– సభ్యులకు సమయం లేకుండా చర్చేంటి
– ప్రిపేర్ కావడానికి కనీసం ఒక్కరోజు సమయం ఇవ్వరా?
– స్పీకర్‌ను ప్రశ్నించిన బీఆర్‌ఎస్, ఎంఐఎం, బీజేపీ సభ్యులు
– మంత్రి బిల్లు చదివి వినిపిస్తారు.. చర్చ రేపు ఉంటుంది : మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సభలో కనీసం సమయం ఇవ్వకుండా భూభారతి బిల్లు పెట్టి, వెంటనే చర్చ అనడం ఏంటని బీఆర్‌ఎస్ సభ్యులు హరీశ్‌రావు, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు, బీజేపీ సభ్యులు పాల్వాయి హరీశ్‌బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసనసభ నిబంధలను చదివి వినిపించారు. అర్ధరాత్రి 12 గంటలకు బీఏసీ ఎజెండా పెడితే సభ్యులు ఎప్పుడు ప్రిపేర్ కావాలి? అని ప్రశ్నించారు. బిల్లు పెట్టిన తర్వాత సభ్యులు ప్రిపేర్ కావడానికి కనీసం ఒక్కరోజైనా సమయం ఇవ్వడం శాసనసభ రూల్స్‌లో ఉందని ఎత్తిచూపారు. భూభారతి పెద్ద అంశం కాబట్టి సమయం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. సభాపతి ఇలా వ్యవహరించడం పెద్ద తప్పిదం అని చెప్పారు. వెంటనే శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఇప్పుడు మంత్రి శ్రీనివాస్‌రెడ్డి భూభారతి బిల్లులోని కీలక అంశాలను మాత్రమే వివరిస్తారని స్పష్టం చేశారు. ఆ బిల్లుపై గురువారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చ ఉంటుందని చెప్పారు. అయినా, బీఏసీ ఎజెండా గురించి హరీశ్‌రావు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. స్పీకర్ అనుమతి తర్వాతనే చర్చ ఉంటుందనీ, ఎందుకు రాద్ధాంతం అని అన్నారు. 2014 నుంచి సభలో ఏం జరిగిందో..బిల్లులు ఎలా పాస్ అయ్యాయో అందరికీ తెలుసన్నారు. రాత్రికి రాత్రే బిల్లులు పాస్ చేయించు కోలేదా? అని ప్రశ్నించారు. ఇటువైపు ఉన్నప్పుడు ఒకలా..అటువైపు ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం తగదని హితవు పలికారు.