– దరఖాస్తుల కోసం జనం పడిగాపులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమానికి మొదటి రోజు జనం పోటెత్తారు. ఉదయం నుంచే గ్రామ, వార్డు సభల వద్ద ప్రజలు బారులు తీరారు. చాలా ప్రాంతాల్లో అనుకున్న స్థాయిలో దరఖాస్తులు అందుబాటులో లేక ఇబ్బందులు తలెత్తాయి. ఇదే అవకాశంగా తీసుకున్న కొంతమంది దళారులు, జీరాక్స్ సెంటర్ల యజమానులు దరఖాస్తు ఫారాలను బ్లాక్‌లో విక్రయించారు. ఒక్కో ఫారంను రూ.50 నుంచి రూ.100 రూపాలకు అమ్మారు. చాలా కౌంటర్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని పట్టించుకునే వారు లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో పేదలు వాటినే కొనుక్కున్నారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, చందానగర్ తదితర ప్రాంతాల్లో సహనం కోల్పోయిన ప్రజలు ఆందోళనకు దిగారు. దరఖాస్తులో ప్రభుత్వం నిర్దేశించిన రైతు భరోసా, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రేషన్ కార్డులు కాకుండా ఇతర సమస్యలపై కూడా ప్రజలు ఆర్జీలు సమర్పించారు.