భూమి మాట్లాడిన కాలం

A time when the earth spokeఅరేరు!
నిజమే! నిజమే!
వీర తెలంగాణ నుండి
నువ్వు మరీమరీ
కౌగిలించుకుంటున్న వల్లభారుపటేల్‌
విమోచణ కల్గించాడు
మీ ప్రియాతి ప్రియమైనమీర్‌ ఉస్మానలిఖానుకు
మీ దొరలకు భూస్వాములకు దేశ్‌ముఖ్‌లకు
జమీందార్లకు జాగీర్ధార్లకు నిజాంరజాకార్లకు
కానీ పీడిత తెలంగాణకు కాదు

లక్షలాది ఎకరాల పొలాలై
18తాలూకాల్లో విస్తరించిన నిజాం కు
నా వంచిత తెలంగాణకు
నీ సెప్టెంబర్‌ పదిహేడు
విమోచన దినం కాదు
విద్వేష దినం! విషదినం!! విద్రోహదినం!!!
ఒరేరు! మతోన్మాద దోపిడి ముఠాల్లారా!
1946నుండి1951 చరిత్ర
ఏ ఎరేజర్తో చెడుపుతార్రా?
నీ విషబీజం మొలకెత్తే నేలేనా?
అబద్దానికి నిజం దుస్తులేశావు
అబద్దాల హామీల్లా అబద్దాల గ్యారంటీల్లా
ఒక అప్రకటిత ఎమర్జెన్సికాలం సెంగోల్‌ తెచ్చి వాక్‌ స్వాతంత్య్రం జైల్లో పెట్టావు

నీ కథలే స్వేచ్ఛగా తిరుగుతున్నాయి
దోపిడిసొమ్ముతో ప్రజా చరిత్ర
చెదలుపడ్తుందా?
పాలకుడు ముస్లిం
నిజమే! అతని పటిష్ట పునాది
పిల్లర్లు భీమ్లూ
హిందూ రెడ్లూ రావులే కదా!

అయినా తెల్వకడుగుతా?
ఇక్కడి మెడల ముంత వేలాడిన కాయల చరిత్రెవడ్డి?
ఇక్కడి బతుకుల ముడ్లకు కట్టిన
తాటాకులుగీరిన చిత్రలేఖనా నైపుణ్య చరిత్రెవడ్ది?
చెవుల్లో సీసం పోసిన
చావుకేకల ముఖచిత్రాల ముచ్చటెవడ్ది?
కోసిన నాలుకలోంచి చిందిన రక్తచరిత్రెవడ్ది?

నువ్వెంత ఒయలు బోయినా
రజాకార్ల బలమూ బలగమూ
హిందూ దొరలే కదా!

బండెనుక బండికట్టి
బతుకుమీద నడిపించీ
చెమటచుక్క తునాతునకలు చేసినప్పుడు
బిగిసిన పిడికళ్ళ స్వేచ్ఛ చిగురించింది

ఊళ్ళు స్మశాన వాటికలైనప్పుడు
ఎర్రజెండా ఒక్కటే గుండెలకత్తుకుంది
పజ్జొన్నకంకై తలెత్తిన ఊళ్ళల్లో
కొండల్లో గుట్టల్లో
అడవుల్లో సాయుధరాగం పురుడు పోసుకుంది

బంగారం పండే భూములు
తియ్యనికొబ్బరి నీటివనరులు
కంచెలు తోటలు పెరళ్ళూ
అన్నీ బ్రహ్మదేవుడు
హిందూదొర పేరుమీద రాసి పుట్టించి
చెమటచుక్కను ఖాళీ చేతుల్తో
ఏహక్కులేని బానిసగా పుట్టిస్తే
పుట్టిన పాపానికి దొరదొడ్లో కట్టేసుకున్నట్టు
వెట్టిచాకిరైరి నజరానాలై రి
నాగులవడ్డైరి అక్రమ వసూల్లైరి
లేవీ వసూల్లైరి అక్రమ బేదఖల్లైరి
నియంతత్వ యంత్రంలో పిండిపిండి
ప్రజల నెత్తురు తాగుతున్నప్పుడు

రోలుపన్నూ రోకలిపన్నూ
సమర్తపన్నూ సనుగులపన్నూ
పెండ్లిపన్నూ చావుపన్నూ
అప్పటి హిందూ దోపిడి ముఠా
ఇప్పటి హిందూ రాజ్య కలల పాలకుడి +ూులా సకలం పీల్చినప్పుడు

