– నేడు వికలాంగుల మహాధర్నా
– హాజరుకానున్న వివిధ రాజకీయ పార్టీలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘వికలాంగులకు పింఛన్‌ను పెంచాలి. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి. వారి సమస్యలను పరిష్కరించాలి’ అనే డిమాండ్‌పై మంగళవారం హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్టు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ) తెలిపింది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌తోపాటు సీపీఐ(ఎం), సీపీఐ, టీడీపీ, టీజేఎస్ పార్టీల నేతలు తమ సంఘీభావాన్ని ప్రకటించనున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య తెలిపారు. రూ.ఆరు వేలకు పింఛన్‌ను పెంచాలని వారు డిమాండ్ చేశారు. వృద్ధులు, వితంతువుల పెన్షన్ రూ.నాలుగు వేలకు పెంచుతామని చెప్పిన హామీ అమలు కావటం లేదని గుర్తు చేశారు. అధికారంలోకొచ్చి ఏడాదైన సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్న ప్రభుత్వానికి వికలాంగు లక్చిన హామీలు అమలు చేయాలనే ధ్యాస ఎందుకు లేదని ప్రశ్నించారు. పింఛన్ పెంచకుంటే..పెరిగిన ధరలను తట్టుకుని వికలాంగులు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఈ విషయంలో సర్కారు కాలయాపన చేయటం తగదని హితవు పలికారు. పెన్షన్ పెంపు కోసం 44 లక్షల మంది ఆసరా లబ్దిదారులు, కొత్త పింఛన్ మంజూరు కోసం 24.85 లక్షల మంది ఎదురుచూస్తున్నారని తెలిపారు. వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో 34 ఇచ్చిందనీ, దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. వికలాంగుల సంక్షేమ శాఖను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయా జిల్లాల్లోని వికలాంగుల శాఖలో ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాల్లో శారీరక వికలాంగుల రోస్టర్‌కి 10ను తగ్గించాలని కోరారు. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు రూ. 25వేలు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను గుర్తించి, వాటి భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. వికలాంగులకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. వికలాంగుల చట్టాలు అమలు చేయాలనీ, జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ వికలాంగులకు స్వయం ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న నైబర్ హుడ్ సెంటర్‌ను బలోపేతం చేసి, అందులో పని చేస్తున్న సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లను అమలు చేయడానికి అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సంక్షేమానికి బడ్జెట్‌లో 5శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సదరం సర్టిఫికెట్లు రిజెక్టైన వారికి సర్టిఫికెట్లు పునరుద్ధరించాలని కోరారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంతో పాటు నేషనల్ ట్రస్ట్, నేషనల్ పాలసీ, 2017మెంటల్ హెల్త్ కేర్ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు