– డిప్యూటీ సీఎం భట్టికి మెడికల్ కాలేజీల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పెండింగ్ స్కాలర్‌షిప్ బకాయిలు ఇప్పించాలని తెలంగాణ ప్రయివేట్ మెడికల్, నర్సింగ్ కళాశాలల యజమాన్యాల యూనియన్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేసింది. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో యూనియన్ సభ్యులు ఆయనను కలిసి వినతి పత్రం అందించారు. త్వరలోనే చెల్లింపుల ప్రక్రియను ప్రారంభిస్తామని భట్టి ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. చెల్లింపుల్లో పారదర్శకంగా వ్యవహరిస్తామనీ, పైరవీలకు తావులేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం బకాయిలను చెల్లించక పోవడంతో ప్రభుత్వంపై భారం పడిందని వివరించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతున్నదని గుర్తు చేశారు. భట్టిని కలిసిన వారిలో కళాశాలల యూనియన్ ప్రతినిధులు మోహన్ రెడ్డి, శ్రీనివాస్, డాక్టర్ సంధ్య, అపర్ణరెడ్డి తదితరులు ఉన్నారు.