నాలుగు చేపలు

నాలుగు చేపలు– పుప్పాల కృష్ణమూర్తి
ధాన్యసిరి రాజ్యాన్ని పాలించే సుశాంతుడు ధర్మ పాలకుడే కాదు ప్రజలంటే ప్రేమ ఉన్నవాడు. ఓ రోజు సభలోకి, విదేశీ యాత్రికుడు ఒకడు వచ్చాడు. తన దగ్గరున్న సంచిలో నుంచి పెద్ద గాజు పాత్ర తీసి రాజు ముందు పెట్టాడు. అందులో రంగురంగుల చేపలు నాలుగు ఉన్నాయి. మహారాజా ఇవి అరేబియా సముద్రంలో 200 అడుగుల లోపల నివసించే లాక్టస్ల చేపలు. ఇంట్లో పెట్టుకుంటే, అందంగా ఉండటమే కాకుండా, శుభం జరుగుతుంది. వీటిని సంపాదించడానికి నేను చాలా కష్టపడ్డాను. ఎంతో విలువైన చేపలు. అందుకే వీటిని మీకు బహుమానంగా ఇద్దామని వచ్చాను” అని చెప్పి చేతులు జోడించాడు. ఆ నాలుగు చేపలని పరిశీలించాడు. ఒక్కో చేప నాలుగు అంగుళాల పొడవుతో ఉన్నాయి. తోక నల్లగా, శరీరమంతా తెల్లగా, మొప్పలు గోధుమ రంగులో, మూతి ఎర్రగా నాలుగు రంగుల మిశ్రమంతో అందంగా ఉన్నాయి. రాజు సంతోష పడ్డాడు. అలాంటి చేపలను చూడటం రాజుకు అదే మొదటిసారి. తగు పారితోషికం ఇచ్చి, యాత్రికుని పంపించాడు. ఆ గాజు జాడీని, తన వెంట అంత:పురానికి తీసుకెళ్లాడు. ఆడుకుంటున్న తన పదేళ్ళ సునీలుడికి పుట్టినరోజు కానుకగా అందించాడు. బాలుడు ఎగిరి గంతెశాడు. రాణి వసుంధర కూడా సంతోషించింది. దాన్ని పదిలంగా తీసుకుని వెళ్లి తన గదిలో పెట్టుకున్నాడు సునీలుడు. రోజూ చేపలతో కొద్దిసేపు ఆడుకునేవాడు. వాటికి ఆహారం వేసి, అవి తమ బుల్లి బుల్లి నోటితో తింటుంటే, సంబరపడేవాడు. వాటిని తన స్నేహితులకు చూపించి, పొంగిపోయేవాడు. రాకుమారుని గదిలో పనిచేసే సీత, జాడీలోని నీటిని ప్రతిరోజు మారుస్తూ, చేపలను జాగ్రతగా కాపాడుతుండేది.
