స్థూప దీపం

pillar lampఅడవీ మార్గంలోనో ఖాళీ మైదానాల్లోనో
అభయాన్ని ప్రకటిస్తూ నిలబడ్డ
ఎర్రటి స్థూపాల్ని చూసినపుడల్లా
ప్రాణాలను విడిచినా
కవచాలను వెనుక నడిచే వార్కి దాచి యిచ్చే వీరుల్లా కనిపిస్తాయి

గోడలకు నోటినీ గాలికి గొంతునీ
అవసరాలకు చేతుల్నీ
వీరులకు చేతల్నీ యిచ్చి
బతుకును పసితనంతో నింపి
తలొంచని అమాయకత్వంలోనే
సిద్ధాంతాలు గుర్తుకొస్తాయి.

ఆయుధాలు వట్టిపోయి వెక్కిరించినా
తానే ఆయుధమై
ఊపిరి జెండా ఎగరేస్తాడు
వర్తమాన పతనానికి చింతించినా
రేపటి ఆకాశానికి వేగుచుక్కవుతాడు

రెండు గుండె చప్పుళ్లను
తనలో వినే అమ్మలాంటి
కోట్లాది జీవ స్పందనల
నేలతల్లి కోసం

దు:ఖాన్ని మోసుకిస్తున్న కాలం కడుపులో ఉద్యమాలను మోస్తున్న అమ్మలు
చేతిలో తుపాకులున్నా
గుండె లోతుల్లో పూలగుత్తుల్ని దాచుకున్నందుకేనేమో
ప్రవహించే వెన్నెలై
ప్రతి క్షణాన్నీ వసంతాన్ని చేయాలనుకుంటాడు

కాలం గ్రీష్మమైనపుడు
అతనొక గొడుగై నిల్చుంటాడు
కూలిన దేహాల నిధులే
చరిత్ర గుర్తులే స్థూపాలై మొలుస్తాయి.

స్థూపాలు భౌతిక నిర్మాణాలు కాదు
ఆశయాల త్యాగాలతో నిర్మించినవవి

దీపస్తంభంలా నిలబడ్డ స్థూపమ్మీది
చిరునామాలో
అర్ధరాత్రి బుద్ధుడై యిల్లొదిలినప్పటి
గాజు కళ్ల మెరుపుతో
అమ్మ బేల ముఖం
గుచ్చుకుంటూనే వుంటుంది

దు:ఖపు లోతు పెరిగేకొద్దీ
మనిషి శిఖరమై నిలుస్తాడు
పోరాటంలో పరాధీనమైనా
వీరుని నెత్తురు దట్టించిన ఫిరంగవుతుంది.

అతని ప్రతి మాటా మనస్సే
ప్రతి చేతా తపస్సే !

శిక్షించడానిక్కాకుండా న్యాయాన్ని
తేల్చే వ్యవస్థలుండాలి
గడ్డకట్టిన వెన్నెల్లోనో
కరుగుతున్న గ్రీష్మంలోనో
కన్నీటి బొట్టు మీద ఆవిరౌతున్న జ్ఞాపకం

ఒక బతుకు కల కోసం
ప్రతి తల్లీ సూర్యుణ్ని కనాలి
ఆ శిశువుతోనే ప్రపంచం
మళ్లీ కొత్తగా పుడుతుంది.
– ర్యాలి ప్రసాద్‌, 9494553425

Spread the love