‘తప్పు చేయువారు తమ తప్పు నొప్పరు/ జగములోన వారు గగనమంత/ ఒప్పు చేసి వారి తప్పును సరిదిద్దు’ – ‘దారివెంటనున్న తరువును చూడుము/ పూలు పండ్లు పక్షి పురుగు యిల్లు/ తరువునిచ్చు ధనవంతుడేమిచ్చు’ – ‘వేపచెట్టు మీద కృపజూపి పెంచినా/ చేదుగుండు చెట్టు చెఱకు గాదు/ మూర్ఖు మీద ప్రేమ మూపినా మారునా’ అన్న ఈ పద్యాలు లోకకవి వేమనదో.. బద్దెనదో కాదు… అచ్చంగా ఒక తొమ్మిదవ తరగతి అమ్మాయి… అందులోనూ ఇంట్లో తల్లితండ్రులు మాట్లాడే భాష ఉర్దూ.. బడిలో చదివేభాష తెలుగు. ఈ తేట తెలుగు వెలుగు జిలుగుల పద్యం ఆ అమ్మాయి కృతం. ఖమ్మం గుమ్మం మీద మెరిసిన కొత్త చంద్రవంక పేరు షేక్ రిజ్వాన. తల్లితండ్రులు శ్రీమతి షేక్ నూర్జహాన్ – శ్రీ షేక్ రియాజ్ పాషా. పుట్టి పెరిగింది, చదివింది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెరువు మాధారం గ్రామంలో. 11 జూన్, 2007న పుట్టిన రిజ్వాన ప్రస్తుతం బి.ఎస్సీ, ఎం.పి.సి.ఎస్. మొదటి సంవత్సరం చదువుతోంది.
అనేక రోజులుగా మనం చూస్తున్నదే… ఇటీవల తెలంగాణలో బాలల సాహిత్య సోయి, సృజన బాగా పెరిగింది. వందలాది పుస్తకాలు, వేలాదిమంది విద్యార్థులు బాల రచయితలుగా అచ్చవుతున్నారు. ఇక్కడొక విషయం చెప్పాలి, సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన విద్యార్థి సాయి రాసిన కథ ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వ తెలుగు పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశంగా మారింది. అదీ ఎనిమిదవ తరగతి విద్యార్థి రాసిన కథ తొమ్మిదవ తరగతికి పాఠ్యాంశం… ఇదీ మన పిల్లల ప్రతిభ. ఇక రిజ్వాన విషయానికి వస్తే వాళ్ళ తెలుగు ఉపాధ్యాయుడు కవి, కన్నెగంటి వెంకటయ్య తరగతి గదిలో పాఠ్యాంశంలో భాగంగా ఛందస్సును చెబుతూ తేట తెలుగు ఛందమైన ఆటవెలది అనుకుంటే మీరు రాయగలరని అన్నాడట.. అదే తరగతిలో పాఠం వింటున్న రిజ్వాన ‘తేనెటీగ కుడిగె తిన్నగా మరవము/ దాని తేనె రుచి కొనిన రాదు/ కోపగించు మనసు కొండంత ప్రేముండు/ తెలుగు కొనవె రిజ్జు దీని రీతి’ అని చెప్పిందట. అలా ఒక పద్యంతో మొదలైన రచన… తరువాత పది పద్యాలకు… అటు తరువాత కరోనా లాక్డౌన్ వంటివాటి సమయంలో అవి ఇంతింతై అన్నట్టు వంద పద్యాలుగా… రెండు వందల పద్యాలుగా ఆవిర్భవించాయి. వాటిలోంచి ఏర్చికూర్చిన నూటా రెండు పద్యాలమాల ‘రిజ్జు శతకం’ పేరుతో అచ్చయ్యింది. చిరంజీవి రిజ్జూను పద్యాల సజ్జగా తీర్చిదిద్దిన వెంకటయ్య, అచ్చుకోసం వదాన్యత పంచిన యలమర్తి వెంకటేశ్వర్లు అభినందనీయులు. బడి దశనుండి నేటి వరకు అనేక సభలు, సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొన్న మన రిజ్వాన పలు సత్కారాలు, బహుమతులను కూడా అందుకుంది. వాటిలో కమలాకర కళా భారతి సంస్థ ద్వారా ‘బాలరత్న’ పురస్కారం అందుకుంది. ఖమ్మం మువ్వా శ్రీనివాసరావు ఏర్పరిచి నిర్వహిస్తున్న మువ్వా రంగయ్య-పద్మావతీ ఫౌండేషన్ ద్వారా ‘నవ స్వరాంజలి’ సత్కారాన్ని అందుకుని ఇంట గెలిచి నిలిచిన ఈ చిరంజీవి తెలంగాణ జాగృతి వారి ‘బాల కవి పుస్కారం’, ‘ఖమ్మంలోని అక్షరాలతోవ పురస్కారం, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన డా. చింతోజు బ్రహ్మయ్య బాలమణి బాల ప్రతిభా పురస్కారం’ మొదలైనవి అందుకుంది.
