ప్రభుత్వానికి. ‘ పంచాయితీ ‘ సవాల్‌

ప్రభుత్వానికి. ' పంచాయితీ ' సవాల్‌– పంచాయితీలో పైసల్‌ లేవు
– పాలకవర్గం లేక ఆగిన గ్రాండ్స్‌
– మాజీలు చేసిన పనులకు లక్షలలో బకాయిలు
– సెప్టెంబర్‌, అక్టోబర్‌ లో లోకల్‌ ఎన్నికలు. ?
నవ తెలంగాణ – మహబూబ్‌ నగర్‌
మహబూబ్‌ నగర్‌ జిల్లాలో 441 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. గత ప్రభుత్వం తాండాలను గుడాలను కూడా గ్రామ పంచాయతీలుగా చేసింది. దీంతో జిల్లాలో 500 జనాభా పంచాయితీ నుండి 5000 జనాభా కలిగిన మేజర్‌ గ్రామ పంచాయతీల వరకు నిధుల కొరత తో రోజు జరగవలసిన పనులకు ఆటంకం ఏర్పడుతుంది. కాంగ్రెస్‌ పార్టీకి గ్రామ స్థాయిలో పట్టు లేదని ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు రావడం లేదని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఫిబ్రవరి నెల నుండి గ్రామాలలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. గ్రామాలలో ప్రతినెల చేయాల్సిన పనులకు 6 నెలలుగా పంచాయతీలకు నిధులు రాలేదు. నెలనెలా వడ్డీలకు అప్పులు తెచ్చి పంచాయతీ కార్యదర్శులు ఖర్చు చేస్తున్నారు. పీఎస్‌లకు వేల రూపాయలు సొంతంగా పెట్టామని ఎంపీడీ వోలకు వినతి పత్రాలు ఇచ్చి మొర పెట్టుకుంటున్నారు.ఇప్పటికే ఒక్కో చిన్న జీపీకి రూ. 60 వేలపైనే ఖర్చు పెద్ద జీపీలకు రూ.లక్షల్లోనే ఖర్చు చేసిన కార్యదర్శులు గ్రామాలకు చుట్టం చూపులా వచ్చి వెళ్తున్న ప్రత్యేకాధికారులు ఆర్థిక భారమంతా పంచాయతీ కార్యదర్శులపైనే పడు తుంది.. గ్రామ పంచాయతీలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడు తున్నాయి. గ్రామంలోని చిన్న చిన్న సమస్యలను తీర్చాలాంటే జీపీల్లో రూపాయి బిళ్ళ లేదు. 5 నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు లేవు.
పంచాయతీల్లో పడకేసిన పాలన….
కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతి జీపీకి పంచాయతీ కార్యదర్శిని నియమించింది. గ్రామాలలో నిత్యం అభివద్ధి పనుల కోసం నెలనెలా పల్లెప్రగతి ద్వారా ప్రత్యేక నిధులు విడుదల వస్తేనే రంగాల్లో అభివద్ధి చెందాయి. గ్రామానికి వచ్చే ప్రత్యేక నిధులతో పాటు ఇతర అభివద్ధి నిధులతో గ్రామాల్లో అనేక అభివద్ధి పనులు జరుగుతాయి. మొక్కల పెంపకం, పారిశుధ్య నిర్వహణ, ఇంటింటా చెత్త సేకరణ పక్కాగా చేపట్టేవారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటుతున్నా గ్రామాలకు రూపాయి నిధులు విడుదల చేయలేదు. దీంతో పంచాయతీల్లో పాలన పడకేసింది. పంచాయతీ పారిశుధ్య సిబ్బందికి వేతనాలు రావడం లేదు. 2023 ఏడాది నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన గ్రాండ్స్‌ ఆపేసింది అప్పటి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నుండి ప్రతి గ్రామానికి రెండు లేక మూడు నెలలకు ఒకసారి గ్రాండ్స్‌ విడుదల చేసేది. ఈ డబ్బుల నుండి పాలకవర్గం చేసిన తీర్మానాలను గ్రామాలలో అమలు జరుగుతాయి. జనవరిలోని సర్పంచ్‌ల పదవీ కాలం ముగియడంతో గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. గడచిన 6 నెలలుగా కార్యదర్శులు ఖర్చు చేసి స్థానిక పనులు అరాకొరగా చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులపై ఆర్థిక భారం పడుతుంది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామ స్థాయిలో ఏ చిన్న మీటింగ్‌ జరిగినా పంచాయతీ కార్యదర్శులే జేబు నుంచి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలోని చిన్న చిన్న అవసరాలు తీర్చాలంటే వారే సొంతంగా డబ్బులు సమకూర్చాలిస పరిస్థితి ఉంది. గ్రామాల్లో ప్రధానంగా ఇంటింటా చెత్త సేకరణకు ట్రాక్టర్‌ను గ్రామంలోకి పంపాలంటే దానికి డీజిల్‌ పోయించాల్సి ఉంటుంది. ఒక్క చిన్న గ్రామ పంచాయతీకి లెక్కకట్టినా నెలకు ఎంత లేదన్నా డీజిల్‌కు రూ. 