ఆంధ్ర మహాసభ అంధకారంలో వెలిగింది
తెలుగు భాష అణిచివేత వ్యతిరేకత
తెగింపై తెలంగాణ చొరబడ్డది
గ్రంధాలయోద్యమం గమనం నిర్ధేసించింది

తెలంగాణ కాళ్ళ కింది వడ్లతాలు
భూస్వాములు దొరలు దేశ్‌ ముఖ్లు జాగిర్ధార్లు పటేళ్ళు పట్వార్లు రజాకార్లు
ఏడోనిజాం మీర్‌ ఉస్మానలి కళ్ళల్లో పడ్డది

హింసాప్రణాళికల కమలాంధులారా!
అజీముల్లాఖాన్‌ అందించిన
”భారత్‌ మాతాకీ జై”వదిలేయవు గాని
ఒంటి నిండ ముస్లిం వ్యతిరేకత
తొడుక్కొని తిరుగుతావు
దౌత్యవేత్త అబిద్‌ హుసేన్‌ ”జైహింద్‌ ”ను
గాయపు బర్రలా వదలవు గాని
మనసంతా ముస్లిం వ్యతిరేకత లో ముంచి
నినాదమైతావు

కాషాయ కబోదులారా!
రజాకార్లంటే
భూస్వాములు దొరలు దేశ్‌ ముఖ్ల జాగీర్ధార్ల పటేల్‌ పట్వార్ల రక్షణకోట
ఏడో నిజాం ప్రైవేట్‌ సైన్యం

దోపిడీ ముఠాల గడి రజాకార్ల గెస్టౌజ్‌!
తెలంగాణ బతుకు
నిప్పుల్లో ముంచిన చేతుల్లో
రజాకార్ల రిమోటు
ఇంకేం నిజాంచీకటి అల్లిన మృత్యువు!

దొరలు నిజా మైయ్యిండ్రు
భూస్వాములు నిజామైయ్యిండ్రు
దేశ్‌ ముఖ్లు నిజామైయ్యిండ్రు
జాగీర్ధార్లు నిజామైయ్యిండ్రు
పటేల్‌ పట్వార్లు నిజామైయ్యిండ్రు
ఏడో నిజాం ఎలిగి పోయిండు

దోపిడి ముఠాల చేతి
తల్వార్లైయ్యిండ్రు రజాకార్లు
దోపిడీ ముఠాల చేతి
తుపాకులైయ్యిండ్రు రజాకార్లు
దోపిడిముఠాలు రజాకార్లు
రజాకార్లు దోపిడి ముఠాలు

ఎంతపండించినా
గుడిసె ఆకలితో రోదించింది
ఆహార లోపంతో
తెలంగాణ చిక్కి శల్యమైంది

ఊళ్ళను మెతుకు తిన నీయలేదు
నీళ్ళు తాగ నీయలేదు నిద్ర బోనీయలేదు

దోపిడి ముఠాలు రజాకార్లు
చీకటి అమావాస్యలా కలెగల్సి పోయారు
ఒక కులం లేదు ఒక మతం లేదు
సకల జనులు సబ్బండ కులాలు
ఊళ్ళను
ఉమ్మడి రజాకార్లు గడికి కట్టేసుకున్నారు
వెట్టికి పట్టం గట్టి
ప్రజల రక్తమాంసాలు
మానాలు ప్రాణాలు
ఏదైనా వాళ్ళ కోరికలకోరలు చెప్పినట్టే!
నోరెత్తీతే
నోట్లె మట్టి పడ్డట్టే!!

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో
ఒక్క చెమట చుక్క రాల్చని
ఒక్క నెత్తుటి బొట్టు చిందని
హిందూ మతోన్మాదమా!
నువ్వెక్కడ నిలబడ్డావు
నిజాం వెనుకే కదా!
నీ పోరాటమెక్కడ
పీడిత తెలంగాణ మీదే కదా!