రిజ్వాన పుట్టిన ఊరి గురించి, బడి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వీళ్ళ చెరువు మాదారం గ్రామం రామదాసు కంచెర్ల గోపన్న నేల నేలకొండపల్లి మండలం లోనిదైతే, ఈ పాఠశాల నుండి గతంలోనే ‘కోయిలాలో.. కోయిలా…’ పేరుతో మాత్రా ఛందో గేయ సంపుటి వచ్చింది. దీనికి కూడా కన్నెగంటి వెంకటయ్యే సంపాదకులు. గతంలో ముదిగొండ బడి నుండి కూడా పుస్తకం తెచ్చాడు కన్నెగంటి. రిజ్వాన పద్యాలన్ని చదివితే ఇంత చిన్న వయసులో ఎంత పరిణతి అనిపించక మానదు. అందుకు ఒక చిన్న పద్యాన్ని ఉదహరిస్తాను. ‘గొడుగు పనికి వచ్చు రెండు కాలాలందు/ వాన ఎండలోన వదిలిపోదు/ కష్ట సుఖములలోన ఉన్నీరు వదలదు/ తెలుసుకొనుము రిజ్జి దీని నీతి’ … ఇది ఆ పద్యం. నిజం కదూ! పరిణతవాణి లాగా ఈ బాల వాక్కు ఎంత బలంగా ఉందో. రిజ్వాన కేవలం ఛందోపద్యాలు మాత్రమే రాయలేదు. కవిత్వం చెప్పింది, కథలు రాసింది. తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ చేపట్టిన కథా రచనా యజ్ఞంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా జరిగిన కథా రచనలో ‘మా ఊరు – మా చెట్టు’ శీర్షికన చక్కని కథ రాసి నేలకొండ పల్లి మండల స్థాయిలో ప్రథమ విజేతగా నిలిచింది. తల్లితండ్రులు, గురువుల పట్ల రిజ్వానకు ఎంతో ప్రేమ గౌరవం. ముఖ్యంగా తల్లితండ్రులను గురించి చెబుతూ… ‘కాలికింద చెప్పు కాలుతూ కాపాడు/ దారిచూపు మనకు తరిగి పోతు/ అమ్మ నాన్న కూడా అట్లాగె చెమటోడ్చు’ అంటుంది రిజ్వాన. ఇలాంటివి ఇంకా ఎన్నో పద్య చంద్రికలు ఈ బాల చంద్రిక రాసిన శతకంలో కనిపిస్తాయి. వాటిలో… పల్లె గురించి చెప్పిన ‘పల్లె సీమ నుండి పరుగులు తీయకు/ కన్నతల్లి లాగ కరుణ చూపు/ తల్లి లాగ చూసి దరువుంచు పల్లెపై’ అని చెబుతుంది. మరో పద్యంలో.. ‘ఎదుటి వారి జూసి ఏడ్వకు ఎప్పుడూ/ వారి జూసి నీవు వృద్ధి చెందు/ వారిలాగె నువ్వు వర్ధిల్లి చూపరా’ అని హితవు పలుకుతుంది. పద్యాన్ని తన పహెచాన్గా మలుచుకుని ఖమ్మం గుమ్మం మీద కొత్త చంద్రవంకగా మెరుస్తున్న రిజ్వానాకు ముబారక్‌బాద్! ఈ పద్య శతకానికి ఖుషామదీద్! తీర్చిదిద్దిన బడికి, ఊరికి జయహౌ!
– డా|| పత్తిపాక మోహన్
9966229548