మంచి మార్పు

Good changeచెంగల్వాపురంలోని వెంకటయ్య వ్యాపారంలో పెట్టుబడి పెట్టి కోట్లు గడించాడు. అతడు గొప్ప దాత. అతని కొడుకు రాము అందుకు విరుద్ధం. రాము తన తరగతిలో తోటి విద్యార్థులు ఏది అడిగినా ఇచ్చేవాడు కాదు. రాము ఒకసారి ఇంట్లో ఉన్న సమయంలో చుక్కయ్య అనే వ్యక్తి వచ్చి వెంకటయ్యను ”అయ్యా! చాలా ఆపదలో ఉన్నాను. మీకు తోచిన ఆర్థిక సాయం చేయండి” అని అడిగాడు. వెంటనే వెంకటయ్య లోపలికి వెళ్లి కొంత డబ్బు తెచ్చి ఆ చుక్కయ్యకు ఇచ్చాడు. అది తీసుకున్న చుక్కయ్య సంతోషంతో అతనిని దీవించి వెళ్ళిపోయాడు. ఇది రాము గమనించాడు.
ఆ తర్వాత కొద్దిరోజులకు రాము ఇంటికి కొండయ్య అనే వ్యక్తి వచ్చి ”అయ్యా! నదికి వరదలు వచ్చి మా ఇంటితో సహా అన్నీ కోల్పోయాం. మీరు ఏమైనా సాయం చేయండి” అని అడిగాడు. అప్పుడు కూడా వెంకటయ్య లోపలికి వెళ్లి కొంత డబ్బు తెచ్చి ఇచ్చి అతనికి సాయం చేశాడు. అతడు కూడా వెంకటయ్యను దీవించి వెళ్ళిపోయాడు. ఆ చుక్కయ్య, కొండయ్య ఇద్దరూ వెంకటయ్యకు తెలిసినవారే! ఇదంతా రాము రహస్యంగా చూశాడు. ఒకసారి తరగతిలో వేణు అనే రామును పెన్ను ఇమ్మని, రాసుకొని వెంటనే ఇచ్చేస్తానని అడిగాడు. రాము ససేమిరా ఇవ్వనని చెప్పాడు. ఈ సంగతి ఎవరో వెళ్లి వెంకటయ్యకు చెప్పారు. వెంకటయ్య చాలా బాధ పడ్డాడు. గారాబం వల్ల కొడుకును ఏమీ అనలేదు. ఒకసారి పాఠశాల వార్షికోత్సవానికి ఆ స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు వెంకటయ్యను ప్రత్యేకంగా ఆహ్వానించారు. గతంలో వెంకటయ్య ఆ పాఠశాలకు చాలా సాయం చేశాడు. పాఠశాలకు వచ్చిన వెంకటయ్య చూసి, రాము అతని కొడుకే అని తెలిసి రామును పిల్లలందరూ అభినందనలతో ముంచెత్తారు. ”మీ నాన్న ఇంత గొప్ప వాడా! ఇంత గొప్ప దాతనా! మాకు తెలియనే తెలియదు. ఒక్కసారి కూడా నీవు ఆయన గురించి మాకు చెప్పనే లేదు” అని అన్నారు. అప్పుడు రాముకు చాలా గర్వంగా అనిపించి ”మరేంటి అనుకున్నారు!” అన్నాడు బడాయిగా. ఇంతలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య దాతత్వం గురించి చెప్పి ఆయనకు ఘన సన్మానం చేశారు. అక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరూ కరతాళ ధ్వనులు చేశారు.
ఒకసారి రాము తల్లిదండ్రులు అతన్ని పాఠశాల ముగిసిన తర్వాత రమ్మని చెప్పి బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ గ్రామం నది ఆవలి ఒడ్డున ఉంది. రాము ఒంటరిగా నది దాటటానికి పడవ ఎక్కాడు. ఆ పడవ నడిపే వ్యక్తి టిక్కెట్‌కు డబ్బులు కట్టమన్నాడు. రాము జేబులు తడుముకొని ”అయ్యో! నేను డబ్బును పోగొట్టుకున్నానండీ! నన్ను క్షమించండి. నేను తర్వాత ఇస్తాను” అన్నాడు. ఆ పడవ నడిపే వ్యక్తి ”నాకదంతా అనవసరం. నువ్వు డబ్బులు వెంటనే కట్టు. లేకపోతే నిన్ను పడవ దించేస్తాను” అని చెప్పాడు. ”అయ్యా! మా బంధువుల ఇంటికి వెళ్లాలంటే ఇదొక్కటే పడవ. మా ఇంట్లో ఎవ్వరూ లేరు. చీకటి పడేలాగ ఉంది. నాకు భయంగా ఉంది” అన్నాడు రాము. తన డబ్బులు తెచ్చుకోని తన అజాగ్రత్తకు కన్నీళ్లు వచ్చాయి. అదే పడవలో ఈ సంఘటన చూసిన సోమయ్య అనే వ్యక్తి లేచి ఆ పడవ నడిపే వ్యక్తితో ”ఏంటయ్యా! ఆ అబ్బాయిని దబాయిస్తున్నావు. వాళ్ల నాన్న సాయంతో ఈ ఊళ్లో చాలామంది, ముఖ్యంగా మనమంతా పైకి వచ్చిన వాళ్లం. ఆ అబ్బాయి ఎవరనుకుంటున్నావు? మన వెంకటేశం కొడుకు. నీవు కూడా ఆయన వద్ద సాయం పొందిన వాడివే! అది మరిచావా! ఆ టికెట్‌ డబ్బు నేను ఇస్తానులే!” అని అన్నాడు.
అప్పుడు పడవ నడిపే వ్యక్తి ”అయ్యా! నన్ను మన్నించండి. నాకు ఈ బాబు వెంకటేశం కొడుకని తెలియదు. బాబూ! నీవు నాకు డబ్బు ఇవ్వనవసరం లేదులే! మీ నాన్న నన్ను కూడా ఆపదలో ఆదుకొని సాయం చేశాడు. ఆయన మాకు దేవుడు” అని అన్నాడు. ఈ మాటలు వినగానే రాముకు ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మా నాన్న ఇంత గొప్పవాడా! ఆయన అందరికీ సాయం చేయడం వల్లనే ఆయనకు ఇంత పేరు వచ్చింది. మా నాన్న లాగా నేను కూడా ఇతరులకు సాయపడి మంచి పేరు సంపాదించుకోవాలి. రేపటి నుండి నేను కూడా ఆపదలో వున్నవారికి సాయం చేస్తాను, పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు ఇచ్చి నా వంతు సాయం చేస్తాను” అని అనుకున్నాడు. మరునాడు తాను అనుకున్నట్టే తరగతిలోని పేద విద్యార్థులకు తన దగ్గర స్పేర్‌గా వున్న నోటు పుస్తకాలను, పెన్నులను వారికి ఇచ్చి సాయం చేశాడు. కొడుకులో వచ్చిన మంచి మార్పును మాస్టారు ద్వారా విని తండ్రి వెంకటేశం ఎంతగానో సంతోషించాడు.

– సంగనభట్ల చిన్న రామకిష్టయ్య,
9908554535

Spread the love