బంధం ఆనందంగా ఆరోగ్యంగా

The relationship is happy and healthyప్రేమ బంధం చాలా బలమైనది. దీన్ని మించిన బంధం మరొకటి లేదు. కనులు కలుసుకోవడంతోనే ప్రారంభమవుతుంది ఇది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినా అనూహ్యంగా ఏర్పడే పరిచయంతో పురుడు పోసుకుంటుంది. నిర్వచనాలకు అందని అపురూప భావం ప్రేమ. ఒకరినొకరు అర్థం చేసుకుని ఎన్ని అనర్థాలైనా అధిగమించేందుకు సిద్ధమయ్యేదే ప్రేమ. కష్టాలెన్నెదురైనా కడదాకా కలిసి జీవించాలని ప్రమాణాలు చేయిస్తుంది ఇది.

నిజమైన ప్రేమ ధనిక, పేద అనే తారతమ్యాలకు తావివ్వదు. అందచందాలకు ప్రాధాన్యమివ్వదు. జీవిత రథం సాఫీగా సాగాలంటే బంధాలు బలంగా ఉండాలి. అది నమ్మకమనే పునాదిపై నిర్మితమవుతుంది. అప్పుడే ఆ బంధం పటిష్ట భవనమై చిరకాలం నిలుస్తుంది. స్వార్థాన్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వదు. స్వార్థం ఉన్న చోట ప్రేమ ఉండదు. ప్రేమ ఉన్న చోట స్వార్థం నిలవదు. ఈ రెండు కలిశాయంటే ప్రేమ చచ్చిపోయినట్టే. విడిపోవడం చాలా సులువు. కానీ, కలిసి బతకడం గొప్ప. సమస్యలు రావచ్చు. అభిప్రాయ భేదాలు ఎదురుకావచ్చు. మాట పట్టింపులు ముప్పుతిప్పలు పెట్టవచ్చు. అయినా సరే, కడదాకా కలిసి ఉండే ప్రయత్నమే చేయాలి.
ప్రేమంటే.. పవర్‌ఫుల్‌
నగరంలో బాగా పేరుమోసిన వ్యక్తి కూతుర్ని ప్రేమిస్తాడు ఓ సాధారణ యువకుడు. అతడు పేదవాడని తెలిసి కూడా ఆ అమ్మాయి మనసు ఇస్తుంది. ఆమె ఆస్తిపాస్తులతో సంబంధం లేదు.. ఆమె ప్రేమే తనకు ముఖ్యమని భావిస్తాడు అతడు. ఒకరునొకరు చూసుకోకుండా క్షణం కూడా ఉండలేరు. పార్కులు, రెస్టారెంట్లు, సిన్మాలు, షికార్లు.. ఇలా ఎక్కడ చూసినా వీళ్లే. వీరిద్దరు ప్రేమించుకుంటున్నారనే విషయం పెద్దలకు తెలుస్తుంది. అగ్గి మీద గుగ్గిలమవుతాడు అమ్మాయి తండ్రి. అబ్బాయికి వార్నింగ్‌ ఇస్తాడు. ఇంకోసారి తన కూతురి వైపు కన్నెత్తి చూస్తే కండ్లు పీకేస్తానంటాడు. అమ్మాయిని బయటకు వెళ్లకుండా నిర్బంధిస్తాడు. అయినా అబ్బాయి సాహసం చేస్తాడు. అమ్మాయికి ఆ చెర నుంచి విముక్తి కలిగిస్తాడు. ఆమె కుటుంబ సభ్యుల కండ్లు గప్పి దూరంగా తీసుకెళ్లిపోతాడు. అమ్మాయి కనిపించడం లేదని తెలవడంతోనే ఆమె తండ్రి ఆగ్రహంతో ఊగిపోతాడు. తన అనుచరుల ద్వారా వెతికిస్తాడు. ఎట్టకేలకు వాళ్ల ఆచూకీ దొరుకుతుంది. అమ్మాయి ఎదుటే అబ్బాయిని చితకబాదుతారు. అయినా ఆమెను మరచిపోవడానికి అతడు ససేమెరా అంటాడు. దీంతో మరింత కోపోద్రిక్తులై అతడిని హత్యచేయడానికి సిద్ధమవుతారు. అప్పుడు అమ్మాయి అడ్డొస్తుంది. అతడిని చంపాలనుకుంటే ముందు తనను చంపమని అంటుంది. దీంతో తండ్రి మనసు కరుగుతుంది. ఏమిటీ గొప్పదనం.. ప్రేమ ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటుందా? అనుకుని ఇద్దరిని దగ్గరికి తీసుకుంటాడు. అల్లుడిగా ఆ అబ్బాయిని స్వీకరిస్తాడు.
