Thursday, July 9, 2026
E-PAPER
Homeజాతీయంవాతావరణ మార్పులతో ఉల్లి కన్నీరు

వాతావరణ మార్పులతో ఉల్లి కన్నీరు

- Advertisement -

అస్థిర వర్షాలు, ఎల్‌నినో ప్రభావంతో
పొంచి ఉన్న ముప్పు
మార్చి-ఏప్రిల్‌‌లో అకాల వర్షాలు, వడగళ్లు..
ఇప్పటికే 6.2 హెక్టార్ల మేర పంటలు దెబ్బ
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌‌లలో తీవ్ర నష్టం
అన్నదాతను ఆదుకోవడంలో బీజేపీ సర్కారు విఫలం
దేశంలో మళ్లీ ధరల మంటలు తప్పవా?


న్యూఢిల్లీ :
భారతీయుల వంటింట్లో విడదీయరాని భాగమైన ఉల్లిపాయ ఇప్పుడు వాతావరణ మార్పుల దెబ్బకు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారి తీసి, ప్రభుత్వాలకే సవాలుగా మారిన ఉల్లి ధరలు ఇకపై మరింత అస్థిరంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. అకాల వర్షాలు, వడగళ్ల వానలు, ఎల్‌నినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కలిసి ఉల్లి సాగు, నిల్వలు, సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి.
​భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్లి ఉత్పత్తిదారు. దేశంలో ఖరీఫ్, లేట్ ఖరీఫ్, రబీ అనే మూడు సీజన్లలో ఉల్లి సాగు జరుగుతుంది. ఈ విధానం ఏడాది పొడవునా మార్కెట్‌కు ఉల్లి అందుబాటులో ఉండేలా చేస్తుంది. అయితే దేశంలోని వాతావరణ మార్పుల కారణంగా ఈ వ్యవస్థ క్రమంగా దెబ్బతింటోందని నిపుణులు చెప్తున్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానలతో దేశవ్యాప్తంగా సుమారు 6.2 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ఉల్లి, వెల్లుల్లి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

​వర్షమే పెద్ద శత్రువు
ఉల్లిపాయ నేలలో పెరుగుతుంది. అది బాగా ఎదగాలంటే నేలలో తేమ సరైన మోతాదులో ఉండాలి. నీరు తక్కువైతే ఉల్లిగడ్డలు చిన్నగా ఉంటాయి. నీరు ఎక్కువైతే నేలలో గాలి లేకుండా పోయి వేర్లు ఊపిరాడక దెబ్బతింటాయి. అధిక తేమ వల్ల ఆంత్రాక్నోస్ వంటి శిలీంధ్ర వ్యాధులు వేగంగా వ్యాపించి కొద్ది రోజుల్లోనే మొత్తం పంటను నాశనం చేసే ప్రమాదం ఉంది. గతేడాది ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. భారత్‌లో పండే మూడు రకాల ఉల్లి పంటల్లో ఖరీఫ్ సీజన్‌లో పండే ఉల్లికే భారీ వర్షాలు, నీరు నిలిచిపోవడం వల్ల అత్యధిక నష్టం జరుగుతోంది. దేశంలో ఉల్లి ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉన్న మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఖరీఫ్, లేట్ ఖరీఫ్ పంటల్లో 80 శాతం వరకు నష్టం సంభవించినట్టు రైతులు చెప్తున్నారు.

​ఎల్‌నినో ప్రభావం
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణ సగటులో 90 శాతం మాత్రమే ఉండే అవకాశం ఉంది. జూన్ 11న ఎల్‌నినో పరిస్థితులు అధికారికంగా నమోద య్యాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గితే రబీ ఉల్లి పంటకు అవసరమైన నేల తేమ తగ్గిపోతుంది. దీంతో దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. కొన్ని విశ్లేషణల ప్రకారం… సాధారణ వర్షపాతం కంటే ప్రతి 1 శాతం లోటు ఏర్పడితే పంట ఉత్పత్తి వృద్ధి సుమారు 0.4 శాతం తగ్గే అవకాశం ఉంది. 10 శాతం వర్షాభావం ఏర్పడితే ప్రభావం మరింత తీవ్రంగా ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. అలాగే ఎల్‌నినో ఏడాదుల్లో ఆహార ద్రవ్యోల్బణం సాధారణ సంవత్స రాలతో పోలిస్తే సగటున 170 బేసిస్ పాయింట్లు ఎక్కువగా నమోదవుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీంతో ఉల్లి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ ‌నిపుణులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

​నిల్వలపైనా వాతావరణ ప్రభావం
ఉల్లి కోత తర్వాత చాలా వరకు బహిరంగ గోదాముల్లోనే నిల్వ చేస్తారు. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా నిల్వ చేసిన ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తడం, కుళ్లిపోవడం జరుగుతోంది. దీంతో మార్కెట్‌కు వచ్చే సరఫరా తగ్గి ధరలు మరింత పెరుగుతున్నాయి. కాబట్టి సమస్య అనేది ఒక పంట కాలానికి సంబంధించింది మాత్రమే కాదనీ, వాతావరణ మార్పులు ఇప్పుడు పొలం నుంచి గోదాం వరకు, అక్కడి నుంచి వినియోగదారుడి వంటింటి వరకు.. మొత్తం సరఫరా వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి.

​ఉల్లి రైతులకు ‘డబుల్‌’ కష్టాలు
ఉల్లి పంటలకు జరిగిన నష్టంతో ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌‌లలో అక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులను ఆదుకోవడంలో అక్కడి డబుల్‌ ఇంజిన్‌ ‌సర్కార్లు తీవ్రంగా విఫలమయ్యాయని ప్రతిపక్ష‍ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఉల్లి సంక్ష‍ోభానికి వాతావరణ మార్పుల రూపంలో సంకేతాలు కనబడుతున్నాయి. ఫలితంగా ఉల్లి ధరలు పెరిగితే.. అది దేశంలోని సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇంధన ధరల పెరుగుదలతో ఇప్పటికే వారి జేబులకు చిల్లులు పడ్డాయి. కాబట్టి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉల్లి విషయంలో ముందు చూపుతో వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -