సీదా సవాల్‌

సీదా సవాల్‌నాదర్‌గుల్‌ అడవికి దగ్గరల ఉన్న ఊల్లె ఒక ఆవు ఉండేటిది. దానికి ఒక బుజ్జిదూడ సుత ఉంది. ఓపారి బుజ్జిదూడకు కడుపునిండా పాలిచ్చి బువ్వ కోసం మందల కలసి ఊరి కొసకు వోయింది. పొద్దుమీకినంక ఆవులమంద నుండి తప్పిపోయి అడవికి చేరింది. తొవ్వ తప్పిన ఆవు బుగులు వడ్డది. తన బుజ్జిదూడ యాదికచ్చి గుడ్ల నీరు తీసింది. ‘అంబా’ అని గెట్టిగ ఒర్రింది.
ఆవు అరుపుకు అడవిలోని కుందేలు, లేడి, కోతి భయపడ్డాయి. అవి మొదటిపారి గిసుంటి అరుపు విన్నయి. తెల్లగ, ఎత్తుగ, లావుగ కొమ్ములతో బలంగా ఉన్న ఆవును మొదటిపారి జూసినయి. అవి దైర్నం నటిస్తా ”ఎవలు నువ్వు?!” అన్నయి. ఆవు భయవడ్డది.
”దోస్తులారా! నన్ను ఆవు అంటరు. మాది అడవి పక్కలనే ఉన్న ఊరు. బువ్వకోసం వచ్చి తొవ్వ తప్పి ఇటచ్చి మీకు దొరికిన” అన్నది ఆవు.
దాని నెమ్మలం చూసి కుందేలు, లేడి, కోతిలకు దైర్నైం అచ్చింది. ”నిన్ను చూస్తుంటే గట్ల అగుపడ్తలే. మమ్మల్ని సంపనీకి వచ్చిన శత్రువు తీర్న అగుపడుతున్నవు. నీ గురించి పులిరాజుకు చెప్పి తన్నిపిస్తం” అన్నది కుందేలు.
ఆవు గుండె గుభేల్మంది. అవి మూడు ఆవును సుట్టుముట్టినయి.
”దోస్తులారా! నా మాట నమ్మండి. నేను శత్రువుని కాదు. ఇంటికాడ నాకోసం బుజ్జిదూడ ఎదురుచూస్తుంటది. నా బిడ్డకు ఆకలైతది. నేను వోయి పాలు తాపాల. నన్ను ఇదిసివెట్టుండ్రి” దండం పెట్టింది ఆవు. అవి మూడు ఒకరి ముఖం ఒకటి చూసుకున్నయి. శానా పెద్దగ ఉన్న ఆవు సాధువుల ముచ్చట వెడుతుంటే బీరివోయినయి.
”అగ్గొ! నీకు బుజ్జి దూడ సుత ఉందా…! ఇంకా మీ ఇంట్ల ఎవలెవరు ఉంటరు?” అడిగింది లేడి.
”అన్నా! యజమాని ఖాందానుతోటి నా సోపతిగాళ్లు గుర్రం, గాడిద, గొర్రె, కుక్క, బాతు, కోడి… ఉంటయి. అవి సుత నా రాకకై ఎదురు చూస్తుంటయి. నన్ను వదిలిపెట్టండి” కన్నీటితో చూస్త అడిగింది ఆవు.
దాని మాటలు కోతి గుండెను కాస్త కదిలించినయి. అది ఆవు కండ్లలోకి చూస్త ”చూద్దాం! ముందుగార గీ సీదా సవాల్‌ కు జవాబు చెప్పు!” అన్నది కోతి.
”అన్నా! గా ముచ్చటేందో ఆడుగు!” అన్నది ఆవు.
”అగో! నీ యజమాని జాలి లేకుంట బుజ్జిదూడతో ఉన్న నిన్ను బైటకు తోలిండు. నీ సోపతిగాళ్లు సుత మంచోల్లు గాదు.. అవునా!” అడిగింది కోతి.
ఆ మాటకు గుబులువడి ”లేదన్నా! లేదు లేదు! నా యజమాని నన్ను పాయిరంగ చూస్తడు. నేనే గాయనికి తెల్వకుంట మందతోటి బైటకు అచ్చిన. ఇక నా దోస్తులు శానా మంచోల్లు. అవి నన్ను బైటకు పోవద్దని చెపుతున్నా వినకుంట పోయి తొవ్వ తప్పి మీకు దొరికిన” అన్నది ఆవు.
”అంతా నాటకం!” అన్నయి కుందేలు, లేడి. కోతి వాటికి అడ్డు చెబుతూ ఆవు కాడికివోయి నుదిటి మీద చేతులతో రాస్త ”వారీ ! నీవు శానా మంచి దానవు. నిన్ను అపార్ధం చేసుకున్నం. ఈ తూర్పు దిక్కుగావోతే నీ ఊరస్తది. నీ బుజ్జిదూడ ఆకలితో నీ కోసంచూస్తుంటుంది. జల్దీ ఇంటికి నడు” అన్నది.
కుందేలు, లేడి బీరిబోయినయి.
”ఓరి, వారీ! ఈ ఆవు చెప్పింది నిజం!. ఇది మన శత్రువు కాదు. పొరపాటున తొవ్వ తప్పి అడవికి చేరింది. దీనితోని మనకు ఎటువంటి ప్రమాదం లేదు. ఎందుకంటే, ఎవలైతే వేరేటోల్లలో మంచిని నలుగురికి చెపుతరో వాళ్లు మంచోలై ఉంటరు. ఈ ఆవు శానా మంచిది. నేను వాల్లోల్లని శెడ్డోల్లన్నా లేతంటూ వాల్ల మంచితనం గురించి మనకు చెప్పింది. ఈ అవు గురించి పులిరాజుకు చెప్పద్దు. ఇడిసేద్దం!” అన్నది కోతి.
ఆవును తూర్పుదిక్కు ఊరికాడ వదిలి తిరిగి అడవిలకు వోయినయి అయన్ని.
-పైడిమర్రి రామకృష్ణ

Spread the love