ప్రేమ కథలు చెప్పేటప్పుడు సినిమాలలో సాధారణంగా నాయకుని పాత్రలను ఎప్పుడూ ధీరోదాత్తమైనవిగా చూపిస్తారు. కాని ప్రేమ పొందాలనే కోరిక, తామూ ప్రేమించబడాలనే తపన వారిని బలహీనపరిచే కోణంలో సాధారణంగా ఏ ప్రేమ కథలలోనూ చూపించరు. ప్రేమ కథలలో స్త్రీ, పురుషులను ప్రేమించడం సులువుగా జరిగిపోతుంది. లేదా ఆమెను తమ ప్రేమలో పడవేసే గుణం వీరిలో పుష్కలంగా ఉంటుంది. నన్ను ఓ స్త్రీ ప్రేమించట్లేదే అనే నిస్పహ, స్త్రీపొందు కోసం పడే తపనను హీరోలో చూపించాలనే ఆలోచన చాలామంది కథకులలో ఉండదు. అంటే ఎందరో స్త్రీలు నిరాకరించిన వ్యక్తిని నాయకునిగా తెరపై చూపించే ప్రేమ కథను తీసే ధైర్యం చాలా తక్కువమందిలో ఉంటుంది. ‘మార్టి’ అలా విభిన్నమైన కథాంశంతో వచ్చిన సినిమా.
ఒక వయసు వచ్చిన తరువాత స్త్రీ, పురుషులిద్దరూ ప్రేమ కోసం ఆశపడతారు. తమను ప్రేమించే వ్యక్తి తమ జీవితంలో ఒకరుండాలని కోరుకుంటారు. కాని ఈ ప్రపంచంలో స్త్రీ పురుషులిద్దరి మనసుల్లో తమ ప్రేమికుల పట్ల ఓ అస్పష్ట చిత్రం ఉంటుంది. అది ఎంత అవాస్తవికమైనది అయినా ఆ చిత్రాన్ని వారు తమ మనసులో నిలుపుకుని ఆ ప్రభావంతో తమ జీవిత భాగస్వామిని వెతుక్కుంటారు. అందులో అందం, హోదా, ప్రధాన పాత్ర వహిస్తాయి. సాధారణంగా స్త్రీలలో అందానికి, పురుషులలో హోదాకు సమాజం మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. మనసు, మంచితనం లాంటివన్నీ ఆ వయసులో ఎవరికీ కనిపించవు. వాటి గురించి యువత మాట్లాడుతుంది కాని నిజానికి అన్ని ప్రేమలూ అందం, హోదాలతో వచ్చినా ఆకర్షణ చట్రంలోనే నలుగుతుంటాయి. ఇవి రెండూ లేని స్త్రీ పురుషులను ఎవరూ కోరుకోరు.
అందం లేని సాధరణ స్త్రీల వైపు చూసేవారు తక్కువ అనే కదా స్త్రీలు అందంగా ఉండడం కోసం తమ జీవితంలో ప్రతి నిముషాన్ని ఖర్చు చేస్తారు. అలాగే హోదా కోసం పురుషులు చేయని పని ఉండదు. అందం లేకపోయినా సమాజంలో ఆర్ధికపరమైన సామాజికపరమైన హోదా ఉంటే ఆ పురుషున్ని అందగత్తెలందరూ కోరుకుంటారు. మరి ఇవి లేని వ్యక్తుల సంగతి ఏంటి? వారికి మనసు ఉండదా, మంచితనం ఉండదా, కేవలం వాటి ప్రాతిపదికన ప్రేమలు పుట్టవు అన్నది పచ్చి వాస్తవం. దీన్ని ప్రస్తావిస్తూ అందం, హోదా లేని ఇద్దరు స్త్రీ పురుషుల కథతో తీసిన సినిమా ‘మార్టి’.
అయితే ఈ కథ మొదట టెలివిజన్ నాటకంగా ప్రాచుర్యం పొందింది. 1953లో పాడీ చాయెఫ్ స్కీ రచించిన కథను టెలివిజన్ నాటకంగా తీశారు. ఇది మే 24, 1953 న ప్రసారమై, ఎంతమందినో ఆకర్షించింది. 1955లో ఇదే కథను సినిమాగా పెద్ద తెర కెక్కించారు దర్శకులు డెల్బర్ట్ మాన్. ఇది దర్శకుడిగా ఆయన మొదటి చిత్రం కూడా.
