మూగ ప్రాణులు

నరసింహపురంలోని రామయ్య తన రెండు ఎద్దులను, నాగలిని తీసుకొని పొలాన్ని దున్నడానికి బయలుదేరాడు. దారిలో ఒక ఎద్దు ఆకస్మికంగా కుప్పకూలిపోయింది. రామయ్య దాని తోకను ముట్టినప్పటికీని అది లేవలేదు. తనకు ఆరోజు అత్యవసరంగా పొలం దున్నాల్సి ఉంది. ఇంతలో దుర్గయ్య ఎద్దు ఒంటరిగా అక్కడ కనబడింది. వెంటనే రామయ్య ఎదురుగా వస్తున్న రంగయ్యతో దుర్గయ్య ఎద్దును తాను నాగలికొరకు పొలానికి తీసుకుని వెళుతున్నట్లు చెప్పమన్నాడు. రంగయ్య సరేనన్నాడు.
ఆ కుప్పకూలిన ఎద్దును అలాగే వదిలిపెట్టిన రామయ్య తన పొలానికి వెళ్లి దున్ని తిరిగి వచ్చే సమయంలో ఆ కుప్పకూలిన తన ఎద్దు అక్కడ లేదు. రామయ్య అది ఇంటికి వెళ్ళింది కాబోలు అని అనుకున్నాడు. కానీ తన ఇంటికి కూడా ఎద్దు రాలేదని అతనికి తర్వాత తెలిసింది. వెంటనే అతడు దుర్గయ్య ఇంటికి వెళ్లి అతని ఎద్దును అప్పగించి తన ఎద్దు కనిపించిందేమోనని అడిగాడు. దుర్గయ్య తాను అతని ఎద్దును చూడనే లేదని చెప్పాడు. ‘మరి తన ఎద్దు ఎక్కడికి వెళ్లినట్టు?’ అని తీవ్రంగా ఆలోచించిన రామయ్య ఆ తెల్లవార్లూ నిద్రపోలేదు. ఇలా నాలుగు రోజులు గడిచాయి. ఎద్దు జాడనే లేదు. రామయ్య ‘ఇక నేను మరొక ఎద్దును కొనాల్సిందే! లేకుంటే నాకు చాలా కష్టం, నష్టం కూడాను’ అనుకున్నాడు. ఇంతలో ఒక రోజు దుర్గయ్య అతని ఎద్దును పట్టుకుని వచ్చాడు. ”దుర్గయ్య మామా! ఈ ఎద్దు నీకు ఎక్కడ కనిపించింది?” అని అడిగాడు రామయ్య.
”నేను అడవికి పోయే దారిలో ఆ సమీపంలోనే నీ ఎద్దు ఒక చెట్టు కింద పడుకున్నది. అది కన్నీరు కారుస్తూ నాకు కనిపించింది. విచిత్రం ఏమిటంటే ఒక పెద్దపులి దాని దగ్గర నుండి వెళ్లడం దూరం నుండి గమనించాను. కానీ ఆ పులి నీ ఎద్దును ఏమీ చేయలేదు. అది నీ అదృష్టం కావచ్చు. నేను నీ ఎద్దును గుర్తించి దాన్ని తీసుకుని వచ్చాను” అన్నాడు దుర్గయ్య.
”ఔను. దుర్గయ్య మామా! నా ఎద్దుకు కాలునొప్పి ఉండేది కదా! అది అడవి సమీపానికి ఎలా వెళ్ళింది? నా పొలానికి రావడానికే అది కదల్లేదు కదా!” అని అన్నాడు రామయ్య. అప్పుడు దుర్గయ్య ”రామయ్యా! నాకు ఒకటి తోస్తున్నది. నీ ఎద్దు కాలినొప్పితో కూలబడడం నిజమే. కానీ అది ఆ నొప్పితో పని చేయలేదు కదా! అందువల్ల నీకు అది తన ముఖాన్ని చూపించలేక నెమ్మదిగా లేచి వెళ్లి అడవి సమీపానికి పోయి ఉంటుంది. అది నీకు ఉపయోగపడలేదనే బాధపడుతూ ఆ పని చేసింది కావొచ్చు. నన్ను చూడగానే అది ఏడ్చింది కూడా! ఇదిగో! ఇప్పుడు కూడా అది కన్నీరు కారుస్తూనే ఉంది. చూడు!” అని అన్నాడు. ”ఆరోజు నాకు చాలా అత్యవసరంగా పొలం దున్నవలసి ఉండడం వల్లనే నేను దాన్ని ఒంటరిగా వదిలి నా పొలానికి వెళ్లాను. ఆ తర్వాత దాన్ని పశువుల వైద్యునికి చూపించాలనుకున్నాను. కానీ ఎద్దు నాకు కనిపించలేదు” అని అన్నాడు రామయ్య.
”రామయ్యా! నేను ఒక సలహా ఇస్తాను. పశువులు కాలు నొప్పితో బాధపడినప్పుడు వాటికి విశ్రాంతి ఇవ్వాలి. అలా దాని బాధ తగ్గే వరకు వాటికి విశ్రాంతి ఇస్తే తర్వాత అవి చురుకుగా పనిచేస్తాయి. నేను అలాగే చేస్తున్నాను. నా ఎద్దుకు కూడా నాలుగు రోజుల క్రితం కాలుకు దెబ్బ తగిలి అది నడవలేక పోయింది. నిన్నటినుండే అది నడుస్తున్నది. అందువల్లనే నా ఎద్దు ఒంటరిగా మేత మేస్తూ నీ కంటపడింది. నీవు రంగయ్య మామతోని నా ఎద్దును తీసుకుని వెళుతున్నానని చెప్పినప్పుడు నేను వద్దని చెబుదామని అనుకున్నాను. కానీ నీవు అదివరకే దాన్ని తోలుకొని వెళ్లావు. సరేనని తిరిగి వచ్చిన తర్వాత నీకు ఆ సంగతి చెబుదామనుకున్నాను. అందుకే చెబుతున్నాను. అవి మూగ ప్రాణులు. వాటి బాధను మనతో చెప్పుకోలేవు కదా! అందువల్ల నీవు వాటి కాలుకు దెబ్బ తగిలినపుడు వాటికి పని చెప్పకుండా విశ్రాంతి ఇచ్చి చూడు” అని సలహా ఇచ్చాడు రామయ్య.
”సరే దుర్గయ్య మామా! నీవు చెప్పినట్లే చేస్తాను” అని అన్నాడు రామయ్య. ఆ తర్వాత అతడు దుర్గయ్య చెప్పినట్లే చేశాడు.

– సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, 9908554535

Spread the love