– టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలి
– మండలాల్లో అవసరమైన మేర బృందాలను రూపొందించాలి
– మార్చి 31 లోపు ఎల్.ఆర్.ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ
– ఎల్.ఆర్.ఎస్ పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్
నవతెలంగాణ – సిరిసిల్ల
ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను మార్చి చివరి లోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఎల్.ఆర్.ఎస్ పై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్.ఆర్.ఎస్ 2020 క్రింద 42 వేల 942 దరఖాస్తులు రాగా 23 వేల 515 దరఖాస్తులు ఆమోదించామని,1230 దరఖాస్తులు తిరస్కరించామని అన్నారు. ప్రస్తుతం ఎల్ 1 వద్ద 6776 దరఖాస్తులు, ఎల్ 2 వద్ద 385 , ఎల్ 3 వద్ద 76 పెండింగ్ ఉన్నాయని, వీటిని మార్చి చివరి నాటికి పరిష్కరించాలని అన్నారు. ఎల్.ఆర్.ఎస్ స్క్రూటినీ పూర్తి చేసుకుని ఆమోదించిన దరఖాస్తుదారుల ను ఫాలో అప్ చేయాలని అన్నారు.జిల్లాలో 23 వేల 515 దరఖాస్తులు రుసుం చెల్లింపు కోసం ఆమోదిస్తే ఇప్పటి వరకు 184 మాత్రమే ఫీజు చెల్లించారని, మిగిలిన దరఖాస్తుదారులు మార్చి 31 లోపు రుసుం చెల్లించి ప్రభుత్వం అందించే 25 శాతం రాయితీ వినియోగించుకునేలా చూడాలని అన్నారు. పెండింగ్ ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల స్క్రూటినీ కోసం అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి బృందంలో నీటి పారుదల శాఖ అధికారి, రెవెన్యూ అధికారి, టౌన్ ప్లానింగ్/ పంచాయతీ కార్యదర్శి ఉండాలని అన్నారు. మండలంలో అవసరమైన మేర లాగిన్ అందించడం జరుగుతుందని, అవసరమైన బృందాలను ఏర్పాటు చేసుకొని ప్రతి రోజూ ఎన్ని దరఖాస్తుల స్క్రూటినీ జరుగుతుందో లక్ష్యాలు నిర్దేశించుకోవాలని అన్నారు. భూ క్రమ బద్ధీకరణలో భాగంగా ప్రభుత్వ భూములలో, నీటి వనరుల ఎఫ్.టి.ఎల్, బఫర్ జోన్లలో క్రమబద్ధీకరణకు అనుమతించి నట్లయితే పెద్ద పొరపాటు అవుతుందని, ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ధృవీకరణ చేయాలని, బృందంలో ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తును పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. భూ క్రమబద్ధీకరణ లో ఎక్కడైనా అవతవకలకు పాల్పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం మండలాల వారిగా కలెక్టర్ సమీక్షించి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టిన చర్యల గురించి రివ్యూ చేశారు. ఈ సమావేశంలో డిపిఓ శేషాద్రి, ఆన్సర్ ఎంపిడిఓలు ,తహసిల్దార్లు, నీటి పారుదల శాఖ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.