ఈ సినిమాలో నాయకుడి పేరు మార్టి. అతను ఓ మాంసం దుకాణంలో కసాయిగా పని చేస్తూ ఉంటాడు. విదేశాలలో మాంసాహరం, అందులోనూ ఎద్దు మాంసం తినేవారు ఎక్కువ. ఆ మాంసాన్ని ముక్కలుగా కోసి దాన్ని అమ్మే పని మార్టిది. మార్టి తల్లిదండ్రులు ఇటాలియన్లు, అమెరికాలో స్థిరపడ్డారు. 34 ఏళ్ళ మార్టి అవివాహితుడు. తండ్రి మరణించాడు. ఇతని అన్నలు, తమ్ముళ్లకు కూడా పెళ్ళిళ్లు అయిపోయాయి. కాని మార్టికి మాత్రం ఇంకా వివాహం కాలేదు. అతన్ని ఎవరు చూసినా తమ్ముళ్ల పెళ్ళిళ్లు గుర్తు చేసి ఇంకా ఎంతకాలం వివాహం లేకుండా ఉండిపోతావు అని అడుగుతూ ఉంటారు. ఇలాంటి మాటలు అవతలి వారిని ఎంత బాధిస్తాయో ఎవరికీ అర్ధం కాదా, లేక అర్ధం అయే మాట్లాడుతూ ఉంటారో మరి! మార్టికి ఇలాంటి సంబాషణలంటే విసుగు పుడుతుంది. అతని తల్లి కూడా సందర్భం వచ్చినప్పుడల్లా మార్టిని పెళ్లి చేసుకొమ్మని పోరుతూ ఉంటుంది.
మార్టి అందగాడు కాదు. బొద్దుగా ఉంటాడు. అతని ఉద్యోగంలో ఏ ఆకర్షణా లేదు. అతనితో స్నేహం చేయాలని ఎవరూ కోరుకోరు. ఏ ఆడపిల్లా అతన్ని చూడదు. చూసినా అతనితో స్నేహం కొనసాగించాలని అనుకోదు. వయసులో ఉన్న ఏ ఆడపిల్ల అయినా అతన్ని కోరుకోవడానికి ఏ ఆకర్షణా అతనిలో లేదు. మార్టిని ఇది బాధిస్తూనే ఉంటుంది. డాన్స్ కోసం స్నేహితులతో కలిసి వెళ్లిన ప్రతిసారి అతని గుండె గాయపడుతూనే ఉంటుంది. తానుగా ఫోన్ చేసినా, చొరవ తీసుకుని మాట్లాడబోయినా ఏ అమ్మాయీ అతని ఆహ్వానాన్ని ఒప్పుకోదు, అతనితో కలసి సమయం గడపాలనీ అనుకోదు. దానితో ఎంతో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాడు మార్టి.
మార్టీ తన తల్లి థెరీసా తో కలిసి ఒక ఇంట్లో ఉంటుంటాడు. థెరీసాకు కేథరిన్ అనే ఓ చెల్లెలు ఉంటుంది. ఆమె కొడుకు కోడలితో వేరే ఇంట్లో ఉంటుంటుంది. అయితే కేథరిన్ కు ఆమె కోడలికి అస్సలు పడదు. అత్త అదిలింపుల మధ్య ఉండలేనన్నది కోడలి వాదన. కోడలు పనిమంతురాలు కాదన్నది కేథరిన్ వాదన. వీళిద్దరి మధ్య ఆ కొడుకు నలిగిపోతూ ఉంటాడు. దీనికి పరిష్కారం కోసం ఆ జంట థెరీసా దగ్గరకు వస్తారు. కొన్నాళ్లు తమ తల్లిని ఆ ఇంట్లో ఉంచుకొమ్మని బతిమాలుతారు. స్వతహాగా మంచి మంచి మనన్సు గల థెరీసా దీనికి అంగీకరిస్తుంది. మార్టి కూడా పిన్ని తమతో ఉండడాన్ని ఆనందంగా ఒప్పుకుంటాడు. కేథరిన్ అన్నేళ్ళు కాపురం ఉన్న తన ఇల్లు వదిలి అక్క ఇంటికి చేరుతుంది.
కేథరిన్ కొడుకుతో థెరీసా మార్టి వివాహం గురించి ప్రస్తావిస్తుంది. మార్టిని శనివారం రాత్రి స్టార్ డస్ట్ బాల్‌రూం కు వెళ్ళమని, అక్కడ ఆ ఊరిలో ఉన్న యువతులందరూ వస్తారని, తన భార్యను కూడా మొదట తాను అక్కడే కలుసుకున్నానని చెబుతాడు. అందుకని మార్టిని ఆ శనివారం ఆ బాల్‌రూం కు వెళ్ళమని బలవంత పెడుతుంది థెరీసా. మార్టిలో అసహనం పెరిగి పోతుంది. తనకు వివాహం చేసుకోవాలని ఉంది అని, కాని దాని కోసం ఎంత ప్రయత్నించినా గుండెకు గాయం తప్ప మరేమీ మిగలట్లేదని తల్లి ముందు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతాడు. సినిమాలో ఈ సీన్ చాలా బావుంటుంది. వివాహం కాని మగవారి మనసులోని దు:ఖాన్ని చాలా నిజాయితీగా వ్యక్తీకరించే సీన్ ఇది.
అయినా తల్లి కోసం ఆ బాల్‌రూం కు వెళతాడు మార్టి. అక్కడ ఆడపిల్లలు అందమైన మగవారిని ఎన్నుకుని నత్యం చేస్తూ ఉంటారు. మార్టి ఎంత ప్రయత్నించినా అతనితో డాన్స్ చేయడానికి ఎవరూ రారు. అతను ఒక్కడే దూరంగా నిల్చుని అందరినీ చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ హాల్ లోకి రెండు జంటలు ప్రవేశిస్తాయి. ఒకరు భార్యా భర్తలయితే, మరో జంట క్లారా అనే ఓ అమ్మాయి, ఆమెతో వచ్చిన మరో యువకుడు. క్లారా అతి సాధారణంగా కనిపించే ఓ స్కూల్ టీచర్. ఆమెకు వరుడిని వెతికే పనిగా ఓ యువకుడిని అక్కడికి రప్పిస్తారు క్లారా స్నేహితులు. అయితే ఆ వచ్చినతను అందగాడు, కాస్త హోదా ఉన్నవాడు. అతనికి మొదటి చూపులోనే క్లారా నచ్చదు. అక్కడ ఓ పూర్వ పరిచయస్తురాలు అతనికి కనిపిస్తుంది. ఆమె క్లారా కన్నా అందంగా ఉంటుంది. అతను ఆమెతో డాన్స్ చేయడానికి క్లారా కోసం ఓ మగవాడిని వెతుకుతూ మార్టి దగ్గరకు వస్తాడు. మార్టి క్లారా తో డాన్స్ చేస్తే దానికి డబ్బు ఇస్తానంటాడు. మార్టి ఇది విని ఆశ్చర్యపోతాడు. బాల్‌రూం కు తనతో వచ్చిన యువతిని మరొకరిని అప్పగించండం తప్పని వాదిస్తాడు. ఆ వ్యక్తి మరొకతన్ని ఈ పనికి పట్టుకుంటాడు. క్లారా తో తాను మరొకరితో వెళ్లిపోతున్నానని చెబుతాడు.