ఏక పక్ష దారిద్య్రరేఖ ఎక్కిరిస్తుంటే
నిజ దారిద్య్రం పామై బుస కొడ్తుంటే
ధరల సూచికల గుండె దడ హెచ్చి
ఎన్ని క్యాలరీల ఎలక్ట్రో బాండ్లు తిన్నా!
పెగాసస్‌ ప్రేమలు ఒలకబోసినా
ఎక్కడో పురి తెగి
మార్కెట్టుమర్కట నీతి ఓటు
కలలో కూడా జారిపోతాంటే
విజయాకలిసూచి అట్టడుగున పడిపోతుంటే
మతాన్ని గంజాయిలా అలవాటు చేసి
ఉన్మాద”ఉడ్తా తెలంగాణ” కలలప్రవాహంలో
నిలబడ్తామనుకుంటున్నావు కాని
రజాకార్ల సైన్యాధ్యక్షుడు
ఖాసిం రజ్వీ అయితే
రజాకార్ల ఉపాధ్యక్షుడు
హిందూ విస్నూర్‌ రాంచంద్రా రెడ్డే కదా!

బజాయించి ఢంకా
బడాయికి పోతారు గానీ
ఇప్పుడు చెప్పు?
హిందూ ముస్లిం పోరాట మెక్కడ మతోన్మాది?
చరిత్ర వక్రీకరణా చెద చక్రవర్తీ!
అబద్దాల అలంకరణల తిరుగుబోతా!!
వాడు హిందువా కాదు
వాడు ముస్లిమా కాదు
తెలంగాణ పేదలంతా
గంగ జమున తెహజీబ్‌ !!!

వట్టికోట ఆళ్వారుస్వామి కధలు చెవికెక్కలేదా!
పెన్నూగన్నూ పట్టిన రంగాచార్య
చిల్లరదేవుల్లో మోదుగూపూలో మాయాజలతారో
రుచించలేదా!

క్రిష్ణమాచారి రుద్రవీణకు మీ చెవులు బ్రద్ధలైయ్యాయా?
కాళోజీ కణకణమండే అక్షరాలకు కళ్ళు మూస్కపోయాయా?
‘వీరతెలంగాణవిప్లవపోరాటం’
చేదుమాత్రైయ్యిందా?
సాయుధ పోరాటదర్పణం ‘మా భూమి’
మీ మనస్సు ముక్కలు చేసిందా!
1946నుండి1951దాక
తెలంగాణ ఎర్రజెండై ఎగరడం
ప్రపంచం కళ్ళల్లో దాచుకుంది
కళల్లో దాచుకుంది

ఆ సినీ స్థూపం చుట్టూరా
ఆ త్రివర్ణ పతాకంతో భలే పోరు చేయించావు
సజనాత్మకత మీకే పుట్టిందా ఏం?

రజాకార్లతో యుద్ధంచేశాయా?
తెలంగాణ ఊళ్ళు నవ్వుతున్నాయి!!!

నీ కట్టుకథలకు
నీ పిట్టకథలకు పుట్టిన రజాకార్‌ చూశాకే
నీ కశ్మీర్‌ ఫైల్స్‌ అర్ధమైంది
నీ కేరళాస్టోరి సుస్పష్టమైంది
మణిపూర్‌ ఫైల్స్‌ కు మరీ కొంత సమయముందా?
ఒరేరు !
బందగీని
ఎవడి బలుపు
కండకండాలుగా నరికి చంపింది
చాకలి అయిలమ్మ పంట భూమి
చాపచుట్టుక పోవాలనుకున్నదెవడు?
దొడ్డి కొమురయ్య పొట్టపేగుల్ని బయటేసిన
తుపాకీ గుండు ఏ గడిది?
కొడుక్కు దగ్గ తల్లి
తండ్రికి దగ్గ కొడుకు
విస్నూరు రాపాక రాంచంద్రా రెడ్డెవరు?
రాపాక జానమ్మెవరు?
జనగాం రైలు పట్టాల్ల
పీడిత తెలంగాణ
దసరా బలి
నరికినట్టు నరికిన బాబూరావు దొరెవడు?
ప్రజలపాణాలు పనాయిగా తింటూ
లక్షన్నర ఎకరాలు కాళ్ళకింద తొక్కి పట్టిన
జెన్నారెడ్డి ప్రతాపరెడ్డెవడు?
పసిబిడ్డకు పాలిస్తానంటే
మూడురోజుల బాలింత రొమ్మును
మోదుగు దొప్పల్లో పిండించి శల్యపరీక్ష చేసిన
పసునూరి రామ్మోహనరావెవడు?
పూస్కూరి రాఘవ రావెవడు?
కటారీ రామచంద్రారావెవడు?
బేతవోలు తడమల్ల సీతారాంచంద్ర రావెవడు?
రామసహాయం దామోదర రెడ్డెవడు ?

