వేదిక నవ్వింది

వేదిక నవ్విందికళ్యాణమంటపం కిటకిటలాడిపోతోంది జనాలతో. వాళ్లంతా పెళ్ళికి వచ్చినవారు అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. వాళ్లంతా కవులండి. అవును. పట్టుచీరల్లో పడతులు, పొడుగాటి పైజమాల్లో పురుషులు కళ కళ లాడిపోతున్నారు. తెలియని వారు వాళ్ళని చూస్తే పెళ్లికి వచ్చారని అనుకుంటారు. అందరూ అంత అందంగా తయారై వచ్చారు.
వేదిక మీద కవిత చదవడానికి ఈ హడావిడి. ఎక్కడెక్కడ నుంచో పడుతూ లేస్తూ రకరకాల ప్రయాసలను ఎదుర్కొంటూ ఇక్కడికి పక్షుల్లా వాలిపోయారు. తిండి తిప్పలను పట్టించుకోక కుటుంబాలను వాళ్ళ మానాన్న వాళ్ళను వదిలేసి కవిత్వమే మా ప్రాణం అని మనసులో స్మరించుకుంటూ వేదిక చెంత చేరారు.
****
శతాధికా కవి సమ్మేళనం కాబట్టి ఎనిమిది గంటలకే సభ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ముందుగానే తెలియజేశారు. ఇప్పుడు 8:30 అయింది. ఇంకా అక్కడ ఏమీ ఏర్పాట్లు జరిగినట్లు కనిపించడం లేదు. ఒకరిద్దరు అటూఇటూ తిరుగుతున్నారు బ్యానర్‌ పుచ్చుకుని.
టిఫిన్లు, భోజనాలు ఉంటాయని అన్నారు కానీ ఆ ఆచూకీ ఎక్కడా ఆమడ దూరంలో కూడా కనిపించలేదు. వచ్చిన వారు వచ్చినట్లే దగ్గర్లో ఉన్న రోడ్డు మీద అంగట్లో ఇడ్లీలు, దోసెలు తిని ఓ టీ చుక్క నోట్లో వేసుకొని హమ్మయ్య అనుకున్నారు. వేడివేడి టీ తాగితే శరీరమంతా విద్యుత్‌ ప్రవహించినంత ఆనందంగా ఉంటుందని సదరు టీ ప్రేమికుల భావన. కాస్త ఖర్చు ఎక్కువ పెట్టగలిగిన వారు మంచి హోటల్‌ చూసుకుని వెళ్లి తిని వచ్చారు.
వేలు ఖర్చు పెట్టుకుని ముందు రోజే వచ్చిన కవులూ అందులో ఉన్నారు. ఇది వరకు వసతి ఏర్పాట్లు నిర్వాహకులే చూసుకునేవారు. ఇప్పుడు అది ఎత్తేశారు. ఎవరి తిప్పలు వారివే. వడ్డించే వాళ్ళు ఉంటే తినే వాళ్ళు కొదువా? అలాగే కవి సమ్మేళనం అనే పేరు వినగానే నాగస్వరానికి నాట్యమాడే నాగుల్లా జరజరా సరసరా వచ్చేస్తారు. మేము వస్తాం, మేము వస్తాం అంటూ ఉరుకుతుంటే ఇలాంటి మర్యాదలు ఎందుకు ఉంటాయి చెప్పండి? అందుకే తెలివిగా దీన్ని అదేనండి వసతి. దాన్ని మీకు మీరే చూసుకోవాలని చేతులు దులుపేసుకుని ఓ పెద్ద భారాన్ని వదిలించుకున్నారు సదరు నిర్వాహక సంఘం. పేరు ఏదైనా!
అలా టిఫినీలు చేసి వచ్చారో లేదో ఈ లోపు వేదిక మీద బ్యానర్‌ వేలాడి కనిపించింది. హమ్మయ్య అనుకున్నారు కవులు.
ముఖ్య అతిథులు వచ్చే లోపు సమయాభావన నిమిత్తం వచ్చినవారు వచ్చినట్లు వేదికనెక్కి కవితలు చదివేయమన్నారు.
