స్కామ్‌ల ప్రభుత్వం పోయి.. స్కీమ్‌ల ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు
సిగాచి మృతులకు నమ్మకద్రోహం చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే..
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు
నవతెలంగాణ-పటాన్‌చెరు
అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయిందని, స్కామ్‌ల ప్రభుత్వం పోయి మళ్లీ సంక్షేమ పథకాల ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. సర్, బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అంశాలపై పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు గడువు ఉన్నప్పటికీ.. పటాన్‌చెరు బీఆర్‌ఎస్ నాయకులు అందించిన స్వాగతం మరిచిపోలేనన్నారు. పటాన్‌చెరు అడ్డా బీఆర్‌ఎస్ గడ్డ అని ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రారంభించిన ఎస్‌ఐఆర్ (సర్) ప్రక్రియపై పార్టీ నాయకులు, ఆశావహులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నాయకులు సర్‌ను సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.30 వేల కోట్ల విలువైన భూములను విక్రయించిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. సిగాచి ప్రమాదంలో 54 మంది మృతి చెందినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదని, కంపెనీ యాజమాన్యమే పరిహారం చెల్లించిందని తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పటాన్‌చెరు పట్టణంలో రూ.200 కోట్లతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించడం రాష్ట్రప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. పటాన్‌చెరులో ఐటీ పార్క్ కోసం కేటాయించిన భూమిని ప్రభుత్వం విక్రయించిందని ఆరోపించారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాలను బీఆర్‌ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ మాజీ చైర్మెన్ బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బీఆరఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌పై ప్రజల్లో నమ్మకం పోయింది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