20వేల పైనే ఖర్చు అవుతున్నది. చెత్త సేకరణకు ట్రాక్టర్‌ను పంపకపోతే గ్రామం అంతా కంపు కొడుతుంది. గ్రామంలో పారిశుధ్య పనుల నిర్వహణ, బోర్ల రిపేరు, తాగునీటి పైప్‌ల రిపేరు, పైప్‌లైన్‌ లీకేజీ, వీధిదీపాల నిర్వహణ, తాగునీటి ఎద్దడి ఏర్పడితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, ఇలా ఎన్నో పనులు గ్రామాల్లో చూసుకోవాల్సి వస్తున్నదని పంచాయతీ కార్యదర్శులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఐదు నెలలుగా పంచాయతీ కార్యదర్శులు కొందరు తమ వేతనాల నుంచి, మరికొందరు వ్యాపారుల వద్ద వడ్డీలకు అప్పలు తెచ్చి గ్రామ సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపుతున్నారు.ఒకవేళ డబ్బులు లేవు అని %ౌ%సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వం నుంచి, ఉన్నత స్థాయి అధికారుల నుంచి వేధింపులకు గురికావాల్సి వస్తున్నదని, తమను ఎక్కడ సస్పెన్షన్‌ చేస్తారేమోనని పంచాయతీ కార్యదర్శులు భయపడుతున్నారు. దీంతో సొంతంగా డబ్బులు ఖర్చుచేసి గ్రామాల్లో అవసరాలను తీర్చుతున్నారు. ఒక్కో చిన్న గ్రామ పంచాయతీ కార్మదర్శి ఇప్పటికే రూ. 60 నుంచి 80 వేలు సొంతగా ఖర్చు చేశాడు. మేజర్‌ గ్రామ పంచాయతీల్లో రూ.లక్షల్లోనే ఖర్చు పెట్టినట్లు తెలుస్తున్నది. తమకు వచ్చిన జీతం గ్రామాలకు పెట్టుకుంటా పోతే తమ కుటుంబాలు పోషణ ఎలా గడిచేది ..? అని పంచాయతీ కార్యదర్శు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించాలని వారు కోరుతున్నారు.
మాజీలు చేసిన పనులు లక్షలలో బకాయి ?
గత టిఆర్‌ఎస్‌ పాలనలో ప్రభుత్వం నిర్దేశించిన అభివద్ధి పనులకు గ్రామ సర్పంచులు సొంత డబ్బులు ఖర్చు చేసి చేశారు. గత ప్రభుత్వం సర్పంచులను పూర్తిగా విస్మరించిందని, ఎంపీటీసీల వ్యవస్థను పూర్తిగా నిర్వర్యం చేసిందని , జడ్పీటీసీలకు పని లేకుండా చేసిందని అప్పటి నాయకులు అనేక వేదికలపై తమ ఆవేదన వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వ నాయకులు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు అంచల ప్రజా పాలనను తప్పకుండా గౌరవించి అభివద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పినారు. అక్కడక్కడ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు, కూలీ పనులు చేసిన దశ్యాలు ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి.చిన్న గ్రామపంచాయతీ మొదలుకొని పెద్ద గ్రామపంచాయతీ వరకు మాజీ సర్పంచులు చేసిన పనులకు ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు లక్షలలో ఉన్నాయి. ఇప్పటికీ ఆ నాయకులు ప్రభుత్వ కార్యాలలో చుట్టూ తిరుగుతున్నారు. ప్రజా ప్రభుత్వం పై కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి మొదలుకొని కిందిస్థాయి నాయకుల వరకు చర్చ మొదలయింది.ముఖ్యమంత్రి రివ్యూ చేస్తూ బీసీ కమిషన్‌ నివేదిక ప్రకారం ఓటర్‌ లిస్ట్‌ తయారు చేయాలని అనుకున్న సమయం కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. అది కూడా సెప్టెంబర్‌ లేక అక్టోబర్‌ నెలలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆలోచనలు ప్రభుత్వ ఉన్నట్లు తెలుస్తుంది. మరింత ఆలస్యం అవుతే 16వ ఆర్థిక సంఘం నిధులు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నిధులు లేక గ్రామాల్లో మరింత సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. సాధ్యమైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.

Spread the love