నల్లబంగారు సిరుల నేలమీద బాల గేయ ‘పూర్ణసుధ’

kolachana sri sudhaతెలంగాణ ఆర్థిక, సామాజిక, రాజకీయ కోణంలో సింగరేణిని విస్మరించి చూడలేం. జీవధాతువుగా నిలిచి తెలంగాణను మరింత తేజస్సుతో వెలిగింపజేస్తున్న నల్ల బంగారు గనుల నేల సింగరేణి. సాహిత్య, సామాజిక, వామపక్ష ఉద్యమాలకు ఈ నేల ఊతమిచ్చింది. అక్కడ పుట్టి పెరిగి సాహిత్య సృజన చేస్తున్న వారిలో కొలచన శ్రీసుధ ఒకరు. రామగుండంలోని ఫర్టిలైజర్‌ సిటీలో జనవరి 30, 1981న శ్రీసుధ పుట్టింది. అమ్మానాన్నలు శ్రీమతి బొందలపాటి అన్నపూర్ణా దేవి – శ్రీ బొందలపాటి లక్ష్మణశాస్త్రి.

శ్రీసుధకు సాహిత్యంతో పాటు చిత్రకళలో ప్రాణ్యం ఉంది. పలు పుస్తకాల కోసం బొమ్మలు, ముఖపత్రాలు రచించింది. శ్రీ ఫైన్‌ ఆర్ట్స్‌ సంస్థను స్థాపించింది. బిటెక్‌ (ఇ.ఇ.ఇ), ఎం.బి.ఎ, హిందీ విద్వాన్‌ చదివిన శ్రీసుధ కొలచన సాఫ్ట్‌సొల్యూషన్స్‌కు డైరక్టర్‌. శ్రీ ఫైన్‌ ఆర్ట్స్‌ ద్వారా ఇప్పటికి ముప్పై పుస్తకాలు ప్రచురింపబడగా అందులో బాల సాహిత్యమే ఎక్కువగా ఉండడం విశేషం. ఇవేకాక యాభై వరకు బాల సాహిత్య సంకలనాలు కూడా శ్రీసుధ తెచ్చింది. ‘ఎమోషన్‌ ట్రైలెట్‌ ఎక్స్‌ప్రెషన్‌’ పేర తొలి రచనను ప్రచురించింది. తన వచన కవితలను ‘నేనేమవను?’ పేరుతో అచ్చులోకి తీసుకువచ్చింది. మరో నాలుగు సంపుటాల కవిత్వం అచ్చుకు సిద్ధంగా ఉంది. అన్ని కార్యక్రమాలతో పాటు బాలల వికాస కార్యక్రమాలంటే ఆసక్తి కనబరిచే శ్రీసుధ ఎన్‌.ఐ.టి తిరుచునాపల్లి నిర్వహించిన అంతర్జాతీయ బాలల సప్తాహంలో పాల్గొంది.
ఐఐఎం బెంగళూరు నుండి ‘ది స్కిల్డ్‌ ప్రెజంటర్‌’, ‘డిబేట్‌ బైట్‌’ అవార్డులతో పాటు, ఈనాడు నుండి రెండుసార్లు ‘అమేజింగ్‌ అమ్మ’ టైటిల్‌ గెలుచుకుంది. వివిధ రూపాలు, ప్రక్రియల్లో రచనలు చేసిన శ్రీసుధ అనేక పురస్కారాలను గెలుచుకుంది, గుర్తింపును పొందింది. వాటిలో… తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భగా హైదరాబాద్‌ జిల్లా సాహిత్య పురస్కారం, సాహిత్యం, చిత్రలేఖనంలో ‘పుడమి కళారత్న పురస్కారం’, సేవాదర్పన అవార్డు, సాహితీ రత్న, ఉత్తమ వక్త, అక్షరక్రాంతి అవార్డు, సామాజిక సమరసతా వేదిక వారి ‘శాంతి కపోతం అవార్డు’ వంటివి వీరు గెలుచుకున్న వాటిలో కొన్ని. ఇవేకాక విద్యార్థి దశలోనూ రంగోలి మొదలు వ్యాసం, చిత్రలేఖనం, రచన, వక్తృత్వం వంటి వాటిల్లో అనేక బహుమతులు శ్రీసుధ గెలుచుకుంది. రచయిత్రిగా అన్ని ప్రక్రియల్లో వ్రాసిన కొలచన శ్రీసుధ బాలల కోసం కథలు, గేయాలే రాసింది, వివిధ పత్రికలలో అచ్చవడమే కాక గేయాలను ‘పూర్ణసుధ’ పేరుతో తెచ్చింది. బాలల కథా సంపుటి ‘కథా సుధ’ ముద్రణకు సిద్దంగా ఉంది. ‘పూర్ణసుధ’ బాల సాహిత్యం గిడుగు రామ్మూర్తి షౌండేషన్‌ వారి జాతీయ బాల సాహిత్య పురస్కారం గెలుచుకుంది.
