”కుక్కపిల్ల, అగ్గిపుల్ల… సబ్బుబిళ్ళ హీనంగా చూడకు దేన్నీ…” అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అంటే కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళపై కూడా కవిత్వం రాయవచ్చు అని ఆయన ఉద్దేశం. అదే కొద్దిగా మారిస్తే ఆదాయానికి కాదేది అనర్హం అని నిరూపిస్తున్నారు నేటి యువత. వారి పరిశీలనా దృష్టి చాలా నిశితంగా ఉంటుంది. దేనినైనా ఆదాయ మార్గంగా మార్చడంలో వారు విజయం సాధిస్తున్నారు. తమతోపాటు మరో పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి యూత్ సక్సెస్ స్టోరీ ఈ వారం జోష్…
అరటి చెట్టు వలన ఎన్నో ఉపయోగాలున్నాయి. పండ్లు, ఆకులు, కాండం, రసం ఇలా అన్నింటికీ అనేక విధాలుగా గణనీయమైన ఉపయోగం ఉంది. కాబట్టి, ఈ అరటి చెట్టులో కొంత భాగాన్ని ఫైబర్‌లుగా తీయగలిగితే, అది ఎంత అద్భుతమైనది! నారను తీయడానికి సాగు కోసం ప్రత్యేకంగానో, అదనపు వనరులను ఉపయోగించాల్సిన అవసరం లేదు. మెహుల్ ష్రాఫ్ సరిగ్గా అదే ఆలోచించాడు. ప్రత్యేక సాగు లేకుండా, నీరు, ఎరువులు వంటి అదనపు వనరులను ఉపయోగించకుండా, ప్రస్తుత సాగు నుండి కొత్త ఉత్పత్తిని పొందవచ్చు. ఇది మాత్రమే కాదు, అరటి చెట్ల నుండి నారను బయటకు తీయడం ద్వారా అరటి సాగు నుండి ఉత్పన్నమయ్యే వ్యర్థాల పరిమాణాన్ని కూడా తనిఖీ చేస్తుంది. మెహుల్ ఈ ఆలోచన కేవలం ఆదాయం గురించే కాదు. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి కూడా భూమిని కాపాడాలన్న పర్యావరణ స్పృహ కూడా ఉంది.
మార్పుకు దారితీసిన ఒక నిశిత పరిశీలన:
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుర్హాన్‌పూర్‌కు చెందిన మెహుల్. అరటితోట కోసిన తర్వాత భారీ వ్యర్థాలు వదిలివేస్తున్న విషయాన్ని గమనించాడు. ప్రజలు పండ్లు, ఆకులను ఉపయోగిస్తున్నారు. వ్యర్థాలుగా పేరుకుపోయిన అరటి కాడలను విస్మరిస్తున్నారు. అరటి కాండం నుండి రసం తీసినప్పటికీ, అది భారీ మొత్తంలో వ్యర్థాలను తయారు చేస్తుంది. మెహుల్ తన స్వగ్రామంలో ఎక్కువ భాగం అరటి సాగు చేయడాన్ని గమనించాడు. ప్రతి ఏడాది ఉత్పత్తి అవుతున్న వందల టన్నుల అరటి చెట్ల వ్యర్థాలను చూశాడు. అప్పుడే ఈ వ్యర్థాలను మళ్లీ ఉపయోగించాలనే ఆలోచించాడు మెహుల్. వ్యర్థాలు నుంచి ఏదో ఒకదానిని తయారు చేయవచ్చు అని భావించిన మెహుల్.. ఆ దిశగా తన పరిశోధనను ప్రారంభించాడు.
సాధారణంగా అరటిపండు తిని తొక్కల్ని పారేస్తాం. అరటి ఆకులను భోజనం చేయడానికి ఉపయోగిస్తాం. ఆ తరువాత అదీ పారేస్తాం. కోత పూర్తైన అరటి తోటని వ్యర్థంగా ఉంచేస్తాం. కానీ మధ్యప్రదేశ్ కుర్రాడు మేహుల్ ష్రాఫ్ ఈ వ్యర్థాలను వ్యాపారంగా మలిచాడు. నెలకి రూ.25లక్షల ఆదాయంతో దూసుకెళ్తున్నాడు. రోడ్డుపై, డస్ట్‌బిన్‌లో పడేసిన అరటి తొక్కలను చాలా అపురూపంగా తీసుకొని సంచిలో వేసుకుంటా ఉంటే ఎవరైనా ఆ వ్యక్తిని వింతగానే చూస్తారు. ఈ తొక్కల్ని ఏం చేసుకుంటారా బాబు అని ఆశ్చర్యపోతారు. కానీ ఆ తొక్కలే మేహుల్ వ్యాపారానికి ముడిసరుకు. తను ఎంబీఏ పూర్తయ్యాక ఉద్యోగంలో చేరకుండా కుటుంబ వ్యాపారంలోకి దిగాడు. ఓసారి బుర్హాన్‌పూర్‌లోని నవసారి వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ వర్క్‌షాప్‌కి హాజరయ్యాడు. అక్కడే అరటి కాండం, ఆకులతో ఫైబర్‌నీ.. దాంతో టెక్స్‌టైల్, కాగితం లాంటి రకరకాల ఉత్పత్తులు తయారు చేయొచ్చని తెలుసుకున్నాడు. ఈ విషయం అతడిలో ఆసక్తి రేకెత్తించింది. తను ఉండే ప్రాంతంలో ఏటా 40 వేల ఎకరాల్లో అరటి పండుతోంది. ఒక్క అరటి కాండం నుంచే ఒక పంట కాలంలో ఎకరానికి దాదాపు 30 టన్నుల వ్యర్థాలు ఉత్పన్నమవుతాయి. అంటే 40 వేల ఎకరాలంటే ఎన్ని వేల టన్నుల వ్యర్థాలు ఉత్పన్నమవుతాయో ఒకసారి ఊహించండి!
