
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు మేమున్నామని భరోసా ఇచ్చేందుకు పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారు. గురువారం మండల కేంద్రంలో కేంద్ర బలగాలతో కలిసి స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినిగించుకోవచ్చని ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించే వారిపై తగిన చర్యలు తీసుకోవడం తప్పదని సందేశం ఇచ్చేందుకు కవాతు నిర్వహిస్తున్నట్లు వర్ధన్నపేట ఏసీపి అంబటి నర్సయ్య తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజలకు, ఓటర్లకు రక్షణగా తామున్నామని ధైర్యం ఇచ్చేందుకే ఈ కవాతు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి చట్టవిరుద్దమైన కార్యకలాపాలైనా ప్రజల దృష్టికి వచ్చినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చూడటమే తమ లక్ష్యమన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు, రాజ్యంగం ప్రసాదించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు ప్రజలకు భరోసా కల్పించేందుకే కవాతు నిర్వహించామని వివరించారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి ఎస్ఐ వడ్డే సందీప్ కుమార్, వర్ధన్నపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్, జఫర్గడ్ ఎస్సై రవి తదితరులు పాల్గొన్నారు.