– ఇప్పటి వరకు 77 శాతమే వసూలు
– శతశాతం దిశగా శ్రమిస్తున్న కార్యదర్శులు.
నవతెలంగాణ-మల్హర్ రావు:
గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే నిధులు ఎంత కీలకమో, గ్రామపంచాయతీల్లో వసూలయ్యే పన్నులు అంతే అవసరం. అయితే ఏడాదిగా ఎస్ఎఫ్సీ, 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల పూర్తిగా నిలిచిపోయింది.దీంతో జీపీలు ఆర్థికంగా సతమతమవుతున్నాయి. గ్రామాల్లో సమస్యలు పరిష్కరించుకోవాలంటే పన్నులే ప్రధాన ఆదాయ వనరు. ఇన్నాళ్లు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలతో బీజీగా గడిపిన పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం పన్ను వసూళ్లపై దృష్టి సారించారు. ఉదయం 8 గంటలకే గ్రామాలకు చేరుకుంటున్నారు. సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్ల లక్ష్యం (బకాయిలతో కలిపి) రూ.28,98,999 లక్షలు ఇందులో ఇప్పటి వరకు వసూలైంది రూ.22,50,057 అంటే 77 శాతం మాత్రమే. ఆర్థిక సంవత్సరం మరో 20 రోజుల్లో ముగియనుంది. గడువులోపు శతశాతం లక్ష్యసాధన కోసం కార్యదర్శులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
సర్వేల ప్రభావం..
గ్రామ పాలనలో పంచాయతీ కార్యదర్శులదే కీలక పాత్ర. వీరంతా మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రజాపాలన, ఇందిరమ్మ ఇళ్ల సర్వే ల్లో బీజీబీజీగా గడిపారు. ఫలితంగా పన్నుల వసూళ్లపై ఈ ప్రభావం పడింది. ఇప్పటికే 90 శాతానికి పైగా వసూలు కావాల్సి ఉండగా కేవలం 77 శాతానికి పరిమితం కావడం గమనార్హం. ఇన్నాళ్లు సర్వేల్లో బీజీగా గడిపిన కార్యదర్శులు ప్రస్తుతం పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. మండలంలో 15 గ్రామ పంచాయతీలుండగా,ఇందులో దుబ్బపేట జీపీ మాత్రమే ఇప్పటికే వందశాతం పన్ను వసూలు చేసి ఆదర్శంగా నిలిసింది..
లక్ష్యాన్ని చేరుకునేలా ముందుకు సాగుతున్నాం..విక్రమ్ కుమార్ …ఎంపిఓ
వివిధ సర్వేలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమల్లో భాగంగా మొన్నటి వరకు పంచాయతీ కార్యదర్శులు బీజీబీజీగా ఉండటం ద్వారా పన్నుల వసూళ్లకు అవరోధం ఏర్పడింది. ప్రస్తుతం వారంతా లక్ష్యసాధనపై దృష్టి సారించారు. ప్రతీ పంచాయతీలో వంద శాతం వసూలు చేయాలని ఇప్పటికే ఆదేశించాం. ఆదిశగా ముందుకు సాగుతున్నాం.
మండలంలో వసూలు ఇలా….
మండలంలో మొత్తం 15 జిపిల్లో వసూలు లక్ష్యం… రూ.28,98,999 చేయాలి.ఇప్పటి వరకు చేసింది..రూ.22,50,057.ఇంకా చేయాల్సింది….రూ.6,48,942 లక్షలు.తాడిచెర్లలో….68 శాతం, మల్లారంలో 72 శాతం,పెద్దతూoడ్లలో 85 శాతం,చిన్నతూoడ్లలో 88 శాతం, అడ్వాలపల్లిలో 88 శాతం,కొండంపేటలో 84 శాతం,వళ్లెంకుంటలో 77 శాతం,మల్లంపల్లిలో 91 శాతం, కొయ్యుర్ లో 75 శాతం, ఇప్పలపల్లిలో 73 శాతం, ఆన్ సాన్ పల్లిలో 81 శాతం, నాచారంలో 94 శాతం,రుద్రారంలో 81 శాతం,దుబ్బపేటలో 100 శాతం,ఎడ్లపల్లిలో 98 శాతం పూర్తి అయ్యాయి