రాకెట్‌ – ఉంగరం

Childhoodనగల వర్తకుడు నరేంద్ర గుప్తా కొడుకు చలం అమాయకుడు. చలం ఆ పట్టణంలోనున్న పెద్ద టపాకాయల అంగడి లోనికి ప్రవేశించాడు. చలం అమాయకత్వం గురించి తెలుసుకొన్న టపాకాయల వ్యాపారి టక్కరయ్య ”మీకు ఎటువంటి టపాకాయలు కావాలి” అని అడిగాడు
”ఖరీదు ఎంతైనా పరవాలేదు. కొత్తదనంతో వున్న టపాకాయ ఏదైనా ఉంటే ఇవ్వు టక్కరయ్యా” అన్నాడు చలం
”ఎక్కువ ఖరీదైన దీపావళి రాకెట్‌ తెప్పించాను. దాని పేరు చంద్రు రాకెట్‌. వెలిగిస్తే చంద్ర మండలంకు వెళ్తున్న అనుభూతి కలిగిస్తుంది. ఆకాశం పైకి వెళ్లేంతవరకు నక్షాత్రాలను విరజిమ్ముతూ వెళ్తుంది”
”చంద్రమండలం వరకు వెళ్తుందని ఎలా చెబుతున్నావు?”
”అంతా ఒక నమ్మకమే. ఆ తరువాత చంద్రమండలం వరకు వెళ్తుంది అని మనం అనుకోవాలి. ధర చాలా ఎక్కువగా ఉండటం వలన ఒక్కటే తెప్పించెను” అంటూ ధర చెప్పాడు.
”అదేంమిటి ఆ డబ్బుతో ఒక బంగారు ఉంగరం కొనవచ్చు. సరే ఇవ్వండి” అన్నాడు చలం.
ఐదువందల రూపాయల విలువగల ఈ దీపావళి రాకెట్‌ ను మోసం చేసి కొన్ని వేల రూపాయలకు అమ్మాననుకొని అని లోలోపల సంతోష పడ్డాడు టక్కరయ్య.
ఖరీదైన రాకెట్‌ తండ్రికి చూపించాడు. దానిని పరిశీలించిన తరువాత అది మామూలు రాకెట్‌ అన్న నిజం తెలుసుకొన్నాడు నరేంద్ర గుప్తా. టక్కరయ్య మోసం చేసాడని గుర్తించాడు. బంగారాన్ని ఎలుకలు తిన్నాయంటూ మోసం చేసిన వ్యాపారస్థుడి నీతి కథ గుర్తొచ్చింది. టక్కరయ్యను అలాగే మోసం చెయ్యాలనుకున్నాడు.
ఒక రోజు టక్కరయ్యకు ఫోన్‌ చేసి ”టక్కరయ్యా ఈ రోజు మీ అబ్బాయి మా అంగడికి వచ్చి ఉంగరం కొన్నాడు. అది హిమాలయ పర్వతాల నుంచి వచ్చిన అద్భుతమైన ఉంగరం. ఆ ఉంగరం వేసుకొంటే మీ కోరికలు నెరవేరుతాయని చెప్పాను. అట్లయితే నేను అదృశ్యం కావాలి అంటూ ఉంగరం పెట్టుకున్నాడు. అంతే మనిషి కనిపించకుండా ఒక్కసారిగా అదశ్యమయ్యాడు. నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వొచ్చావంటే మనం పోలీసులకు ఫిర్యాదు చేద్దాం” అన్నాడు.
నరేంద్ర అలా ఎందుకు చెప్తున్నాడో టక్కరయ్యకు అర్ధమయ్యింది. తను చేసిన మోసాన్ని గుర్తించాడని తెలిసింది టక్కరయ్యకు.
”తప్పయిపోయిందని క్షమించండి” అని నరేంద్రని వేడుకున్నాడు టక్కరయ్య. రాకెట్టుకు ఎక్కువ రేటు చెప్పి తీసుకొన్న మీ డబ్బుల్ని తిరిగి ఇస్తాను అని చెప్పి, వెంటనే డబ్బులు తీసుకెళ్లి నరేంద్రకు ఇచ్చేశాడు.
”నీకు బుద్ది చెప్పాలనే అలా చెప్పాను. మీ అబ్బాయి మా అంగడికి అసలు రానేలేదు, అక్కడ మైదానంలో ఆడుకుంటుంటే చూసి మీకు ఫోను చేసాను” అన్నాడు.
– ఓట్ర ప్రకాష్‌రావు, 9787446026

Spread the love