Wednesday, August 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేకే పిల్లల స్థలాల క్రమబద్ధీకరణపై వివరణ ఇవ్వండి

కేకే పిల్లల స్థలాల క్రమబద్ధీకరణపై వివరణ ఇవ్వండి

- Advertisement -

రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ – హైదరాబాద్‌

మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు కుమారుడు కె. వెంకటేశ్వరరావు, కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మికి అనుకూలంగా జారీ చేసిన స్థలాల క్రమబద్ధీకరణ ఉత్తర్వులపై ప్రభుత్వ వైఖరేంటో తెలపాలని రాష్ట్ర సర్కారును హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ వ్యవహారంపై సంబంధిత శాఖతో చర్చించి, అవసరమైతే గతంలో జారీ చేసిన క్రమబద్ధీకరణ ఉత్తర్వులను సవరించాలన్న కోర్టు ఆదేశాలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు మూడో తేదీకి వాయిదా వేసింది. కేశవరావు కుమారుడు, కుమార్తెకు చెందిన స్థలాలను క్రమబద్ధీకరిస్తూ 2023 మే 23న గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో 56ను సవాలు చేస్తూ సిద్ధిపేట జిల్లా కొండపాకకు చెందిన జి. రఘువీర్‌రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా అడ్వొకేట్‌ జనరల్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ వాదనలు వినిపిస్తూ.. ఇరుపక్షాల మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలను తీర్చుకునేందుకే ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని తెలిపారు. పిటిషనర్‌పై ఇప్పటికే దోపిడీ కేసు కూడా నమోదైందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ వైఖరిని తెలిపేందుకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని కోరారు. ఈ వాదనలపై స్పందించిన హైకోర్టు.. సంబంధిత శాఖ వివరణను రికార్డుల్లోకి తీసుకురావాలంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని గతంలో ఆదేశాలు జారీ చేసి దాదాపు తొమ్మిది నెలలు గడిచిందనీ, ఇప్పుడు మళ్లీ అదనపు గడువు కోరడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టినట్లుగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్‌ ఏదైనా చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడి ఉంటే ఆ వివరాలను కూడా అఫిడవిట్‌లో పేర్కొనాలని ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు ఇదే చివరి అవకాశమని పేర్కొంటూ తదుపరి విచారణను సెప్టెంబరు 3కు వాయిదా వేసింది.
భూదాన్‌ భూముల పరిరక్షణపై చర్యలేంటి? : హైకోర్టు
సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లోని సర్వే నెంబర్‌ 695లో ఉన్న భూదాన్‌ భూముల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర వివరాలు సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ సర్వే నెంబర్‌లో 11.24 ఎకరాల భూదాన్‌ భూమి ఉండగా అందులో 3.34 ఎకరాలను వ్యవసాయేతర భూమిగా మార్చి నివాస లేఅవుట్‌ అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ జంగం రమేశ్‌గౌడ్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం. మొహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ.. వ్యాపారవేత్త మల్లారెడ్డి భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. భూదాన్‌ భూములను నిషేధిత జాబితాలో చేర్చకుండా అధికారులు ప్రయివేటు వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న ధర్మాసనం రెవెన్యూ కమిషనర్, కలెక్టర్‌తోపాటు ప్రయివేటు ప్రతివాది మల్లారెడ్డికి నోటీసులు జారీ చేసింది. ముఖ్యకార్యదర్శి, సీసీఎల్ఏ, హెచ్ఎండీఏ తదితర ప్రతివాదులు మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
కుక్కల పెంపకానికి అనువైన వసతి వివరాలివ్వండి : పారిశ్రామికవేత్తకు హైకోర్టు ఆదేశం
కుక్కల సంరక్షణ కోసం అనువైన వసతిని ఏర్పాటు చేయాలనీ, ఆ వివరాలను తనిఖీ నిమిత్తం జీహెచ్ఎంసీకి వివరాలు అందజేయాలని పారిశ్రామికవేత్త పి.కామేశ్వరికి హైకోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. గడువులోగా అనువైన వసతి వివరాలను వెల్లడించకపోతే ఏడు నెలల్లోపు వయస్సున్న చిన్న కుక్కపిల్లలను దత్తతకు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటామంది. ప్రజల ఫిర్యాదు మేరకు కామేశ్వరి వద్ద ఉన్న 37 కుక్కలు, పిల్లలను జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకుంది. దీనిపై కామేశ్వరి హైకోర్టును ఆశ్రయించగా సింగిల్‌ జడ్జి విచారించి కుక్కలను తరలించాలనీ, లేని పక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది. సింగిల్‌ జడ్జి ఆదేశాలపై కుక్కల సంరక్షణ బాధ్యతను అప్పగించాలంటూ పీపుల్‌ ఫర్‌ యానిమల్స్‌ హైదరాబాద్‌ అండ్‌ సికింద్రాబాద్‌ అనే సంస్థ అప్పీలు దాఖలు చేసింది. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్‌ మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. అన్ని కుక్కలకు స్టెరిలైజేషన్‌ పూర్తయిందనీ, పిల్లలకు చికిత్స కూడా చేశారని న్యాయవాది తెలిపారు. కుక్కలను దత్తత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కామేశ్వరి తరఫున కోర్టుకు హాజరైన ఆమె తల్లి కుక్కలను తమ వద్ద ఉంచుకోవడానికి అనువైన వసతిని ఏర్పాటు చేసుకోవడానికి గడువు ఇవ్వాలని కోరారు. వాదనలను విన్న బెంచ్‌ వసతి ఏర్పాట్లు చేసుకుని జీహెచ్ఎంసీ పరిశీలనకు వివరాలు సమర్పించడానికి కామేశ్వరికి మూడు వారాల గడువు ఇస్తూ విచారణను వాయిదా వేసింది. అదేవిధంగా మిగిలిన కుక్కల సంరక్షణ విషయంలో కూడా ఆమెవద్ద అందుబాటులో ఉన్న వసతిపై దత్తత ఇచ్చే అంశంలో నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -