ప్రపంచ పర్యావరణానికి ప్లాస్టిక్ తీవ్ర హాని కలిగిస్తున్నది. ప్రజారోగ్యాన్ని కూడా ప్రమాదంలో పడేస్తున్నది.మానవ జీవితాల్లోకి శరవేగంగా చొచ్చు కొస్తున్నది. ఇప్పుడు మనిషి మనుగడే ఒక ప్రశ్నార్థకంగా మారింది. అందుకు గాను ఇంగ్లాండులోని లీడ్స్ యూని వర్సిటీ పరిశోధకులు గత సంవత్సర అధ్యయాన్ని పరిశీలిస్తే వాస్తవాలు వెల్లడవుతాయి. ‘ప్రపంచంలో యేటా 25.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ తయారవుతుంది. ఇలా పుట్టుకొచ్చిన ప్లాస్టిక్ వ్యర్ధాల నియంత్రణ, సమర్థ నిర్వహణకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కనబరచడం లేదు.దీంతో ప్లాస్టిక్ కాలుష్యంతో ముంచి వేయటంలో అన్నిదేశాల కంటే మనదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది!’ అని ప్రఖ్యాత నేచర్ జర్నల్ తాజా అధ్యయనం పేర్కొంది. ఇలా మన తర్వాత స్థానాల్లో నైజీరియా, ఇండోనేషియా, ఆ పాపాన్ని పంచుకుంటున్నా యని, ఈ అధ్యయనాన్ని నిర్వహించిన లీడ్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు.ఈ ప్లాస్టిక్ మానవాళికే కాకుండా ఇతర జంతుజాలానికీ, పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమిస్తుంది. ఈ పాపంలో మన వాటా ఎక్కువగా ఉన్నందున తగ్గించుకోవడానికి మనమేం చేయాలో ఆలోచించుకోవాల్సిన తరుణమిది.ఈ అధ్యయనం మేరకు ఏటా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్‌లో 5.2 కోట్ల టన్నులకు పైగా సరైన నిర్వహణ లేక బహిరంగ ప్రదేశాల్లో కాల్చివేయటం లాంటి చర్యల ద్వారా వాతావరణంలో కలిసిపోతుంది. ఇలా అనాలోచితంగా బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ను కాల్చడంతో విషతుల్యమైన కార్బన్ మోనాక్సైడ్ లాంటి వాయువులు గాలిలో కలుస్తున్నాయి. ఇవి గుండె జబ్బులకు, శ్వాసకోశ వ్యాధులకు, క్యాన్సర్ లాంటి ప్రాణాంతకాలకు, నరాల సమస్యలకు దారితీస్తున్నాయి. అలాగే మితిమీరిన ప్లాస్టిక్ వినియోగంతో మనకు తెలియకుండానే సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు (మైక్రో ప్లాస్టిక్స్) మనల్ని అన్ని వైపులా ఆవహిస్తున్నాయి. పర్వతాలు, అడవులు, రిజర్వాయర్లు, నదులు, సముద్రాల్లో ఇవి చేరి పోతున్నాయి.ఇలా మనం తినే తిండి నుంచి పీల్చే గాలిలో, తాగే నీటిలోనూ ఉంటున్నాయి.