క్లారా ఈ అవమానాన్ని తట్టుకోలేకపోటుంది. మార్టి ఇది గమనిస్తాడు. ఆమె ఒక్కత్తే బాల్కనిలోకి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. మార్టి క్లారా పరిస్థితి అర్ధం చేసుకుంటాడు. అలాంటి అవమానాలు అతను ఎన్నో అంతకు ముందు పొంది ఉన్నాడు. క్లారాతో సంభాషణ మొదలెడతాడు. ఇద్దరూ కలిసి నత్యం చేస్తారు. అక్కడి నుండి బైటకు వచ్చి రోడ్డుపై నడవడం మొదలెడతారు. మాటల్లో తమ బాధలను అసంతప్తులను, జీవితం పట్ల ఉన్న కోరికలను ఒకరితో మరొకరు పంచుకుంటారు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ తమ జీవితాలను అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇద్దరికీ ఇలాంటి సంభాషణ కొత్త. ఎవరితో కలిసినా తమను అవతలి వారు స్వీకరించడానికి ఎంతో కష్టపడి ఇబ్బందిపడి జరిపే సంభాషణల మధ్య ఇలా మనసు విప్పి కలిసి మాట్లాడుకోవడం వాళ్లకు ఎంతో ఊరటనిస్తుంది. ఒకరికొకరు దగ్గర అయినట్లు అనిపిస్తుంది. మార్టి క్లారాను తన ఇంటికి తీసుకువెళతాడు. అతని తల్లి అప్పుడు బైటకు వెళుతుంది. ఆ ఏకాంతంలో క్లారా ను ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నిస్తాడు మార్టి. క్లారా దీన్ని నిరాకరిస్తుంది. ఇది మార్టిని బాధిస్తుంది. అతని నిరాశ చూసి క్లారా ఇలాంటి సందర్భాలలో ఎలా ప్రవర్తించాలో తనకు తెలియదని, అందుకే మార్టితో దగ్గరితనాన్ని ఎలా స్వీకరించాలో అర్ధం కాక తాను అతన్ని పక్కకు తోశానని, నిజానికి అతన్ని తాను ఇష్టపడుతున్నానని చెబుతుంది. ఈలోగా థెరీసా ఇంటికి వస్తుంది. మొదటిసారి కొడుకు ఓ అమ్మాయిని ఇంటికి తీసుకురావడం ఆమెకు సంతోషాన్ని కలిగిస్తుంది.
థెరీసా, కేథరిన్ ని కలిసి కొన్నాళ్లు ఆమెను తన ఇంటికి వచ్చి ఉండమని అడగడానికి వెళుతుంది. కొడుకులు పెళ్ళి చేసుకుని పరాయివాళ్ళవుతారని, తమ ఇల్లు తమది కాకుండా పోతుందని, అలాంటి స్థితి మార్టి వివాహంతో నువ్వు కూడా అనుభవించవలసి ఉంటుందని కేథరిన్ అనడంతో థెరీసా ఆలొచనలలో పడుతుంది. ఇంటికి వచ్చిన క్లారా తో ఆమె ఈ విషయం చూచాయిగా చెబుతుంది. క్లారా కూడా పెళ్లి అయిన జంటకు ఏకాంతం అవసరమని చెప్పడం ఆమెను అభద్రత లోకి నెట్టేస్తుంది. మార్టి వివాహం తనను తన ఇంటికి దూరం చేస్తుందనే భయం ఆమెలో మొదలవుతుంది.
మార్టి క్లారాను ఆమె ఇంటి వరకు దింపుతాడు. ఆదివారం చర్చ్ లో ప్రార్ధన తరువాత మధ్యాహ్నం ఆమెకు ఫోన్ చేస్తానని చెబుతాడు. ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఇల్లు చేరతాడు.
ఇంటికి వచ్చాక థెరీసా తనకు క్లారా నచ్చలేదని మార్టితో అంటుంది. ఇది మార్టిని ఆశ్చర్యపరుస్తుంది. అప్పటిదాకా మార్టి ఒంటరితనంతో లాభపడుతున్న మిత్రులు మార్టి ఓ అమ్మాయికి దగ్గరవడం సహించలేకపోతారు. వాళ్ళు క్లారా అందమైనది కాదని వెక్కిరిస్తారు. మార్టికి ఆమె సరిజోడి కాదని, ఆమెను వదిలేయమని చెప్తారు. అప్పటిదాకా తనకు వివాహం కాలేదని విమర్శించిన వాళ్లు ఇప్పుడు తనకు నచ్చిన అమ్మాయి గురించి విరుద్దంగా మాట్లాడుతుంటే మార్టికి లోక రీతి అర్ధం కాదు. ఈ అయోమయంలో అతను క్లారా కు ఫోన్ చేయలేకపోతాడు. క్లారా అతని ఫోన్ కోసం కన్నీళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది.
