మహిళా నిర్మాతకు ఆస్కార్‌ అందించిన కామెడీ చిత్రం

Movei క్రైం సినిమాలలో ఓ విభాగం కేపర్‌ ఫిల్మ్‌. దీన్నే హీస్ట్‌ ఫిల్మ్‌ అని కూడా అంటారు. ఈ రకం సినిమాలలో క్రైం ప్రణాళిక, దాన్ని అమలు చెసే విధానం, తత్ఫలితాలను నిశితంగా చిత్రీకరిస్తారు. ఈ విభాగంలో హాలీవుడ్‌లో మంచి చిత్రాలు వచ్చాయి. వాటిలో ఇప్పటికీ సినీ ప్రేమికులు ప్రస్తావించుకునే చిత్రం 1973లో వచ్చిన ‘ది స్టింగ్‌’.
హాలీవుడ్‌లో దిగ్గజ నటులు పాల్‌ న్యూమాన్‌, రాబర్ట్‌ రెడ్ఫోర్డ్‌ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ఆ రోజుల్లో ప్రభంజనం సష్టించింది. ఇద్దరు ఫ్రొఫెషనల్‌ మోసగాళ్ళు ఓ ప్రణాళిక రచించి, మరో క్రిమినల్‌ను మోసం చేసి అతన్ని పూర్తిగా దోచుకోవడం ఈ సినిమా కథ. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది జార్జ్‌ రారుహిల్‌. డేవిడ్‌. ఎస్‌. వార్డ్‌ నిజజీవితంలో తాను విన్న్‌ ఫ్రెడ్‌, చార్లీ గాండ్రోఫ్‌ అనే ఇద్దరు ప్రొఫెషనల్‌ మోసగాళ్ల జీవిత కథ ఆధారంగా ఈ సినిమాకు స్క్రీన్‌ ప్లే రాసుకున్నారు. డేవిడ్‌ ఔ. మౌరర్‌ రాసిన ‘ది బిగ్‌ కాన్‌’ అనే పుస్తకం మొదట 1940లో ప్రచురించబడింది. ఇదే ఈ చిత్ర కథకు మూలం.
ఈ సినిమా చిత్రీకరణ వినూత్నంగా ఉంటుంది. సినీ కథను చాప్టర్లుగా వేరు వేరు పేర్లతో ఇంటర్‌ కార్డులతో స్క్రీన్‌ పై చిత్రీకరించారు. ప్రతి చాప్టర్‌ను ఒక పేరుతో పాటు జరోస్లావ్‌ గెబ్ర్‌ అనే ఓ ఆర్టిస్ట్‌ పెన్సిల్‌ స్కెచ్‌లతో విడదీసి చూపిస్తూ కథను నడిపిస్తూ 1936 లలోకి ప్రేక్షకులను తీసుకెళ్లగలిగారు దర్శకులు.
ఈ సినిమాకు పది ఆస్కార్‌ నామినేషన్లు లభించాయి. ఉత్తమ చిత్రంతో పాటు ఏడు పురస్కారాలు అందుకుంది ‘ది స్ట్రింగ్‌’. అమెరికాలో సినీ రచయితలందరూ ఈ సినిమా స్క్రీన్‌ప్లేను ప్రపంచ సినిమాలోనే గొప్పదిగా గుర్తించారు.
జార్జ్‌ రారు హిల్‌ ఈ చిత్రం 1930ల నాటి చికాగో అనుభూతిని మాత్రమే కాకుండా ఆ కాలం నాటి పాత హాలీవుడ్‌ సినిమాలను కూడా కచ్చితంగా ప్రతిబింబించే విధంగా ఉండాలని కోరుకున్నాడు. హిల్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ హెన్రీ బమ్‌ స్టెడ్‌, సినిమాటోగ్రాఫర్‌ రాబర్ట్‌ సర్టీస్‌తో కలిసి ఈ చిత్రం కోసం మ్యూట్‌ చేసిన బ్రౌన్‌, మెరూన్‌ రంగుల కలర్‌ స్కీమ్‌ను ఉపయోగించారు. కోరుకున్న దశ్య రూపాన్ని పొందడానికి పాత-కాలపు 1930ల-శైలి లైటింగ్‌ కోసం కొన్ని ఆధునిక ఉపాయాలతో కలిపి లైటింగ్‌ డిజైన్‌ను రూపొందించాడు.