బాల సాహిత్యంలో శ్రీసుధ తొలి రచన ‘పూర్ణసుధ’ బాల గేయ సంపుటి. కథల పుస్తకం ‘కథా సుధ’ త్వరలో వెలువడనుంది. చక్కని, చిక్కని గేయాల కవితా సుధ పూర్ణ ‘సుధ’లో చూడవచ్చు. ‘అమ్మ, ఆవు, ఇల్లు ఈగ/ కమ్మనైన తెలుగు పదాలు/ గుమ్మపాలవంటివి/ మమకారం పంచిపెట్టె/ పీచు మిఠాయంటివి/ ఏబదారు మణిపూసలు/ గుదిగుచ్చిన దారమది’ అంటూ మాతృభాష ఔన్నత్యాన్ని గానం చేసిన కవయిత్రి తన గేయసుధతో భాషకు బ్రహ్మరథం పట్టింది. ఇందులోని గేయ ప్రాస ఈమె గేయాలకు అందాన్నేకాక పిల్లలను చక్కగా ఆకర్షిస్తుంది కూడా. ‘బొజ్జావారింటిలోన/ బుజ్జిమేకొకటి ఉన్నది/ బొజ్జలోన ఆకలేసి/ … సజ్జాపై… మజ్జిగ.. బెజ్జంలోంచి.. సజ్జ.. బొజ్జ’ ఇలా సాగుతాయి. గౌరమ్మను గురించి కూడా శ్రీసుధ పిల్లల కోసం చక్కని గేయం రాసింది. అందులో- ‘ఒక్కొక్క పువ్వేసి సందమామ/ ఒక్క జామాయె సందమామ/ రెండేసి పూలేసి సందమామ/ రెండు జాములాయె సందమామ/… నీపూజ నేజేస్తే సందమామ/ నా పంట పండేనె సందమామ/ సల్లంగ సూడమ్మ సందమామ/ మల్ల రావె గౌరమ్మ సందమామ’ అని శ్రీసుధ గౌరమ్మకు వీడ్కోలు, స్వాగతం చెబుతుంది. పీర్ల పండుగ గురించి రాయడం శ్రీసుధ తన చుట్టూ ఉన్న సంస్కృతిని ఎంతగా పరిశీలించిందో తెలుపుతుంది. ‘పీరమ్మ పీరు సాయెబు పండుగచ్చెరో/ ఊదుబత్తీల పొగలోన జాతరంటరో’ అంటూ అచ్చమైన తెలంగాణ భాషలో ఈ గేయం ఉండడం విశేషం. ఇలా తెలంగాణ బాషలో రాసిన మరికొన్ని గేయాలు కూడా ఈ సంకలనంలో కనిపిస్తాయి. ‘బాలుడు ఉదయించినాడు’ గేయంలో ఏసుక్రీస్తు జననాన్ని గురించి రాస్తుంది కవయిత్రి. ఈ గేయసంపుటిలోని మరో అంశం కవయిత్రి వివిధ అక్షరాలతో గేయాలు రాయడం, అలా ‘ఆ’, ‘ల’ వంటి అక్షరాలతో గేయాలుంటాయి. ‘విమల కమల నేస్తాలు/ శ్రమలో కలిపెను హస్తాలు’ వంటి గేయాలు చక్కని లయాత్మకతతో ఉన్నాయి. ఇంకా ‘పకపకనవ్వే పువ్వులం/ పాటలా సాగే మువ్వలం/ .. పౌరులం భావి భారత పౌరులం/ పంచదార పలుకుల చిలకలం’, ‘కొమ్మా ఉయ్యాల, రెమ్మా ఉయ్యాల/ పిల్లా పాపల్తో అందరు సల్లంగుండాల/ వానలు కురవాల, గాదెలు నిండాల/ గాదెలు నిండి మా బతుకుల పండాల’ అంటుంది. ఇంకా ‘పచ్చని చెట్టు/ ప్రగతికి మెట్టు/ ఒక్కటైన నాటు/ మేల్జేయునట్టు/ చిట్టి చేతులు/ పట్టు బట్టితే/ గట్టి మేలైన/ ఇట్టే జరుగు’ అని హరిత స్వప్నాన్ని తన గీతంలో చెబుతుంది శ్రీసుధ. రచయిత్రి, కవయిత్రి, సింగరేణి బంగారం కొలచన శ్రీసుధ మరిన్ని చక్కని బాలల రచనలు తేవాలని ముబారక్‌బాద్‌! జయహో! బాల సాహిత్యం.

– డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

Spread the love