు అద్ది నేసిన చీర అమ్మకం బజారులో గాజుబొమ్మలా మగ్గం పాడుతున్న చేదుగానం హృదయాన్ని కదిలిస్తుంది. ఆశలు, ఆశయాలు నిద్రమత్తులో జారిపడకుండా తూర్పువాకిట ఎర్రటి సురుకు కాగడా మండించి అంటూ ఆకాశాన్ని ‘అమృతధార’ కవితలో సాక్షాత్కరింపజేస్తారు. పట్నం గది నిండు పుస్తకాల నడుమ బందీ అయినా అప్పటికప్పుడు అప్పగింతల పాలయినా, నాన్న గుండె బెంగపడే కొండంత ఎడబాటు ‘కూతురు పద్యం’ కలవరం కలిగిస్తుంది. ‘నెమలిపాఠాలు’ కవితలో అరవైఏండ్లుగా పాదరక్షలు లేని నాన్న నడక పాట మౌనవేదన వినిపిస్తుంది. ‘చౌరస్తాలో పెద్దపులి’ కవితలో అది మేక అంటే నేనొప్పుకోను, ఖాళీ కడుపు కాలినప్పుడు ఎదురు తిరగడం నేర్వాల్సిన గొప్ప పాఠం దర్శింపచేస్తారు. ‘పంజరం’ కవితలో నగరానికి నేనొక వలస పక్షిని, నగరం మాయలఫకీరులా నవ్వుకుంటుంది అంటూ పెదవులపై నవ్వు పతంగులు ఎగరేయలేనంటారు. ‘వాడిని చూస్తే గుర్తుకొస్తుంది’ కవితలో ఎండలో నిప్పులా, వానలో నదిలా, చలిలో మంచులా కాలాన్ని కాలువలా దాటుతున్న వీధుల్లో తిరిగే నిర్భాగ్యుణ్ణి చూపిస్తారు. గుడ్డిదీపం, కట్లపాము, సాలెగూడు, నల్లకుక్క, గాలిపటం, చిలుకరెక్క, రెక్కలగుర్రం, ఒక్క రూపాయి… ఈ సంపుటిలో ఒదిగిన ఏ కవిత అయినా కవి అద్భుత కవితాక్షరాలకు ప్రాణం పోసి వెలకట్టలేని కానుకగా తన్మయింపచేస్తున్నాయి. సామాజిక వేదనను ప్రతిభావంతంగా కవితాక్షరాలుగా అల్లిన గజ్జెల రామకృష్ణ అభినందనీయలు.
– జయసూర్య, 9014948336

దీపముండగానె
రచన : గజ్జెల రామకృష్ణ
పేజీలు : 128, వెల :100/-
ప్రతులకు : 13-40, ప్రకాశ్‌నగర్‌ కాలనీ,
భూదాన్‌ పోచంపల్లి, యాదాద్రి భువనగిరి-508284.
సెల్‌ : 8977412795.

Spread the love