ఒక జూద గృహం నుండి మరో చోటకు పదకొండు వేల డాలర్ల డబ్బు తీసుకుని ఓ వ్యక్తి వెళుతూ ఉంటాడు. ఇతని పని ఆ డబ్బు చేరవలసిన చోటుకు చేర్చడం. దారిలో ఓ నల్లజాతీయుడిని ఓ తెల్ల వ్యక్తి గాయపరిచి అతని డబ్బు దొంగలించడం ఇతను చూస్తాడు అక్కడే ఉన్న మరో వ్యక్తి నల్లజాతీయుడిని గాయపరిచిన వ్యక్తి నుండి పర్సు లాక్కుంటాడు. ఆ డబ్బును మరో చోటకు చేర్చాలని, లేదంటే తాను ప్రమాదంలో పడతానని గాయపడిన నల్లజాతి వ్యక్తి అన్నప్పుడు డబ్బును మరో జూద గృహానికి తీసుకెళ్తున్న ఆ కొరియర్‌ తాను నల్లజాతీయుని డబ్బును కూడా సురక్షితంగా అతను చెప్పిన చోటికి చేరుస్తానని అంటాడు. అయితే దారిలో డబ్బు కోసం ఇంతకు ముందు దాడి చేసిన దొంగ తిరిగి ఇతనిపై దాడి చేయకుండా ఆ డబ్బును ఎలా బట్టల్లోపల దాచి పెట్టుకోవాలో ఆ రెండో వ్యక్తి చూపిస్తాడు. ఆ కొరియర్‌ మాత్రం నమ్మించి ఆ డబ్బు అంతా కొట్టేయాలని అనుకుంటూ ఉంటాడు. ఇతను సరే అంటు జాగ్రత్తగా అవతలి వ్యక్తి చెప్పినట్లు డబ్బును దుస్తులలో దాచుకుని అక్కడి నుంచి వెళ్ళి టాక్సీ ఎక్కుతాడు. తనకు అనుకోకుండా ఐదు వేల డాలర్లు లభించాయని అతను కారులో ఆనందంగా పర్సు విప్పి చూసుకుంటే అందులో తెల్ల కాయితాలు కనిపిస్తాయి. అప్పుడు అర్ధం అవుతుంది. ఆ గాయపడిన నల్లవాడు, అతన్ని గాయపర్చిన వాడు, ఆ పర్సు పట్టుకున్న వారు ఒకే జట్టుకు చెందిన ప్రొఫెషనల్‌ మోసగాళ్లని, డబ్బు ఎర చూపి వారు అతని దగ్గర ఉన్న మొత్తం రొక్కం కొట్టేసారని.
నల్ల జాతీయుడి పేరు లూథర్‌, పర్సు పట్టుకున్న వ్యక్తి హూకర్‌. గాయం చేసినది జో ఎరీ. ముగ్గురూ తాము దోచుకున్న డబ్బు వాటాలు పంచుకుంటారు. తన వాటా డబ్బంతా జూదంలో హూకర్‌ ఒక్క రోజులో పోగొట్టుకుంటాడు. లూథర్‌ మాత్రం తాను ఇక ఈ వత్తి మానేస్తానని, లీగల్‌ వ్యాపారంలోకి వెళ్తానని ప్రకటిస్తాడు. హూకర్‌ని తన మిత్రుడు ప్రఖ్యాత ప్రొఫెషనల్‌ కాన్‌ మాన్‌ గాండ్రాఫ్‌ దగ్గరకు వెళ్లి కావల్సిన మెళుకువలు నేర్చుకొమ్మని పంపిస్తాడు లూథర్‌.
విలియం సైండర్‌ ఒక పోలీసు. కాని అడ్డ దారిలో డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఇతనికి హూకర్‌ బందం దొంగలించినది ఓ పెద్ద మాఫియా డాన్‌ లానేగాన్‌ డబ్బు అని తెలుస్తుంది. లానేగాన్‌ ఆ డబ్బు దొంగలించిన వారిని పట్టుకోవడానికి కరడు గట్టిన కిల్లర్స్‌ని పంపిస్తాడు. హూకర్‌ వాటా డబ్బు తనకిమ్మని సైండర్‌ అతన్ని అడ్డగిస్తాడు. హూకర్‌ నకిలీ కరెన్సీని ఇచ్చి అప్పటికి తప్పించుకుని పారిపోతాడు. తమను మాఫియా వెంబడిస్తుదని లూథర్‌కి చెప్పాలని అతను ఇంటికి వస్తే, అప్పటికే జరిగిన దాడిలో లూధర్‌ హత్యకు గురవుతాడు. లూథర్‌ని హూకర్‌ తండ్రిగా భావిస్తాడు. అతన్ని రక్తపు మడుగులో చూసిన హూకర్‌ ఎలాగయినా లూథర్‌ హత్యకు బదులు తీర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు.