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే కోణంలో రెండేండ్ల పాటు పరిశోధన చేశాడు. నిపుణులను కలిసి కాండం, ఆకుల నుంచి తయారయ్యే ఉత్పత్తుల సాధ్యాసాధ్యాలు గురించి తెలుసుకున్నాడు. మెహుల్ అరటి కాడలను ఉపయోగించి పర్యావరణ అనుకూలమైన కాగితం, బట్టలను తయారు చేయడంలో ఉన్న అవకాశాల గురించి ఆలోచించాడు. అతను అరటి చెట్ల మైక్రోబయాలజీని నేర్చుకున్నాడు. అరటి కాండం వస్త్రం, కాగితపు ఉత్పత్తుల తయారీలో ఉపయోగించవచ్చని అతని పరిశోధన యొక్క ఫలితం అతనికి చెప్పింది. ఇది విస్మరించిన అరటి కాండం నుండి పునర్వినియోగపరచదగిన ఓ అవగాహనకు వచ్చిన తర్వాత బయో-డిగ్రేడబుల్ ఉత్పత్తులను తయారు చేసే ష్రాఫ్ ఇండిస్టీస్‌కు మెహుల్ పునాదులు వేసింది. 2018లో ‘ష్రాఫ్ ఇండిస్టీస్’ అంకుర సంస (సార్టప్)ను ప్రారంభించాడు.
ముందుగా, కోత పూర్తి అయిన అరటి తోటల నుంచి కాడలను సేకరించి, ష్రాఫ్ ఇండిస్టీస్‌కు తీసుకువస్తారు. అక్కడ అవి నిలువుగా సగానికి కత్తిరించి, షీట్లను వేరు చేస్తారు. ఈ షీట్‌లను యంత్రాల సహయంతో గ్రెడింగ్ చేస్తారు. ఈ ఫైబర్‌లను ఎండలో ఎండబెట్టి, వాటిని వివిధ ఉత్పత్తులను తయారు చేయడానికి అనుకూలంగా మారుస్తారు. అరటి ఫైబర్‌లలో పెద్ద మొత్తంలో సెల్యులోజ్ ఉన్నందున, అవి ద్రవాన్ని సులభంగా గ్రహిస్తాయి. అందువల్ల, ఈ ఫైబర్‌లను పర్యావరణ అనుకూలమైన శానిటరీ ప్యాడ్‌ల తయారీలో ఉపయోగిస్తారు, ఇవి కుళ్ళిపోవడానికి 200 రోజులు పడుతుంది. అరటి నారలను బట్టలు, టిషఉ్య, కాగితం తయారీకి కూడా ఉపయోగిస్తారు. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా రోజుకు దాదాపు 2,70,000 చెట్లను కాపాడవచ్చు అంటే అతిశయోక్తి కాదు. గట్టి ఫైబర్‌ల వ్యర్థాలతో బుట్ట, చీపురులను కూడా తయారు చేయవచ్చు.
రైతుల దగ్గర నుంచి అరటి కాండం, ఆకులు, తొక్కలు తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. వీటితో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ మిశ్రమంతో బుట్టలు, పూలకుండీలు, బ్యాగులు, యోగా మ్యాట్‌లు, చీపుర్లు, చివరికి గోడగడియారాలు సైతం తయారు చేస్తున్నాడు. ఇందులో పని చేయడానికి చుట్టుపక్కల గ్రామాల్లోని నలభైమంది మహిళలకు కొద్దినెలలపాటు శిక్షణనిప్పించి మరీ ఉపాధి కల్పిస్తున్నాడు. ఈ సంస్థ తయారు చేస్తున్న ఉత్పత్తులన్నీ ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయాలే. దీంతో పర్యావరణానికి మేలు చేకూరడమే కాకుండా.. పంట కోత అయ్యాక వ్యర్థాలను తరలించడం.. రైతులకు తలకు మించిన భారం. ఆ ప్రయాస కూడా తప్పుతోంది.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417