కుండ పల్గింది గని కుక్క గుణం తెల్సింది

కుండ పల్గింది గని కుక్క గుణం తెల్సింది‘సోనా ఘస్కే దేకునా – సోపతి కర్కే దేకునా’ అనే హిందీ సామెత వున్నది. అంటే బంగాను రాకి చూస్తేనే నిజమైనదా కాదా అని తెలుస్తది. అట్లనే సోపతి అంటే స్నేహం చేస్తేనే స్నేహితుని సంగతి తెలుస్తది అని అర్ధం. ఇంక ఉత్త స్నేహం కాదు వానికి కొన్ని డబ్బులు బదులు ఇచ్చి చూస్తే పూర్తిగ తెలుస్తది. పైసలు తిరిగి అడుగుతె గరం అయితరు. గిప్పుడు ఎక్కడియి అని. ఇట్లాంటి నేపధ్యంలోనే ‘కుండ పల్గిలే పలిగింది గని కుక్క గుణం తెల్సిపోయింది’ అంటరు. మన కుక్కనే గని వంటింట్లోకి పోతదా అనుకుంటే కుండల వున్న అన్నం తిని పల్గొట్టి పోవుడు అన్నట్టు. ఇక్కడ కుక్కతో, కుండతో పోలిక గని అసలు విషయం స్నేహితమే లేదా బంధుత్వం కూడా కావచ్చు. మల్లా కుండ పల్గొట్టిన కుక్కను ఇంట్లోకి రానివ్వకుండ జాగ్రత్త పడటం అవసరం. కుండలు అంటే యాదికొస్తది ‘అరిటాకు మీద ముల్లు పడ్డా ఆకుకే నష్టం, ముల్లు మీద అరిటాకు రాలి పడ్డా ఆకుకే నష్టం’ లాగనే మరొక సామెత ‘బింద కుండకు తలిగినా కుండకే నష్టం, కుండ పోయి కుందెకు తాకినా కుండకే నష్టం’ అంటే కుండ జాగ్రత్తగ ఉండాలనే అర్ధంలో వాడుతరు. కొందరు పిసినారి వాల్లు వుంటరు. వాల్ల కతలు గమ్మత్తి వుంటయి. వాల్ల పిల్లలు మంచిగ దొడ్డుగ వుండాలె గని వాల్లకు కడుపునిండ అన్నం పెట్టనితనం వెనుకటి కాలంల వుండేది. అసొంటి వాల్లను ‘కుండల కూడు కుండలనే వుండాలె గూటాలోలె బిడ్డలు వుండాలె’ అన్న తీరు వుండది అంటాంటారు. ఇసొంటోల్లె మల్ల ఎట్లంటరు అంటే ‘కూట్లె రాయి తియ్యనోడు ఏట్లె రాయి తీస్తడా’ అంటరు. అంటే తినే కంచంల ఉన్న అన్నంలో వచ్చే చిన్న రాయిని తియ్యలేనివాడు ఏరులోని రాయి దాకా పోతడా అని అంటరు. పనిచేతకాదు పాట చేతకాదు కాని తినుట్లనే బరాబరి వుంటరు. వాల్లు ఎప్పుడు చూసినా తినడమే పనిల వుంటరు. వాల్లను ‘కుండలదే పాణం – మిండలదే పాణం’ అంటరు. కుండలదే పాణం అంటే తెల్సుగని మిండడు అంటే వివాహేరుడు అన్నట్టు. ఊరి సామెతల్లో నవరసాలు ఒలుకతాయి. అన్నింటినీ ఆయా కాలాల, నియమాల ప్రకారం వున్నాయనుకోవాలి.
– అన్నవరం దేవేందర్‌, 9440763479

Spread the love