హూకర్‌ కోసం లానేగాన్‌ మనుషులు మరో పక్క గాలిస్తూ ఉంటారు. హూకర్‌, లూథర్‌ ఇచ్చిన అడ్రసు పట్టుకుని గాండ్రాఫ్‌ను కలుసుకుంటాడు. ఎప్‌.బి.ఐ నుండి తప్పించుకుని వేశ్యాగహం నిర్వహిస్తున్న తన ప్రియురాలి ఇంట గాండ్రాఫ్‌ దాక్కుని ఉంటాడు. లూథర్‌ చావుకు ప్రతీకారం తీర్చుకోవాలని హూకర్‌ అనుకోవడం గాండ్రాఫ్‌కు నచ్చదు. అతను ఆలోచనతో అవతలి వారిని దెబ్బ కొట్టాలని నమ్మే వ్యక్తి. అందుకని ఓ గొప్ప స్ట్రింగ్‌ ఆపరేషన్‌ను ప్లాన్‌ చేస్తాడు. సిటీలో ప్రొఫెషనల్‌ మోసగాళ్ళను సేకరించి ది వైర్‌ అనే ఓ ప్రాజెక్టు మొదలెడతాడు. దీనిలో భాగంగా ఒక బెట్టింగ్‌ పార్లర్‌ నిర్వహిస్తున్నట్లు అందరూ కలిసి నటిస్తారు.
మరో పక్క సైండర్‌, లనేగాన్‌ లు హూకర్‌ కోసం వెతుకుతూ ఉంటారు. లానేగాన్‌ ఆడే పోకర్‌ ఆటలో ఆటగాడిగా షా అనే మారుపేరుతో వెళతాడు గాండ్రాఫ్‌. లానెగాన్‌ను రెచ్చగొట్టి అతని మోసాన్ని చిత్తు చేస్తూ ఆటలో మొత్తం డబ్బు గెలుచుకుంటాడు గాండ్రాఫ్‌. గెలుచుకున్న డబ్బు తీసుకురావడానికి హూకర్‌ను తన అసిస్టెంట్‌ కెల్లీ అని నమ్మించి లానెగాన్‌ దగ్గరకు పంపిస్తాడు. లానెగాన్‌ నమ్మకం సంపాదించడానికి తాను గాండ్రాఫ్‌ దగ్గర ఉన్న మొత్తం రొక్కం దొంగలించి పారిపోవడానికి సహాయం కోసం చూస్తున్నాని కెల్లి అంటాడు. తనని తాను నిరూపించుకోవడానికి బెట్టింగ్‌లో ఆ రోజు గెలవబోయే గుర్రం పేరు చెప్పి లానెగాన్‌ ఆ గుర్రంపై డబు కాసి కొంత డబ్బు సంపాదించుకునేలా చేస్తాడు హూకర్‌.
బెట్టింగ్‌ పార్లర్‌కు వచ్చి అక్కడ గాండ్రఫ్‌ను చూసిన లానేగాన్‌, తనను మోసం చేసి డబ్బు దోచుకున్నందుకు బదులుగా గాండ్రఫ్‌ పై పగ తీర్చుకోవాలనుకుంటాడు. అతని డబ్బు మొత్తం తాను దోచుకోవాలని నిశ్చయించుకుంటాడు. కెల్లీ పై అతనికి నమ్మకం ఏర్పడుతుంది. కెల్లీ తాను వెతుకుతున్నది హూకర్‌ని అని అతనికి తెలీదు. ఏ గుర్రం గెలవబోతుందనే సమాచారాన్ని గాండ్రాఫ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ తనకు అందిస్తున్నాడని కెల్లీ లానేగాన్‌ కు చెప్తాడు. ఆ బ్యాంక్‌ మేనేజర్‌ను తాను కలుస్తానని అంటాడు లానేగాన్‌. ఓ పేద్ద పేరున్న బ్యాంక్‌ మేనేజర్‌ ఆఫీసులో సున్నం వేసే కార్మికులుగా మరో ఇద్దరు కాన్‌మెన్‌లు వెళ్లి అక్కడే లానేగాన్‌ను కలిసి ఓ జట్టుగా పని చేద్దాం అని కాంట్రాక్టు కుదుర్చుకుంటారు. దీనితో కెల్లిపై లానేగాన్‌కు నమ్మకం ఏర్పడుతుంది.
