కొండెక్కిన నిత్యవసరవస్తువుల ధరలు
అంటకాగుతున్న వంటనూనెలు..చేదెక్కిన చెక్కెర..భారీగా పెరిగిన బియ్యం, ఉప్పు, పప్పుల ధరలు
భయపెడుతున్న ఆహార ద్రవ్యోల్బణం..దిద్దుబాటు చర్యల్లో మోడీ సర్కార్ వైఫల్యం
కేంద్రం వంటగదిలో ధరల మంటను పెంచింది. దాదాపు అన్ని నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా వంట నూనెల ధరలు అంటకాగుతున్నాయి. చక్కెర చేదెక్కింది. బియ్యం, ఉప్పు, పప్పులతో పాటు కూరగాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. మరోవైపు డీజిల్, పెట్రోల్ రేట్లు రోజువారీగా పెరుగుతూనే ఉన్నాయి. వంటగ్యాస్ ధరలు సైతం ఏ నెలకు ఆ నెల పెరుగుతూనే ఉన్నాయి. ఈ ధరల మంటను నియంత్రించడంలో కేంద్రంలోని మోడీ సర్కార్ ఘోరంగా విఫలమౌతున్నది. పెట్రోల్ దిగుమతులు తగ్గించుకుందామని దానిలో 20 శాతం ఇథనాల్ కలిపి ప్రయోగాలు చేసింది. ఆ ఇథనాల్ మొలాసిస్‌తో తయారవుతుంది. ఆ మొలాసిస్ తయారీకి చెరుకు అవసరం. మొలాసిస్ కోసం చెరుకును వాడటంతో చక్కెరకు కొరత ఏర్పడింది. ఇప్పుడు ఆ చక్కెరను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి కస్టమ్ డ్యూటీలను కేంద్రం ఎత్తేసింది. ఇలా ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేస్తూ కేంద్రం సామాన్యుడిపై మితిమీరిన ఆర్థికభారాలు మోపుతున్నదని ఆర్థికరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ : గడచిన రెండేండ్లలో దేశవ్యాప్తంగా వంటగది సరుకుల చిల్లర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వినియోగ వ్యవహా రాల శాఖకు చెందిన ధరల పర్యవేక్షణ విభాగం నమోదు చేసిన చిల్లర ధరల డేటాను సౌత్ ఫస్ట్ అనే సంస్థ విశ్లేషిం చింది. 2024-2026 సంవత్సరాల్లో ఆగస్టు 18న నమోదైన ధరలను పరిగణనలోకి తీసుకుంది. కేరళకు సంబంధించిన కొన్ని గణాంకాలు అందుబాటులో లేవు. 2022 ఆగస్టుతో మొదలైన ఐదేండ్ల కాలంలో బియ్యం, పాలు, చక్కెర ధరలు బాగా పెరిగాయని ఆ సంస్థ తెలిపింది. ఇటీవలి కాలంలో పొద్దుతిరుగుడు నూనె ధర కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు తెలంగాణలో కిలో పొద్దుతిరుగుడు నూనె ధర 2024 ఆగస్టులో రూ.110.50 ఉండగా ఈ ఏడాది ఆగస్టు నెలలో రూ.192.73కి పెరిగింది. కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఈ పెరుగుదల ఉంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో వంటనూనె సగటు ధర కిలోకు రూ.114 నుంచి రూ.192కి పెరగడం గమనార్హం. రెండేండ్ల నాటి ధరలతో పోల్చితే ఇప్పుడు అన్ని వస్తువుల ధరలు దాదాపు 60 శాతానికి పైగా పెరిగాయి. గడచిన మూడు నెలలతో పోల్చినా అన్ని వస్తువుల ధరలు 40 శాతం పెరిగాయి. ఏ ఒక్క వస్తువు ధర కూడా తగ్గిన దాఖలా లేదు.
కేంద్రం వైఫల్యం
ధరల నియంత్రణలో కేంద్రంలోని మోడీసర్కారు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. సామాన్యుల వంటింటి ఆర్థిక కష్టాలను ఏమాత్రం నియంత్రించలేకపోతోంది. అయితే ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఎల్‌నినో సాకును ప్రధానంగా చూపుతున్నారు. పంటల దిగుబడి తగ్గిందని ప్రచారం చేస్తున్నారు. దానివల్లే ధరలు పెరుగుతున్నాయని బీజేపీ సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నది. డీమార్ట్, రిలయన్స్ వంటి కార్పొరేట్ దిగ్గజ సంస్థలు లక్షల టన్నుల ధాన్యాలను గిడ్డంగుల్లో అక్రమంగా నిల్వ ఉంచి, బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. వాటిని విడిపించే కనీస ప్రయత్నం కేంద్రం వైపు నుంచి జరగట్లేదు. పైపెచ్చు దేశంలో నిత్యవసరవస్తువుల కొరతను సాకుగా చూపుతూ విదేశాల నుంచి ఎలాంటి సుంకాలు లేకుండా దిగుమతులు చేసుకొనేందుకు అవకాశాలు కల్పిస్తున్నది. అలా వచ్చిన సరుకు కూడా మళ్లీ కార్పొరేట్ల గోడౌన్లలోకే చేరుతున్నాయని దేశంలోని ఆహారరంగ నిపుణులు చెప్తున్నారు.