తెలంగాణ తల్లుల్ని అక్కల్ని చెల్లెల్లని
గడీలలో
నగబతుకమ్మలాడించిన హిందూ రజాకార్లు కాదా!

ప్రజల చెమటా నెత్తురు తాగి
తెలంగాణ గడ్డను చీల్చి చెండాడిన
గడ్డం నర్సింహ రెడ్డెవడు?
నియంతకు నిలువెత్తు రూపం
నీర్మాల నర్సింహరెడ్డెవడు?
దోపిడి పాలనకు
మూలస్తంభం భూస్వామ్యం!
ఉద్యమం చేతుల్లో మట్టిముద్దై కూల్తుంటే
నిజాం ఉమ్మడిరజాకార్ల గుండెలు జారిపోగానే
ఆపరేషన్‌ పోలో అత్యాధునిక ఆయుధాగారంతో
యాభైవేల సైన్యమై
ఆగమేఘాల మీద
ఉద్యమతెలంగాణ కలల మీద పడ్డది
పాలస్తీనపై గాజాపై
ఇజ్రాయిల్లా
నిజాంప్రియురాలు యూనియన్‌ సైన్యం
సరిహద్దుల్లో నక్కిన నక్కలు
రజాకార్లు
తెలంగాణ శవాలదిబ్బచేస్తూ
రక్త వసంతాలాడు కున్నారు
తెలంగాణ గుండెల్లోని
వేలాది అమాయక నెలవంకల్ని
ప్రజలసాయుధం చేసిన ప్రాణాల్ని
దండ గుచ్చి
ఆనాటి నెతాన్యూహు
నిజాం మెడలో వేశారు
దొడ్డి కొంరయ్య అమరత్వం దారేసిన జైత్రయాత్ర
ఎర్రజెండాకాశం కింద
ప్యూడల్‌ పిడికిలి చీల్చి చీల్చి
భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం
తెలంగాణ నాటుతుపాకై
సకల ఆయుధ సంపత్తి
దోపిడిముఠాకు ఎదురేగింది
ఆ సమాజం ఆ పాలన
ఆ విలువలు పునర్మూల్యాంకనం చేసింది

హిందూ కాదు ముస్లిం కాదు
రైతు నాగలి కుమ్మరి సారె
మంగళి కత్తి చాకలి బండ
మాదిగ గూటం సాలెల మగ్గం
బెస్తోళ్ళ వల
సమస్త కులాలు సమస్తమతాలు
వెట్టి చాకిరికి సమాధి కట్టి
ఉమ్మడి రజాకార్ల ఉచితాలకు ఉరి వేశారు
ఊళ్ళు తిరగ బడ్డాయి
దోపిడిముఠా గడీల
భయాలు బాదలు చావులు చొరబడ్డాయి
నిజాంరాచరికం కాళ్ళు విరగ్గొట్టి
‘దున్నే వానికి భూమై’
తెలంగాణ నక్షత్రాలు వెలిగాయి
గడీల్ని పగలగొట్టి
చీమలు పండించిన పాములు దోచిన
పుట్లధాన్యం ఆకలికి పంచింది
పటేల్‌ పట్వారీల పత్రాలు తగలబడ్డాయి
అప్పు పత్రాలు ఆహుతైయ్యాయి
ఆకాశంలో సగానికి
విడాకుల హక్కు పుట్టింది
గడ్డిపోచ తుపాకి పట్టింది
కట్టెపుల్ల కదనాన కరవాలమై మెరిసింది
నాలుగు వేల ప్రాణాలు ముట్టించి
తెలంగాణ వెలిగించారు వీరులు
నిజాం వికృతరూపాన్ని
అద్ధంలో చూపినందుకు
రజాకార్‌ కత్తి జల్లెడ చేసిన
షోయబుల్లాఖాన్‌ ఎవరు?
నిజాం దోపిడి ముఠా మీద
కవితాయుధం ఎక్కుపెట్టిన
మఖ్ధుంమోహినోద్దిన్‌ ఎవరు?
పది లక్షల ఎకరాలు ఆకలి కడుపుకు పంచింది ఆడమగ సమానం చేసి
కులాన్ని తెలంగాణ సరిహద్దుల్లో
బొంద బెట్టింది
దోపిడి ముఠాకూ నిజాం పెత్తనానికీ
దహనసంస్కారం చేసింది ఎర్రజెండే!