ప్రతి గంటకు సగటున మనం గాలి ద్వారా 11.3 ప్లాస్టిక్ సూక్ష్మ రేణువులు పీల్చుకునే ప్రమాదంలో ఉన్నాము. అంతేకాకుండా పర్యావరణంలోకి ప్రవేశించే ప్లాస్టిక్ కాలుష్య భూతం అత్యంత ఎత్తయిన ఎవరెస్టు నుంచి అత్యంత లోతైన మరియానా ట్రెంచ్ దాకా ప్రతి చోటును ఆవహిస్తోంది. గమ్మత్తేమంటే ప్రపంచంలో అత్యంత అధికంగా ప్లాస్టిక్ ఉత్పత్తి చేసేవి ధనిక దేశాలు. కానీ వాటిలో ఒక్కటి కూడా టాప్ తొంభై కాలుష్యకారక దేశాల జాబితాలో లేవు. సుమారు 69 శాతం ప్రపంచ ప్లాస్టిక్ కాలుష్యం కేవలం ఇరవై దేశాల నుంచి వస్తోంది.ఇవన్నీ అబివృద్ధి చెందుతున్న,పేద దేశాలే కావడం గమనార్హం!.ధనిక దేశాల్లో ప్లాస్టిక్ వ్యర్ధాల సేకరణ వాటి నిర్వహణ సమర్థంగా సాగుతుండటమే ఇందుకు కారణంగా అధ్యయనం అభిప్రాయపడుతున్నది. భారత దేశంలో యేటా 58 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ను కాలుస్తున్నారు. మరో 35 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ను పర్యావరణంలోకి (భూమి,నీరు,గాలిలోకి) వదులుతున్నాం. మొత్తంగా ఏడాదిలో సుమారు 90 లక్షల టన్నులకు పైగా ప్లాస్టిక్ భూతాన్ని ఈప్రపంచంమీదికి వదులుతున్నాం.నైజీరియా(35 లక్షల టన్నులు), ఇండోనేషి యా(34 లక్షల టన్నులు), చైనా (28 లక్షల టన్నులు) మన తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచంలోనే మిగిలిన రంగాల మాదిరిగానే ప్లాస్టిక్ కాలుష్యంపై కూడా ధనిక దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన భిన్నంగా ఉంది.ప్లాస్టిక్ వ్యర్ధాల నియంత్రణ, నిర్వహణ సరిగ్గా చేయడం ప్రధానమని ధనిక దేశాలు వాదిస్తుండగా.. ప్లాస్టిక్ ఉత్పత్తిని, వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయాలు వెతకాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటున్నాయి.
ఆ మధ్య మనదేశ అత్యున్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తపరచినట్లు.. మనం ప్రస్తుతం ‘ప్లాస్టిక్ బాంబుపై’ కూర్చున్నాం!.ఆ మహమ్మారిని కట్టడిచేయడంలో విఫలమైతే అణ్వస్త్రాలను మించిన ముప్పును భావితరాలు ఎదుర్కోక తప్పదు. ఇంతటి దుర్భర దుస్థితి దాపురించకూడదంటే? ఎవరికి వారు ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత మేరకు తగ్గించాలి.సంబంధిత వ్యర్ధాల సద్వినియోగం పట్ల పాలకులు ప్రతి ఒక్కరూ నేను సైతం అంటూ సామాజిక బాధ్యతతో శ్రద్ధ వహించాలి. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ తీవ్రత దృష్ట్యా ప్లాస్టిక్ భూతానికి ముగింపు పలికేందుకు జరిగిన అంతర్జాతీయ ఒప్పంద రూపకల్పనకు 170కి పైగా దేశాలు చర్చలు జరిపాయి.కానీ ఏకాభిప్రాయం కుదరలేదు?.ఆ ఒడంబడిక చిత్తశుద్ధితో ఎంత త్వరగా సాకారమైతే ప్రపంచ జీవజాతుల, మానవ మనుగడకు అంతమంచిది. ప్రమాదకర ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపై పరిశోధనలకు చేయూతనివ్వాలి. ప్లాస్టిక్ వ్యర్ధాలతో రోడ్ల నిర్మాణం ద్వారా ఖర్చు తగ్గిస్తూనే, నాణ్యతను పెంచవచ్చనే విదేశాల అనుభవాలతో పాఠం నేర్చుకోవాలి. ప్లాస్టిక్ వ్యర్ధాలతో డీజిల్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తే, వ్యర్థాలను సంపద సృష్టికి వినియోగించుకోవచ్చు. ఇలా ప్లాస్టిక్ నియం త్రణ నియమాలన్నీ సక్రమంగా అమలయ్యేలా చూడాలి. దాని వాడకం వల్ల కలిగే సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి.ప్రపంచ,దేశీయ పాలకులు,పాలితులు చిత్తశుద్దితో కంకణ బద్దులైతేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి.
మేకిరి దామోదర్
9573666650