కొందరు ఉన్న పదిమందికి కుర్చీలు వేసి వారిలో ఒకరిని సమన్వయకర్తగా నియమిస్తారు. ఆయన వీరి కవితలను సమీక్షిస్తారు.
ఇకపోతే వేదిక ఎలా ఉందో చూస్తారు కానీ ముందు జనం ఉన్నారా లేదా అని చూడని రోజులు ఇవి. విశేషమేమంటే ఉన్న వారంతా వేదిక మీదే ఉండి ఒక్క ప్రేక్షకుడు కూడా లేకుండా ఎన్నో సభలు జరగటం వింతగా కనిపిస్తున్నా కవులు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే కవిత చదివినట్లు ఫొటో, సన్మానం చేసినట్లు మరో ఫొటో ఉంటే చాలు. మర్నాడు పేపర్లలో వేలాదిమంది అభిమానులతో జరిగిన సత్కారం అని వేయించేసుకునే సదుపాయం ఉంది.
ఇలా వాళ్లు కక్కుర్తి పడటం వల్లనే గౌరవంగా కవులని ఎన్నుకొని పిలవాలన్న వాడుక మరిచి వాట్సాప్‌లో గ్రూప్‌ పెట్టి ఇష్టమైన వారు చేరండి అనే దుస్థితికి చేరిపోయింది ఈ తతంగం.
వచ్చిన వారిలో పెద్దవారిని ముఖ్యఅతిథిగా వేదిక మీదకు ఆహ్వానిస్తారు. ఎలాగో నిర్వహించేవారు ఉండనే ఉంటారు. వాళ్ల ప్రసంగాలు ముగించేటప్పటికి పన్నెండు గంటలు అవుతుంది.
కవిత చదివి వెళ్ళమంటే కవులు వెళ్లరు. ముందు ఒక ఉపన్యాసం, కవిత చదివాక మరో ఉపన్యాసం చెబుతారు. ఇంకోటి కూడా చదువుతామనే ప్రబుద్దులూ ఉంటారు. కవికున్న జాడ్యం ఇది. ఓ ఇరవై మంది కూడా చదవరు ఆ సమయానికి. మరో పాతికమంది అయ్యేటప్పటికి భోజనాలు కార్యక్రమం మొదలవుతుంది.
ఈ రోజుల్లో పక్క వాడి కవిత వినే ఓపిక ఎవరికీ ఉండదు. వారిది అవగానే బయటకు పరిగెడతారు. జనాలు ఉండాలనే నిర్వాహకులు తెలివిగా చివర్లోనే సన్మానాలు, సత్కారాలు అని ముందే చెప్పేస్తారు. కాబట్టి ముందే కవిత చదివేసినా ఉండక తప్పదు. మరి సన్మానం ఫొటో ఉండాలిగా.
ఆ సమయంలో ఓ చెక్క ముక్క కోసం అంత డబ్బు తగలెయ్యాలా అన్న కుటుంబ సభ్యుల వెటకారాలు గుర్తు వస్తాయి. కవులు దాన్ని చెక్క ముక్కగా చూడరు మరి. అది వారికి ఆత్మాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని పెంచే గొప్పతనంగా భావిస్తారు కాబట్టి.
అలాగే శాలువాని మిగిలిన వాళ్ళంతా ఓ గుడ్డముక్కగానే చూస్తారు కానీ కవులు మాత్రం అది కండువా అయినా తువ్వాలైనా సరే మహాభాగ్యంగా భావిస్తారు. అందరినీ అలా సత్కరించరుగా. కవిత్వం రాసే వాళ్లకు మాత్రమే ఆ సత్కారం కదా!
అందులో ఎంతమందికి సరిగ్గా కవిత రాయటం వచ్చు అన్న ప్రశ్నను మాత్రం నన్ను అడక్కండి. ఫేస్‌బుక్‌ వచ్చాక ప్రతివాడు కవే. పది వాక్యాలు పేర్చితే అతను రచయితే.
బాగా డబ్బున్న వాళ్ళు వీళ్ళకి భోజనాలు ఉచితంగా పెట్టి సన్మానం పొందుతారు. మరి లేకపోతే వేదిక మీద వాళ్ళని పిలిచి ఎవరు సన్మానం చేస్తారు?
