కీర్తి కాంక్ష

 Desire for fameపూర్వం ‘విద్యానగరం’ పట్టణంలో కుబేరవర్మ అనే గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతని వద్ద అపారమైన సంపద ఉండేది. అదంతా తన పూర్వీకుల నుండి సంక్రమించిందే. తన వద్ద ఉన్న సంపద అంతా దానధర్మాలు చేసి తాను ఒక అపర కర్ణుడిగా పేరు సంపాదించుకోవాలని కీర్తి కాంక్ష కలిగింది. ఆ ఉద్దేశంతోనే అడిగిన వారికి లేదనకుండా ధన కనక వస్తు వాహనాలు దానం చేస్తూ వచ్చాడు. అంతేకాదు గుళ్ళు, గోపురాలు కట్టించి వాటి మీద తన పేరు చెక్కించుకునేవాడు. తాను చేసిన ప్రతి దానం అందరికీ తెలియాలని తాపత్రియపడేవాడు. ఆ ఆస్తంతా పూర్వీకులు సంపాదించింది కనుక డబ్బు విలువ అంతగా తెలియదు. ఇక తాను అనుకున్నట్టుగానే తన కీర్తి నాల్గు దిశలా వ్యాప్తి చెందింది.
అంతేకాదు కుబేరవర్మ చేస్తున్న ఈ అంతులేని దానధర్మాల గురించిన సమాచారం దేవలోకం దాకాపాకింది. దేవలోకం వారు కుబేరవర్మను పరీక్షించాలని అనుకున్నారు. ఒకసారి ఒక సన్యాసి కుబేరవర్మ వద్దకు వచ్చి ”నాకు ఆకలిగా ఉంది మూడు రోజులైంది తినక కాస్త భోజనం పెట్టించండి” అన్నాడు. అందుకు కుబేరవర్మ నవ్వి ”అన్నదానం ఏముంది. ఎవరైనా చేస్తారు. మీకు వెండి, బంగారం, డబ్బు ఏం కావాలన్నా ఇస్తాను. అంతేగాని ఇలాంటి చిన్నచిన్న దానాలు చేసి నా ప్రతిష్ట తగ్గించుకోను. అన్నమే కావాలంటే ఇంకో ఇంటికివెళ్ళండి” అన్నాడు.
సన్యాసి ”నేను సన్యాసిని. నాకెందుకు అవన్నీ. భోజనం లేదంటే వెళ్ళిపోతాను” అంటూ అక్కడినుండి కదిలిపోయాడు.
అయితే కుబేరవర్మ పక్క వీధిలో దేవదత్తుడు అనే సామాన్య కుటుంబీకుడు ఉండేవాడు. దేవదత్తుడు గొప్ప దయాగుణం కలవాడు. ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా భోజనం పెట్టేవాడు. అంతే కాదు సాటివారికి తనకు ఉన్నంతలో సాయం చేసేవాడు. తను చేసే దానధర్మాల వల్ల తనకు పేరు ప్రఖ్యాతులు రావాలని ఏనాడూ ఆశించేవాడు కాదు. నిస్వార్ధంగా జీవించేవాడు.
ఆ సన్యాసి దేవదత్తుడు ఇంటిని వెతుక్కుంటూ వచ్చి తనకు ఆకలిగా ఉన్నట్టు చెప్పి, భోజనం పెట్టించ వలసిందిగా కోరాడు.
దేవ దత్తుడు సన్యాసిని సాదరంగా ఆహ్వానించి కడుపునిండా భోజనం పెట్టించాడు. సన్యాసి దతుణ్ణి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.
కొంతకాలం తర్వాత వయసు మీదపడి దత్తుడు చనిపోయాడు ఆ తర్వాత కుబేర వర్మ కూడా చనిపోయి స్వర్గం చేరుకున్నాడు. అక్కడ స్వర్గంలో చాలామందే ఉన్నారు. అయితే తనకంటే ముందుగానే చనిపోయిన దత్తుడు అక్కడ ప్రథమ స్థానంలోనే ప్రత్యేక ఆసనం పైకూర్చొని ఉండటం కనిపించింది.
కుబేరవర్మకు పదకొండశవ స్థానం లభించింది. అది సహించలేని కుబేరవర్మ మండిపడుతూ దేవదూతలతో వాగ్వివాదానికి దిగాడు. ”అదేమిటి నా ముందు దత్తుడెంత? మా పూర్వీకులు సంపాదించిన అపార సంపదనంతా ప్రజలకు పంచిపెట్టాను. ధన, కనక, వస్తు వాహనాలు దానం చేశాను. వెండి, బంగారు నాణాలు దోసిళ్ళతో కుమ్మరించిన నాకంటే, పట్టెడన్నం పెట్టిన దత్తుడు గొప్పవాడు ఎలా అవుతాడు? అసలు నాకంటే ముందున్నవాళ్లంతా ఎవరు?” అన్నాడు.
అందుకు దేవదూతలు ”అందరికంటే ముందున్న దేవదత్తుడు ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాడు. అన్నిటికన్నా అన్నదానం గొప్పది. అతనిలో ఎలాంటి స్వార్థం లేదు. కేవలం జాలి, దయ, ప్రేమతోనే అన్నార్తుల ఆకలి తీర్చాడు. సాటివారికి సహాయం చేశాడు. ఇకపోతే మిగిలినవారు… నగరంలో ఆసుపత్రులు నిర్మించి ఎంతోమంది రోగులకు ఉపశమనం కలిగించిన వారు కొందరైతే, వికలాంగులను ఆదరించి పోషించినవారు కొందరు. ఇంకా కొందరు నీటి చెరువులు తవ్వించి ప్రజలకి, పశువులకు నీటి కొరత లేకుండా చేశారు. మరి వీరిలో ఎలాంటి ప్రతిఫలాపేక్ష కనిపించదు. అందుకే వారు నీకంటే ముందున్నారు. మరి నువ్వు చేసిన దాన ధర్మాల్లో స్పష్టత లేదు. దానం అనేది అవసరానికి మించి ఉండకూడదు. మీ పూర్వీకులు సంపాదించిన సంపద అంతా దానాల పేరిట దుర్వినియోగం చేశావు. అపాత్రదానం చేశావు. నీవద్ద ధన, కనక, వస్తు వాహనాలు దానంగా పొందిన వారంతా పనులు మానేసి సోమరిపోతులై తింటూ కూర్చున్నారు. నువ్వు భూములు దానం చేసిన వారిలో ఒక్కరు కూడా రైతులు లేరు. ఇంకా గుళ్ళు, గోపురాలు కట్టించి వాటి మీద నీపేరు చెక్కించుకొని గొప్ప కీర్తి కాముకుడని పేరు తెచ్చుకున్నావు. అలా నీలో అహం పెరిగిపోయింది. అందుకే నీకు పదకొండవ స్థానం లభించింది. ఎప్పుడైనా దానం అనేది గుప్తంగా ఉండాలి కాని నువ్వు అలా చేయలేదు” అని చెప్పారు.
అంతా విన్నాక కుబేరవర్మకు జ్ఞానోదయం అయింది. తన పూర్వీకులు సంపాదించిన సంపదనంతా ఇలా కీర్తికాంక్షతో దుర్వినియోగం చేసినందుకు ఎంతో పశ్చాతాపడ్డాడు.
– బూర్లె నాగేశ్వరరావు, 9848419950

Spread the love