పీఎం విశ్వకర్మను సద్వినియోగం చేసుకోవాలి

PM should take advantage of Vishwakarma– ఎమ్మెల్యే పాయల్ శంకర్
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
కులవృత్తుల వారి జీవణ ప్రమాణాలు మెరుగుపర్చడంతో పాటు స్వయం ఉపాధి దిశగా ప్రోత్సాహం అందించే లక్ష్యంతో ప్రారంభించిన పీఎం విశ్వకర్మను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా జన శిక్షణ సంస్తాన్ ఆద్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణను పూర్తి చేసుకున్న వారికి శనివారం దృవపత్రాలు అందించారు. టైలరింగ్, బ్యూటీషియన్, రజక వృత్తిదారులకు నైపుణ్య శిక్షణను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు స్వాగతం పలికి సత్కరించారు. కాగా పథకం అమల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడి లబ్దిదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని జన శిక్షణ సంస్థన్ చైర్మన్ సురేందర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు.
ఎంచుకున్న వృత్తిలో రాణించాలి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించడం సాధ్యపడదని, ఎంచుకున్న వృత్తిలో నైపుణ్యాలను మెరుగుపర్చుకుని రాణించాలని సూచించారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఔత్సాహికులైన వారికి వృత్తి నైపుణ్య శిక్షణను అందించి ఎలాంటి పూచికత్తు లేకుండా బ్యాంకు ద్వారా రుణాలు అందించి స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందిస్తుందన్నారు. తాము ఉపాది పొందుతూ నలుగురికి ఉపాది కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జీఎం పద్మభూషన్ రాజు, పీఎం విశ్వకర్మ ప్రొగ్రాం అధికారి రాజేందర్, డైరెక్టర్ శ్యామల, బీజేపీ నాయకులు ఆదినాథ్, సంజయ్, క్రిష్ణ, లాలామున్న పాల్గొన్నారు.
Spread the love