ఆ రాత్రి మార్టి ఆలోచనలలో పడతాడు. తనకు ఆ రాత్రి దక్కిన ఆనందం, క్లారా తో సమయం గడుపుతున్నప్పుడు తనలో చేరిన ఆత్మవిశ్వాసం ఇవన్నీ అతనికి గుర్తువస్తాయి. ఆమెకు ఫోన్ చేయాలని నిశ్చయించుకుంటాడు. స్నేహితుల మధ్య నుండి లేచి వెళ్ళిపోతూ వారితో ఇలా అంటాడు… ”మీకు ఆమె నచ్చలేదు, మా అమ్మకూ నచ్చలేదు, ఆమె కుక్కలా వుంది. నేను లావుగా, వికతంగా ఉన్నాను. అయినా సరే, నాకు తెలిసిందల్లా నేను నిన్న రాత్రి తప్తిగా సమయం గడిపాను. ఈ రాత్రి కూడా నేను అలాగే సమయం గడపబోతున్నాను. మేమిద్దరం కలిసి ఇలా కొన్ని మంచి ఘడియలు సొంతం చేసుకోగలిగితే, మోకాళ్లపై కూర్చుని నన్ను పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయిని వేడుకుంటాను ఆమె నీకు నచ్చలేదా? అది చాలా అన్యాయం”
ఈ మాటలను అనేసి క్లారాకు మార్టి ఫోన్ చేస్తూండగా సినిమా ముగుస్తుంది.
మనుషులు బలహీనపడితే వారి సంబంధాలపై ప్రపంచం నియంత్రణ సాగిస్తుంది. ఇది జరగకుండా ఉండాలంటే జీవితాన్ని తమ చేతుల్లో తీసుకోగల శక్తి మనిషికి ఉండాలి. ఈ శక్తి రావాలంటే అతనికి అలాంటి బలాన్నిచ్చే చేయూత అవసరం అవుతుంది. అది అందితే దాన్ని ప్రపంచం కోసం ఎవరో ఏదో అన్నారని వదులుకోవడం మూర్ఖత్వం అవుతుంది. అంతకాలం మార్టి జీవితంలో స్త్రీ లేదని అతన్ని గేలి చేసిన వారే మార్టి ని ప్రేమించే ఓ వ్యక్తి జీవితంలోకి వచ్చిందని తెలిసిన తరువాత ఆమెకు అతన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఎవరి కారణాలు వారికున్నా అవి మార్టి నిర్ణయాన్ని ప్రభావితం చేసే కారణాలు కాకూడదు. తన ఆనందాన్ని తానే అందుకోగల స్తితిలో ప్రతి ఒక్కరూ ఉండాలి. మార్టి ఇది గ్రహించి, ఇతరుల మాటలను పక్కన పెట్టి తనకు ఆనందం ఇచ్చే బంధం వైపు అడుగులు వేయడంతో అతని జీవితం ఓ గాటిన పడుతుంది. దీనికి నాందిగా అందరి మాటలను పక్కకు నెట్టి మార్టి క్లారా కి ఫోన్ చేయడానికి వెళతాడు.
వివాహం కాని పురుషుల కోణంలో వాళ్లు జీవితంలో ఎదుర్కునే సవాళ్లని అతి సున్నితంగా చర్చించిన సినిమా ‘మార్టి.’ మార్టి పాత్రలో ఎర్నెస్ట్ బోర్గ్‌నైన్ మంచి నటనను ప్రదర్శించారు. తన బొద్దు శరీరంతో పళ్ళ మధ్య కనిపించే ఆ ఎడంతో ఆయన ఈ పాత్రకు సరిగ్గా సరిపోయారు. క్లారా గా నటించిన బెట్సీ బ్లేర్ కు ఈ సినిమా కోసం అకాడమి సహాయక నటి నామినేషన్ లభించింది. ‘మార్టీ’ చిత్రం ఎనిమిది అకాడమీ నామినేషన్లను పొందింది. అందులో ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే లకు నాలుగు ఆస్కార్లను సొంతం చేసుకుంది. సినీ చరిత్రలో మొదటి పాల్మ్ డి ఓర్ అవార్డు గెలుచుకున్న చిత్రం కూడా ‘మార్టి’ నే.
– పి.జ్యోతి,
98853 84740