ఇదంతా సిన్మా స్టోరీలా ఉంది కదూ! అవును.. అలాంటిదే. ఇది సిన్మా స్టోరీ లాంటిదైనా నిజ జీవితంలో కూడా ఇలాంటి కథలు ఉంటాయి. ప్రేమంటే.. అంతేమరి! మహారాజులకోట కంటే గొప్పది ప్రేమ. మహామహుల వేటకైనా చిక్కనిది. మహాశాసనాలనైనా ఎదిరించేది. మరణ ఆసనాలనైనా వేయించేది. ఎలాంటి గుండెనైనా నునువెచ్చని సెగసోకిన వెన్నలాగా కరిగించేది ప్రేమ.
ప్రేమ ఎన్ని రకాలు..?
ఆలోచించి ప్రేమించే వాళ్లుంటారు. ఆకర్షణ వల్ల ప్రేమించేవారూ ఉంటారు. అవసరం కోసం ప్రేమించే వాళ్లు కూడా ఉంటారు. ఆలోచించి ప్రేమించే వారు తమ భవిష్యత్తును, తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని ప్రేమించాలనుకుంటారు. తన కుటుంబ పరిస్థితులను పరిగణనలో తీసుకుంటారు. ముందు చదువు, ఆ తర్వాత జాబ్‌ లేదా మంచి వ్యాపారం. జీవితంలో సెటిల్‌ కావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంటారు. ఈ దారిలో ఎన్ని ‘ఆకర్షణలు’ ఎదురైనా మనసు పారేసుకోరు. వారలా చేస్తున్నారంటే ప్రేమంటే వీరికి పడదని కాదు. తమ లక్ష్యాలు, కర్తవ్యాలను నెరవేర్చుకోవాలనే తపనే అలా చేయిస్తుంది. ఇది మంచిదే. తాను సెటిల్‌ కావాలనుకోవడంలో తప్పులేదు. స్థిరపడ్డాక ప్రేమ గురించి ఆలోచిస్తున్నారంటే దూర దృష్టితో ఆలోచిస్తున్నారనుకోవాలి. అనుకున్నట్టు లక్ష్యాలు సాధించాక ఇలాంటి వాళ్లూ ప్రేమలో పడతారు. అప్పుడు కలిగే ఆత్మసంతృప్తి వెలకట్టనిది.
రెండో అంశం ఆకర్షణ. దీన్ని ప్రేమ అనుకుంటే పొరపాటే. ప్రేమ వేరు, ఆకర్షణ వేరు. ఆకర్షణ ఆయుష్షు చాలా తక్కువ. ఇది కొంతకాలమే ఉంటుంది. ప్రేమ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఆకర్షించి ప్రేమించే వారు ఆ ఆకర్షణ ఉన్నంత వరకే ప్రేమించుకుంటారు. ఆ తర్వాత మరో ‘ఆకర్షణ’ మాయలో పడిపోతారు. వీరిది నిలకడ లేని మనస్తత్వం. ఇక మూడో అంశం.. అవసరం కోసం పుట్టే ప్రేమ. అన్నింటికన్నా ఇది ప్రమాద కరమైనది. ఎప్పుడైతే తమ అవసరం తీరిపోతుందో అప్పుడు ఈ ప్రేమ కూడా ముగిసిపోతుంది. నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు.
ప్రేమ వర్ధిల్లాలంటే..
ప్రేమను పంచటంలో ఉండే ఆనందం వేరు.. ప్రేమను స్వీకరించడంలో ఉండే ఆనందం వేరు. మనం కావాలనుకున్న వారు ఎప్పుడూ మనతోనే ఉంటారు. బంధాన్ని శాశ్వతంగా నిలుపుకోవాలనుకున్న వారు నిస్వార్థంగా వ్యవహరిస్తారు. అహంభావాన్ని దరిదాపుల్లోకి రానివ్వరు. ఒకర్నొకరు ఉత్సాహ పర్చుకుని ముందుకు వెళ్తారు. అప్పుడే ప్రేమ వర్ధిల్లుతుంది.
1. కమ్యూనికేషన్‌
బంధాల బీటలకు తొలి కారణం.. కమ్యూనికేషన్‌ లోపించడం. అలా అని, సన్నిహితులకు మన విషయాలన్నీ చెప్పాలని మాత్రం కాదు. వాళ్లంతట వాళ్లే అర్థం చేసుకుంటారని అనుకోవడమూ మంచిది కాదు. కాకపోతే మనం చెప్పదలచుకున్న విషయంలో స్పష్టత ఉంటే సరిపోతుంది.
2. పరస్పర నమ్మకం
నమ్మకం దానంతట అదే రాదు. నిరంతర ప్రయత్నాలతో నిర్మించుకోవాలి. ఎదుటివారి బాధలను సానుభూతితో అర్థం చేసుకోవాలి. అలా నమ్మకాన్ని నెమ్మదిగా పటిష్ఠం చేసుకోవాలి. అయితే, నమ్మకం ఒక్కసారి దెబ్బతింటే మళ్లీ పునర్నిర్మించుకోవడం కష్టం. ఏ బంధానికైనా నిజాయతీ పునాది.