లానేగాన్‌ పూర్తిగా వీరి బుట్టలో పడిపోతాడు. సైండర్‌ హూకర్‌ కోసం గాలిస్తూనే ఉంటాడు. అతని కదలికలు గమనిస్తాడు ఎప్‌.బీ.ఐ. ఆఫీసర్‌ ఏజెంట్‌ పోల్క్‌. సైండర్‌ పై అధికారిగా తనకు ఓ పెద్ద స్ట్రింగ్‌ ఆపరేషన్‌ జరగబోతుందనే సమాచారం తెలిసిందని, గాండ్రఫ్‌ను సాక్షాలతో సహా పట్టుకోవడానికి హూకర్‌ తమకు అవసరం అని అతని వద్దకు తమను తీసుకెళ్ళమని సైండర్‌ని ఆజ్ఞాపిస్తాడు పోల్క్‌. హూకర్‌ను బలవంతంగా పట్టుకుని పోల్క్‌ వద్దకు తీసుకువస్తాడు సైండర్‌. హూకర్‌ తమకు సహకరించి గాండ్రాఫ్‌ను పట్టించాలని, లేదంటే లూథర్‌ భార్యను చంపాల్సి ఉంటుందని బెదిరిస్తాడు పోల్క్‌. హూకర్‌ తప్పక అప్రూవర్‌గా మారిపోతాడు. లానేగాన్‌ హూకర్‌ను చంపడానికి సాలినో అనే కిల్లర్‌ను నియమిస్తాడు. హూకర్‌ తాను ఇష్టపడ్డ స్త్రీతో ఓ రాత్రి గడుపుతాడు. మరుసటి రోజు రోడ్డుపై ఆమె అతని వైపుకు నడిచి వస్తుండగా ఓ ప్రొఫెషనల్‌ కిల్లర్‌ ఆమెను చంపేస్తాడు. ఆశ్చర్యంగా చూస్తున్న హూకర్‌తో ఆమె హూకర్‌ను చంపడానికి వచ్చిన సాలినో అనే ప్రొఫెషనల్‌ కిల్లర్‌ అని, తనను గాండ్రాఫ్‌ హూకర్‌ను కనిపెట్టుకుని ఉండడానికి నియమించాడని అతను చెప్పడంతో హూకర్‌ ఆశ్చర్యపోతాడు.
తన దగ్గరున్నదంతా తీసుకుని బెట్టింగ్‌ క్లబ్‌కు వస్తాడు లానేగాన్‌. అతనికిచ్చిన సమాచారం ప్రకారం ఓ గుర్రంపై పందెం కాస్తాడు. అక్కడకు అప్పుడే వచ్చిన బ్యాంక్‌ మేనేజర్‌, తాను ఆ గుర్రం రెండవ స్థానంలో వస్తుందని చెప్పానని, గెలిచే గుర్రం అది కాదని చెప్పడంతో భయపడి తన డబ్బు తిరిగి ఇమ్మని కాషియర్‌ని అడుగుతాడు లానేగాన్‌. ఈ గొడవలో హూకర్‌ గాండ్రాఫ్‌ లను ఎప్‌.బి.ఐ. ఆఫీసర్లు చుట్టుముడతారు. తనను మోసం చేసింది హూకర్‌ అని తెలిసి కోపంతో హూకర్‌ను చంపేస్తాడు గాండ్రాఫ్‌. ఏజెంట్‌ పోల్క్‌ గాండ్రాఫ్‌ను కాల్చి చంపేస్తాడు. ఇది చూసి బెదిరిన లానేగాన్‌ను సైండర్‌ తప్పించడానికి బైటికి తీసుకెళతాడు. వాళ్ళిద్దరూ బైటకు వెళ్ళగానే కింద పడ్డ గాండ్రాఫ్‌, హూకర్‌లు లేచి నిల్చుంటారు. ఏజెంట్‌ పోల్క్‌ కూడ గాండ్రాఫ్‌ మనిషని, సైండర్‌ను దారి తప్పించడానికి ఈ నాటకం గాండ్రాప్‌ ఆడాడని అప్పుడు ప్రేక్షకులకు తెలుస్తుంది.
