ఆస్ట్రేలియా పిచ్‌లపై అమెరికాలో ఆట!

ఆస్ట్రేలియా పిచ్‌లపై అమెరికాలో ఆట!– టీ20 ప్రపంచకప్‌లో డ్రాప్‌ ఇన్‌ పిచ్‌ల వినియోగం
– ఆధునిక పిచ్‌లపై క్రికెటర్ల మిశ్రమ స్పందన
ఆస్ట్రేలియా పిచ్‌లపై అమెరికాలో ఆట!. అవును మీరు చదివింది నిజమే. 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్న అమెరికా.. మెగా టోర్నీ ముంగిట న్యూయార్క్‌లో స్టేడియం నిర్మించింది. న్యూయార్క్‌ స్టేడియంలో క్యూరేటర్లు పిచ్‌ను తయారు చేయలేదు. ఆడిలైడ్‌లో తయారు చేసిన ‘డ్రాప్‌ ఇన్‌’ పిచ్‌లను తీసుకొచ్చి న్యూయార్క్‌ స్టేడియంలో అమర్చారు. ఈ తరహా పిచ్‌ల వినియోగంపై చర్చ నేపథ్యంలో డ్రాప్‌ ఇన్‌ పిచ్‌ గురించిన వివరాలు..
నవతెలంగాణ క్రీడావిభాగం
డ్రాప్‌ ఇన్‌ పిచ్‌ అంటే?
డ్రాప్‌ ఇన్‌ పిచ్‌ అర్థం పేరులోనే ఉంది. పిచ్‌లను తయారు చేసి అవసరమైన వేదికలకు పంపిస్తారు. భారీ క్రేన్ల సహాయంతో పిచ్‌ను మైదానంలో అమర్చుతారు. మ్యాచ్‌ లేదా టోర్నమెంట్‌ అనంతరం తిరిగి డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లను తీసుకెళ్తారు. తాత్కాలిక ఏర్పాటు, అవసరం కోసం డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లను వినియోగిస్తారు.
కృత్తిమ పిచ్‌లు అనొచ్చా?
డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లు ఏమాత్రం కృత్తిమం కాదు. సహజసిద్ధంగా తయారు చేసిన పిచ్‌లతో సమానం. ఎర్ర, నల్ల మట్టి లేదా మిశ్రమంతో తయారు చేసిన పిచ్‌పై సహజమైన పచ్చికను పెంచుతారు. ఇది పూర్తిగా సహజసిద్ధమైనది.
ఎలా తయారు చేస్తారు?
సాధారణంగా డ్రాప్‌ ఇన్‌ పిచ్‌ కొలతలు 24 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు, 20 సెంటీమీటర్ల లోతు. తొలుత ఈ కొలతలతో స్టీల్‌ ఫ్రేమ్‌ రూపొందిస్తారు. అనంతరం మట్టితో పిచ్‌ను తయారు చేసి ఆపై లేయర్‌లో పచ్చికను పెంచుతారు. ఈ పిచ్‌ను మైదానంలో ముందుగానే తయారు చేసిన కాంక్రీట్‌ స్లాబ్‌లో అమర్చుతారు. సాధారణ పిచ్‌లను తయారు చేసిన విధానంలో డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లను సిద్ధం చేస్తారు.
అవసరం ఏంటీ?:
డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లు ఇప్పుడొచ్చిన టెక్నాలజీ కాదు. గత ఐదేండ్లుగా క్రికెట్‌ సర్క్యూట్‌లో చర్చ నడుస్తూనే ఉంది. న్యూయార్క్‌ వంటి క్రికెట్‌ సదుపాయాలు లేని స్టేడియం సహా మల్టీస్పోర్ట్స్‌కు ఆతిథ్యం ఇచ్చే స్టేడియం కోసం డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లను తీసుకొచ్చారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ అందులో ఒకటి. ఇక్కడ వేసవి సీజన్‌లో క్రికెట్‌ జరుగుతుండగా, ఆ తర్వాత ఫుట్‌బాల్‌ మ్యాచులు ఉంటాయి. టీ20 ప్రపంచకప్‌ కోసమే న్యూయార్క్‌లో డ్రాప్‌ ఇన్‌ పిచ్‌ను పెట్టారు. టోర్నీ ముగిసిన తర్వాత డ్రాప్‌ ఇన్‌ పిచ్‌ను సంబంధిత కంపెనీ తీసుకెళ్తుంది.
పిచ్‌ ఎలా స్పందిస్తుంది?
సాధారణ పిచ్‌ తరహాలో స్పందించేందుకు కాస్త సమయం పడుతుందని నిపుణుల మాట. వినియోగిస్తున్న కొద్ది గ్రౌండ్‌లో పిచ్‌ మరింత మెరుగ్గా కుదురుకుంటుంది. అప్పుడే సాధారణ పిచ్‌ల తరహాలో స్పందిస్తుంది. మెల్‌బోర్న్‌లో తొలుత ఈ పిచ్‌లు పేస్‌, బౌన్స్‌కు అనుకూలంగా లేవని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు న్యూయార్క్‌లో పిచ్‌ పేసర్లకు ఎక్కువగా అనుకూలిస్తుందని విమర్శిస్తున్నారు. మరికొన్ని మ్యాచులు జరిగితే పిచ్‌ సహజశైలిలో స్పందించేందుకు అవకాశం ఉంటుంది.
ఈ పిచ్‌ను ఎక్కడ చేశారు?
డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లను ఎక్కడైనా తయారు చేయవచ్చు. అవసరాలకు అనుగుణంగా తయారు చేసిన తర్వాత ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ప్రస్తుతం న్యూయార్క్‌ స్టేడియంలో అమర్చిన డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లను ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్‌లో సిద్ధం చేశారు. టీ20 ప్రపంచకప్‌ కోసం న్యూయార్క్‌కు తీసుకొచ్చి అమర్చారు. భారత్‌ గ్రూప్‌ దశలో తొలి మూడు మ్యాచులు ఈ పిచ్‌పైనే ఆడాల్సి ఉంది.

Spread the love