మరో డబ్బున్న ఆయన శాలువలు ఇస్తారు. వంద రూపాయలు, నూట పాతిక రూపాయలకు మించి ఉండవు అవి. షోగా తప్ప ఉపయోగపడవు. మరి అతనిదీ సన్మానం పిచ్చే! ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటే ఇదేనేమో!
ఇక మధ్యాహ్నం మూడు గంటలు అయితే చాలు హడావిడి ప్రారంభం. ఎవరికి వాళ్లు వెళ్లిపోవాలని. మరి రిజర్వేషన్‌ చేసుకొని ఉంటారుగా.
కొందరికి అయితే చదివే సమయం లేక అక్కడ వాళ్ళు ఇచ్చే కండువా తనకు తానే మీద వేసుకొని అదేనండి మెడ చుట్టూ కప్పుకొని మరోచోట ఇచ్చిన సర్టిఫికెట్‌ అందుకని ఒకరు స్టేజి దిగి మరొకరు ఎక్కే వ్యవధిలో ఓ ఫొటో తీసుకొని వెళ్ళిపోతారు కవిత చదవకుండానే!
ఇంకా అభిమానం కొద్దో గొప్పో ఉన్నవాళ్ళు ఇది తెలిసిందే కదా అయినా మళ్ళీమళ్ళీ ఈ అనుభవాన్నే రుచి చూస్తామని తెలిసినా రావటం మన వెర్రితనమని తమను తామే తిట్టుకుంటూ నిరాశను మూట కట్టుకొని తిరుగు ప్రయాణానికి బయలుదేరుతారు కవిత చదవకుండానే.
వచ్చిన వాళ్లకు వారు ఇచ్చే మర్యాద ఇది. సమయాభావం అని అంటారు మళ్లీ.
కొందరు తమంతటి గొప్పవాళ్ళని విస్మరించారని కుమిలిపోతారు. నిర్వాహకులు మాత్రం ఏమాత్రం ఆ విషయం పట్టించుకోరు. ఎందుకంటే పక్షపాతం లేకుండా స్వచ్ఛందంగా మా గ్రూపులో చేరిన వాళ్ళందర్నీ మేం పిలిచాము అంటూ.
ఆహ్వాన పత్రిక ఖర్చు లేదు అంతా ఆన్‌లైన్‌లోనే.. క్షణాల్లోనే!
కవులు లేనిదే సభ లేదు. మీకోసమే ఈ సభ అని చివరకు కవులకు ఇచ్చే గౌరవం ఇది. అది తలుచుకొని బాధపడని కవి లేడు. మధ్య మధ్యలో నిర్వాహకుల ఛీత్కారాలు, తిరస్కారాలు కూడా కవులు పడాలి తమ తప్పు లేకపోయినా.
పెద్దవారు కవిత వినిపించటం లేదని ముందుకు వస్తే ఫొటోలో పడాలని వచ్చారనే భ్రమతో వారి పెద్దరికాన్ని కూడా పక్కకు పెట్టేసి పక్కకు వెళ్ళమని చెప్పే సంస్కారం వాళ్లది. ఒక్కోచోట మైక్‌ కూడా సరిగా ఉండదు మరి.
రాస్తూ పోతే ఇలాంటివి ఎన్నో.. ఎన్నెన్నో!
చివరకు వచ్చిన కవులు ”పిచ్చోళ్ళం.. మనం పిచ్చోళ్ళం.. కవిత్వ పిచ్చోళ్ళం” అని వాళ్లకు వాళ్లే బిరుదులు ఇచ్చుకొని ఇంటివైపు నడక సాగిస్తారు అందరూ దీనికి వ్యసనమని పేరు పెట్టినా.
అంతా మీరే అని పిలిచే నిర్వాహకులు తాము ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత శ్రమ పడుతున్నామని చూసుకున్నా కవిని గౌరవంగా చూసి సంతప్తిగా పంపితే బాగుంటుందన్న నా కల మాత్రం నెరవేరటం లేదు.నెరవేరదు కూడానేమో!
– యలమర్తి అనూరాధ, 9247260206

Spread the love