3. గౌరవం- సమానత్వం
గౌరవం లేని ప్రేమ నిలబడదు. కాబట్టి, ఎదుటి మనిషి ప్రవర్తన మనకు కష్టంగా అనిపించినట్టే, మన ప్రవర్తన కూడా సన్నిహితులకు కష్టంగా తోచవచ్చు. కించిత్‌ కూడా ఆధిపత్య ధోరణి కూడదు. మన విలువలు, నైతికత, ప్రవర్తన ఉన్నతంగా ఉండాలి. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి.
4. మద్దతు- ప్రోత్సాహం
నేను అనుకోవడం కంటే.. ‘మనం’ అనుకున్నప్పుడే బంధాలు ఎక్కువ కాలం మన్నుతాయి. ఒక్కోసారి సన్నిహితులతో ఏకీభవించకపోయినా సరే.. వారి నిర్ణయాలకు అండగా నిలవాలి. పరిస్థితులు తలకిందులైనప్పుడు కూడా సన్నిహితుల వెన్నంటి ఉండాలి.
5. సంక్షోభంలో ధైర్యం
కష్టకాలంలో మనం ఎలా ప్రవర్తిస్తాం అనే దానిపైనా జీవిత భాగస్వామి సహా సన్నిహితులతో మన సంబంధాలు ఆధారపడి ఉంటాయి. మనం ధైర్యంగా ఉంటేనే వాళ్లూ తమ కష్టసుఖాలను మనతో పంచుకుంటారు. దయ, సహానుభూతి ఈ విషయంలో కీలకంగా నిలుస్తాయి.
6. సాన్నిహిత్యం, ఆపేక్ష
మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా మనం అనుకున్న వాళ్ల యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉండాలి. సన్నిహితుల పట్ల నిరంతరం ప్రేమ, అనురాగం చూపించాలి.
7. స్వతంత్రం
మానవ సంబంధాల్లో అత్యంత ముఖ్యమైనది, చాలావరకు మనం పట్టించుకోనిది ఒకటుంది.. మన సన్నిహితులకు కూడా వారిదైన జీవితం ఒకటి ఉంటుంది. కెరీర్‌, కుటుంబాలు, హాబీలు ఇందులో భాగంగా ఉంటాయి. ఈ సంగతి మరిచిపోవద్దు.
అనుమానం పెరిగితే..
సంసారంలో కోపతాపాలు.. అరుచుకోవడం. ఆపై.. అనునయించుకోవడం వంటివి మామూలే. అక్కడితో ఆ వివాదానికి ముగింపు ఉండాలి. అలాకాకుండా ఒకరిపై మరొకరు అనుమానపడటం మొదలైతే ఆ బంధం బలహీనపడే ప్రమాదం ఉంది. భార్యాభర్తల్లో ఒకరిపై మరొకరికి పూర్తి నమ్మకం ఉండాలి. ఇరువురూ దాన్ని వమ్ము చేసుకోకుండా కాపాడుకుంటేనే ఆ బంధం బలంగా ఉంటుంది. అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్పడం లేదా ముందు రోజు చెప్పిన కారణాన్ని మర్చిపోయి మరోలా వివరించడం వంటివన్నీ భాగస్వామికి మీపై నమ్మకాన్ని దూరం చేస్తాయి. అబద్ధం చెప్పకుండా అసలైన కారణాన్ని చెప్పడం మంచిది. లేదంటే ఆ తర్వాత నిజం తెలిసినప్పుడు తనను ఎదుటివారు మోసం చేశారని భావించే ప్రమాదం ఉంది. జీవితభాగస్వామి తనతో అబద్ధాలు చెబుతున్నారనే ఆలోచన వారిని అభద్రతా భావంలోకి నెట్టేస్తుంది. మోసం చేస్తున్నారనే అనుమానం మొదలవుతుంది. అసూయగా మారకుండా.. మొదట్లోనే తమ మధ్య అనుమానానికి చోటివ్వకుండా ఉండటానికి దంపతులిద్దరూ ప్రయత్నించాలి. అనుమానం పెనుభూతంగా మారడమే కాకుండా, క్రమేపీ అది అసూయగా పరిణమిస్తుంది. అందుకే జరిగిన సందర్భాన్ని లేదా విషయాన్ని వివరంగా చెప్పాలి. ఒకవేళ మీకే అనుమానం వస్తే ఎందుకో వివరంగా కూర్చొని మాట్లాడాలి. ఇరువురూ చర్చించుకుంటేనే సమస్య పరిష్కారమవుతుంది. మరోసారి అటువంటి సందర్భం రాకుండా ఉంటుంది.

– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417

Spread the love