– అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల్లో ఆగ్రహం
– కామారెడ్డి జిల్లాలో సంచలనం రేపుతున్న చుక్కాపూర్ వెంచర్ వ్యవహారం
నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఓ వెంచర్ వ్యవహారం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. గ్రామపంచాయతీ కార్యాలయం నుండి లేని ఇండ్లకు ఇంటి నంబర్లు, ఇంటి పన్ను రసీదులు జారీ చేసి వాటి ఆధారంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్లాట్లను విక్రయించాడన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై గతంలో పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే… చుక్కాపూర్ గ్రామానికి సమీపంలోని సిరిసిల్ల రోడ్డుపై ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంచర్ ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయించాడు. అయితే వెంచర్‌లో అసలు ఇళ్లు లేకపోయినా, చుక్కాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం నుండి తేదీ 23-03-2022 న ఇంటి పన్ను రసీదులు జారీ చేసినట్లు సమాచారం. ఆ రసీదుల ఆధారంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కూడా జరిగినట్లు తెలుస్తోంది.
ఇది ఒక్కటి మాత్రమే కాకుండా సుమారు 7 నుంచి 8 వరకు ఇలాంటి అవుట్‌డోర్ నంబర్లు తీసుకొని పలువురు కొనుగోలుదారులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఆ ప్లాట్ల యజమానులు ఇంటి నిర్మాణ అనుమతుల కోసం వెళ్లినప్పుడు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివాసం ఉంటున్న ఇంటి పక్కన స్థలానికి కూడా పర్మిషన్ రావడం కష్టమవుతోంది. ప్రస్తుతం గ్రామాలలో రివిజన్ అధికారులలో ఇంటి పక్కన స్థలానికి గుర్తింపు లేదు, అట్టి స్థలానికి గుర్తింపు ఇవ్వాలని కోరితే సంబంధిత కార్యదర్శులు ఇవ్వడం లేదు. మాకు సంబంధం లేదని మేము ఇవ్వరాదని షాపులో చెప్తే తప్పించుకుంటున్నారు. కొన్ని గ్రామపంచాయతీల కార్యదర్శులు అ వెంచర్లో లేని ఇండ్లకు ఇంటి నంబర్లు ఎలా జారీ చేశారు ? అంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.
సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి, అప్పటి అధికారులు, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించాల్సిన డీఎల్పీవో, ఎంపీవోలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు నిలదీస్తున్నారు. గతంలో ఈ అంశంపై పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి విచారణ లేకపోవడం, వెంచర్‌పై గానీ, బాధ్యులపై గానీ చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. “అధికార పార్టీ అండ, డబ్బున్న వారి ప్రభావం ఉంటే ఏమైనా చేయొచ్చా?” అంటూ పలువురు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ జరిగిందన్న నమ్మకంతో ప్లాట్లు కొనుగోలు చేసిన అమాయక ప్రజలు ఇప్పుడు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



