ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి
చేరుతున్న గోదావరి జలాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 లక్షల ఎకరాల సాగు నీటికి ప్రయత్నాలు
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నవతెలంగాణ-ధర్మసాగర్
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొనసా గుతుందని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి చేరుతున్న గోదావరి జలాలకు పసుపు కుంకుమలు సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ఉమ్మడి వరంగల్ జిల్లా వరప్రదాయినిగా మారిందని తెలిపారు. 2003లో ఉమ్మడి రాష్ట్రంలో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తాను నాటిన చిన్న మొక్క నేడు మహా వృక్షంగా ఎదిగి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6లక్షల ఎకరాలకు సాగు, తాగు నీరు అందిస్తోందని అన్నారు. తన రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చింది దేవాదుల పథకమేనని తెలిపారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలే వేసుకోవాలని, ఒకవేళ వరి సాగు చేయాల్సి వస్తే ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి పాటించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకొని రైతులు సహకరించాలని కోరారు. దేవాదుల ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని దేవాదుల పంపింగ్‌ను నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు. నేటి నుంచి నెల రోజులపాటు నిరంతరాయంగా దేవాదులలోని అన్ని ఫేజ్‌ల ద్వారా పంపింగ్ జరుగుతుందని అన్నారు. ఈ నెల రోజుల్లో ధర్మసాగర్, స్టేషన్ ఘనపూర్, నవాబ్ పేట, అశ్వరావుపల్లి, చిటకోడూరు, బొమ్మకూరు రిజర్వాయర్లు నింపే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్టు వెల్లడించారు. రైతులు పంట సాగు చేసుకోవడానికి 15రోజుల్లో కాలువల ద్వారా సాగు నీరు విడుదల చేస్తామని తెలిపారు. ప్రభుత్వానికి, నీటి పారుదల శాఖ అధికారులకు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఈ సుధీర్, ఎసఈ సీతారాం, జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మారుజోడు రాంబాబు, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ చైర్మెన్ తాటికొండ వినయ్ కుమార్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నీటి పారుదల శాఖ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