ఎక్కడి రాంజీ గోండూ ?
ఎక్కడి తెలంగాణ సాయుధ
రైతాంగ పోరాటం ?
దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని
కంటి రెప్పవేయకుండ కాపలాకాస్తున్న
బుద్ధిజీవుల కంప్యూటర్ల చొరబడ్డ
భీమా-కోరేగావ్‌ సాక్ష్యాల్లా ఇరికించారు గదరా!
చిలుకపలుకులతో చిలుకలా కొట్టడానికీ
తెలంగాణ జాంపండేం కాదు
కణకణమండే సూర్యగోళం!
ఇవ్వాల్టి జనతన సర్కార్లా గ్రామాల విముక్తం చేసింది
గ్రామ రాజ్యాల విస్తృ‌తం చేసింది
నిజాం పాలన నేలమట్టం చేసింది
తారీఖులు దస్తావేజులు
ఇవి కావోరు చరిత్ర సారమన్నా
శ్రీశ్రీనీ కాదని నాయకుల పేర్లు పలికారు
తేదీలు చెప్పారు
ప్రాంతాల బట్టీపట్టారు
సారానికి కాషాయం పూశారు
జియోనిజం హిందూయిజం
జోడు గుర్రాలు!

కడుపులపేగులు బయటపడి
తెలంగాణకు జై కొడుతాంటే
దోపిడిముఠావెంటబడి తుపాకీ వదలని
కొన్నెత్తుటి ఎర్రజెండ గోపాల్‌ రెడ్డెవరు?
చీకటి రాజ్యంపై
బానిల తిరుగుబాటై ఎగిసిపడ్డ గెరిల్లాలు !
సహించీ సహించీ
సహనంతో సాహసంతో సృజనాత్మకతతో
వద్ధులు యువకులు యువతులు పిల్లలు స్త్రీలు పురుషులు
వొడిసెల రాళ్ళై విరుచుకు పడ్డారు
కారపునీళ్ళై ఎగిసి పడ్డారు
తుపాకి తూటై పొడుచుకు పోయారు
గుత్పల దండయాత్రైయ్యారు

ఊళ్ళను ఖాళీ చేసిన పీడన
భారతయూనియన్‌ సైన్యం కాంగ్రేస్‌ రజాకార్ల నీడన
మళ్ళీ ఊళ్ళకు చేరీంది
మళ్ళీ
గడి నిలబడ్డది !
1948 సెప్టెంబర్‌ 17కు
ముందు
నిజాం పోలీసు రజాకార్లు తోడైతే
తర్వాత భారతయూనియన్‌ మిల్ట్రీ
కాంగ్రేస్‌ రజాకార్లు తోడైయ్యారు

గొర్రెలు తినే వాడు పోయి
బర్రెలు తినే వాడొచ్చినట్టు
ఊళ్ళను తగలబెట్టీ
భోగి మంటల్లా కాగారు

పచ్చి నిజం చెప్పనా?
లొంగిపోయింది
నిజాం మీర్‌ ఉస్మానలి ఖాన్‌ కాదు
రాజ్‌ ప్రముఖ్తో రాజాభరణాలతో
భారత యూనియన్‌ సైన్యం !
ఉమ్మడి రజాకార్ల సెక్యూరిటీ జోన్‌
యూనియన్‌ సైన్యం!
రాజాభరణాల రద్దు చేస్తే
అరిచి గీ పెట్టిన
జనసంఘం ఎవరి తల్లి?
1950జనవరి26వరకు
అధికారం ఎవడి రాజముద్రికలో కూర్చొని
దాగుడుమూతలాడింది
రైతురాజైతే
హైదరాబాదు ఎర్రజెండా
ఎర్రకోటను కౌలించుకోవడం దూరం లేదని
పటేల్‌ వణకడంతో
1948 సెప్టెంబరు17 దాటినా
1951దాకా
తెలంగాణ సరిహద్దు దాటలేదు యూనియన్‌ సైన్యం కాని
బ్యాండుమేళాలే తక్కువ
సకల లాంఛనాలతో ఖాసీంరజ్వీని
సకలజనుల కాంక్షకు భిన్నంగా
సరిహద్దవతల క్షేమంగా చేర్చిందెవరు?

కత్తులు తుపాకుల దొరతనంతో
తెగిపడ్డ కుత్తుకలు
రక్తాక్షరాల రాసిన
అగ్నివికసిత చరిత తెలంగాణ
భారత భావితరాల వ్యవసాయిక విప్లవ వేగుచుక్క!

– వడ్డెబోయిన శ్రీనివాస్‌

Spread the love