ఆశలు మొలకెత్తిన కాలం

అధికార అహం నెత్తికక్కిన మత్తులో
అభివృద్ధి ప్రణాళికలు మరిచి,
పూలదండను తెంపినట్టు
మనుషుల మధ్య స్నేహ బంధాలను తెంచి
పండుగ చేసుకోవాలని
పన్నాగాలు రచించేవాడు

అన్నదమ్ముల మధ్య అగ్గి రాజేసి
ఆ మంటల్లో సౌభ్రాతృత్వాన్ని కాల్చాలని
కలలుగన్నవాడు
అమృతాన్ని పంచుతున్నానని ఎంత మభ్యపెట్టినా
వాడి గిన్నెలోని విషాన్ని ఎంతకాలం దాచగలడు

మనసునిండా ముళ్ళనుదాచి
పువ్వు లెక్క నవ్వినా
కర కోరలు కనబడకుండా
ఆవు వేషంగట్టినా
వాని ముఖానికి పూసుకున్న
మోసపు రంగు వెలిసిపోయేలా

ఈ మండు వేసవిలో బంగాళా ఖాతం మీదుగా
విస్తరిస్తున్న ఉపరితల ద్రోణి కారణంగా
కర్ణాటక లో భారీ వర్షం కురిసింది

గుండెను గుండెతో జోడించే ప్రేమ వర్షం
భారత్‌ అంతా విస్తరించి
విస్తారంగా అభివృద్ధి పంటలు పండాలని
దేశం మదిలో ఆశలు మొలకెత్తున్నరు!

– రహీమొద్దీన్‌, 9010851085

Spread the love