అలా కొన్ని నెలలు గడిచింది. ఒకనాడు స్నేహితులతో కలిసి తోటలో ఆడుకుని ఇంటికి రాగానే, గాజు జాడి కింద పడి పగిలి ఉంది. చేపలు నాలుగు చచ్చిపోయి ఉన్నాయి. రాకుమారుడు తలుపు తెరిచి చూసి, బోరుమని ఏడుస్తూ, తల్లికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. మహారాణి భగ్గుమని మండిపోయింది. అంతపురంలోని సేవకులందరినీ పిలిపించింది. వరుసగా నిలబెట్టి, విచారణ చేసింది. నేను గది బయట జాగ్రత్తగానే కాపలా కాస్తున్నాను. కానీ కిటికీలోంచి, ఓ పావురం వచ్చింది. దాన్ని తరుముతూ ఒక డేగ వచ్చింది. డేగ గాజుజాడీకి తగలడంతో కిందపడి పగిలిపోయింది. మన్నించండి” అని పాదాలు పట్టుకుంది రాణి. ”గదిలోకి పిల్లులు, పక్షులు రాకుండా చూసుకోవలసిన బాధ్యత నీదే. విలువైన నాలుగు చేపలని చంపావు. నా కుమారుడి మానసిక వేదనకు కారణమయ్యావు. నిన్ను వదిలిపెట్టను” అని చండ్రకోలా తెప్పించి కోపం తీరిందాకా బాధింది. రాజకుమారుడు కర్రతో కొట్టాడు. సీత చర్మం పగిలి పోయింది. సొమ్మసిల్లి పడిపోయింది. ఒళ్లంతా గాయాల మయమైంది. నిన్ను వదిలి పెట్ట. మహారాజు వచ్చాక, కారాగారంలో పడేపిస్తా. ఇక్కడే చావు” అని కోపంతో బుసలు కొట్టింది. మహారాజు సభను చాలించుకుని అంతపురానికి వచ్చాడు. పెద్ద ఘోరం జరిగిపోయినట్లు, రాణి ఫిర్యాదు చేసింది. కొడుకు తండ్రిని కౌగలించుకుని భోరుమని ఏడ్చాడు. దాసీలు జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పారు. సీత గోడ పక్కన పడి, లేవలేని స్థితిలో ఉంది. ఏడ్చి ఏడ్చి ముఖమంతా ఉబ్బిపోయి ఉంది.
2
రాణిని గదిలోకి తీసుకు వెళ్ళాడు. నీవు బాగానే దండించావు. అది సరిపోతుంది. అయినా నాలుగు చేపల కోసం, ఒక మనిషిని అంతగా హింసించాలా..? కావాలంటే మరో నాలుగు చేపలని తెప్పించే వాడిని కదా. తను కిటికీలోంచి పావురం వస్తుందని ఊహించలేదు. అనుకోకుండా జరిగిపోయింది. మన దగ్గర నమ్మకంగా పనిచేసే వాళ్ళ పట్ల అంత క్రూరంగా ఉండటం మంచిది కాదు. దయతో జాలిగా ఉండాలి. బాబు కొడుతుంటే కూడా నువ్వు అడ్డు చెప్పలేదు. ఇంత చిన్నతనంలోనే, వాడిలో క్రూరత్వం పెరగడం మంచిది కాదు. పిల్లల్లో సాటివారి పట్ల ప్రేమ, దయ ఉండాలి” అని మహారాణికి తప్పు తెలిసేలా చెప్పాడు.
”నా చేపలు…” అని ఏడుస్తున్న కొడుకుని దగ్గరకు తీసుకుని ”నేను తెప్పిస్తాగా… ఏడవకు” అని సముదాయించాడు. మంత్రికి కబురు చేసి చేయవలసిన పనిని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం పెద్ద గాజు జాడి నిండా, లెక్క పెట్టలేనన్ని చేపలతో సేవకుని తీసుకొని వచ్చాడు. నల్లని బురదమట్టలు, గోధుమ రంగు ఉసికదంతులు, బూడిద రంగు వాలుగలు, ఎర్రగా ఉన్న బంగారు తీగలు ఇలా రంగురంగుల చేపలు జాడీ సగానికి ఉన్నాయి.
ఆ చేపలను చూసి ఎగిరి గంతులు వేశాడు సునీలుడు. ఈసారి వాటిని కింద పడకుండా చూడాలని సేవకులను ఆజ్ఞాపించాడు. మహారాణి తృప్తి కోసం, సేవకులు పనిచేసే స్థానాలను మార్చాడు. అయినా మహారాణి తృప్తి చెందలేదు. మూతి మూడు వంకర్లు తిప్పి పడకగదిలోకి వెళ్ళిపోయింది. సీతకు నెలదినాల వేతనంతో కూడిన సెలవు నిచ్చాడు. ఎప్పటిలాగే రాకుమారుడు చేపలతో ఆడుకో సాగాడు.

Spread the love