నిబంధనలు బేఖాతర్
నిత్యవసర వస్తువులను కార్పొరేట్ సంస్థలు 15 రోజుల అవసరాలకు మించి నిల్వ ఉంచకూడదనే నిబంధన ఉంది. దాన్ని ఏఒక్క సంస్థా పాటించట్లేదు. ఆహార తనిఖీ బృందాలు కనీసం ఆ సంస్థల గోడౌన్లపై దాడులు చేసే పరిస్థితులు కూడా లేవు. తాజాగా చక్కెర నిల్వపై కేంద్రం షరతులు విధించింది. కానీ కార్పొరేట్ సంస్థల గోడౌన్లలో ఎంత స్టాక్ నిల్వ ఉందనే గణాంకాలను మాత్రం వెల్లడించలేదు.
కూరగాయలదీ అదే దారి
దేశంలో కూరగాయల ధరలూ భారీగా పెరిగాయి. టమోట, ఉల్లిపాయలు, బీన్స్, బెండకాయలు, కాప్సికం, ఆలుగడ్డ వంటి అన్ని కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. నిన్న మొన్నటి వరకు రూ.10 నుంచి రూ.15 వరకు ఉన్న కిలో టమోట ధర ఇప్పుడు దాదాపు రూ.40కి చేరింది. ఆకు కూరల ధరలు కూడా పెరిగాయి.
భయపెడుతున్న ఆహార ద్రవ్యోల్బణం
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సామాన్యుడి వంటింటి బడ్జెట్‌ను కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.45 శాతానికి చేరగా, ఆహార ద్రవ్యోల్బణం 5.52 శాతానికి పెరిగింది. మరోవైపు తెలంగాణలో ద్రవ్యోల్బణం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. జూలైలో రాష్ట్ర ద్రవ్యోల్బణం 6.32 శాతంగా నమోదైంది. జూన్‌లో 6.36 శాతంగా ఉండగా, మేలో 6.15 శాతంగా ఉంది. అంటే స్వల్పంగా తగ్గినప్పటికీ.. వరుసగా ఏడో నెల కూడా తెలంగాణ అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రంగా నిలిచింది. గ్రామీణంలో ఆహార ద్రవ్యోల్బణం 6.89 శాతంగా నమోదైంది. దీనివల్ల వ్యవసాయాధారిత కుటుంబాలపై ధరల ఒత్తిడి తీవ్రంగా కనిపిస్తోంది.
కేంద్రం చెప్తున్న కారణాలు
దేశంలో ధరల పెరుగుదలకు కేంద్రం కుంటి సాకుల్ని వెతుక్కుంటోంది. ఆహార ఉత్పత్తులు, నిల్వ, మార్కెటింగ్ విధానాల్లోని లోపాలను సరిదిద్దు కోకుండా నెపాన్ని ప్రకృతిపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పట్లో పెరిగిన ధరలు మరింత పెరగడమే తప్ప, కనుచూపుమేరలో తగ్గే సూచనలు కనిపించట్లేదని విశ్లేషకులు చెప్తున్నారు. దీనివల్ల సాధారణ కుటుంబాల నెలవారీ కిరాణా బిల్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ధరల పెరుగుదలకు ప్రత్యేకంగా వర్షాబావం, పంటల మార్కెట్ రాక, అంతర్జాతీయ చమురు ధరలు, చక్కెర సరఫరా, పండుగల డిమాండ్ వంటి అంశాలను కేంద్రం కారణాలుగా చూపుతుంది.
రాష్ర్టంలో ధరల పెరుగుదల ఇలా…(కిలో)
వస్తువు మూడు నెలల క్రితం తాజా ధర పెరుగుదల (శాతాల్లో)
చక్కెర 45/- 60/- 33.33
సన్‌ఫ్లవర్ ఆయిల్ 140/- 195/- 39.3
బియ్యం 55/- 65 /- 18.2
పాలు (లీటర్) 59/- 68/- 15.3
ఉప్పు 22/- 28/- 27.3
కందిపప్పు 123/- 140/- 13.82
మినపప్పు 121/- 145/- 19.83
పెసరపప్పు 110/- 140/- 27.3
శనగపప్పు 112/- 130/- 16.1