లానేగాన్‌ వదిలేసిన డబ్బు తీసుకుని గాండ్రాఫ్‌, అతని బందం దాన్ని తమ మధ్య పంచుకోవడానికి వెళతారు. తనకు అందులో భాగం వద్దని, లూథర్‌ హత్యకు తనకు ప్రతీకారం దొరికిందని, ఎంత డబ్బు తనకు వచ్చినా దాన్ని ఒక్క రోజులో తాను ఖర్చు పెట్టేస్తానని అంటూ గాండ్రాఫ్‌ శిష్యుడిగా అతని వెంట వెళతాడు హూకర్‌.
సినిమాలో ట్విస్ట్‌లను స్క్రీన్‌ పైన చూడడం బావుంటుంది. గాండ్రాఫ్‌గా పాల్‌ న్యూమాన్‌, హూకర్‌గా రాబర్డ్‌ రెడ్ఫ్రోడ్‌ ల నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఎడిథ్‌ హెడ్‌ వీరికి డిజైన్‌ చేసిన కాస్ట్యూమ్స్‌ మరో సంచలనం. ఆమె కాస్ట్యూం డిజైన్‌కు ఆస్కర్‌ అందుకున్నారు.
లానేగాన్‌ పాత్రలో నటించిన రాబర్ట్‌ షా మోకాలి గాయంతో ఆ సమయంలో కుంటూతూ నడిచేవారు. అది ఈ పాత్రకు సరిగ్గా సరిపోయింది. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా రెడ్ఫ్రోర్డ్‌ నామినేట్‌ అయ్యారు. ఆయన సినీ జీవితంలో ఆయనకు దక్కిన ఒకే ఒక నామినేషన్‌ ఇది. ఈ సినిమా సంగీతం చాలా పేరు తెచ్చుకుంది. చాలా చోట్ల నిశబ్దం మధ్యలో మంద్రంగా వినిపించే బాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమా మూడ్‌ను ఆసాంతం నిలిపి ఉంచుతుంది. ఈ సినిమాలో కాన్‌ మెన్‌ వేసుకున్న సూట్లు అప్పట్లో ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి.
ఐర్లాండ్‌లో గొప్ప ఆదరణ చూసిన చిత్రం ‘ది స్టింగ్‌’. డబ్లిన్‌ లో అడల్పీ సినిమాలో ఇది ఒక సంవత్సరం పాటు ఆడి ఎంతో డబ్బు వసూలు చేసింది. బ్రిటిష్‌ థియేటర్లు ఈ సినిమా తీసేశాక యూ.కే. నుండి ఈ సినిమా కోసం చాలామంది డబ్లిన్‌ వెళ్ళేవారట.
ఈ సినిమా నిర్మాతలలో జూలియా ఫిలిప్స్‌ ఒకరు. ఈ సినిమాతో ఆస్కార్‌కు నామినేట్‌ అయి అవార్డు గెలుచుకున్న మొదటి మహిళా నిర్మాతగా ఆమె చరిత్రకెక్కారు. 1974లో ఆస్కార్‌ ఉత్తమ చిత్రంగా నామినేట్‌ అయిన మూడు సినిమాలూ కామెడీలే కావడం మరో విశేషం. అమెరికన్‌ గ్రాఫిటీ, ఏ టచ్‌ ఆప్‌ క్లాస్‌ అనే రెండు కామెడీలు కూడా ఆస్కార్‌ బరిలో నిలిచాయి. వాటిని దాటి ‘ది స్టింగ్‌’ అవార్డును గెలుచుకుంది.
క్రైం కామెడీ సినిమాలను ఇష్టపడేవారు, స్క్రీన్‌ ప్లే నిర్మాణాన్ని నిశితంగా స్టడీ చేసే సినీ ప్రేమికులు మళ్ళీ మళ్ళీ చూసే ‘ది స్టింగ్‌’ సినిమాగా వచ్చి తరువాత నవలగా ప్రేక్షకులకు దగ్గరయిన అరుదైన సినిమా.
– పి.జ్యోతి,
98853 84740

Spread the love