నవతెలంగాణ-హైదరాబాద్: రేపు పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 234 సీట్లకు గాను తమిళనాడులో ఏక దఫాలో పొలింగ్ జరగనుంది. అదే విధంగా బెంగాల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 294 సీట్లకు గాను రేపు బెంగాల్లో 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్‌లో 3.60 కోట్ల అర్హులైన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈక్రమంలోనే ఎన్నికల అధికారులు ఈవీఎం మిషన్ పంపిణీ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. కట్టుదిట్టమైన భద్రతా నడుమ ఆయా పొలింగ్ కేంద్రాలను మిషన్లను పంపనున్నారు.
టీఎంసీ, సీపీఐ(ఎం), ఎన్డేయే కూటమిల మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న తరుణంలో ఎన్నికల కమిషన్ భారీగా భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. మొదటి విడతలో 8 వేల పోలింగ్ బూత్‌లను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించింది. పోలింగ్ సజావుగా సాగేందుకు సుమారు 2,450 కంపెనీలు, రెండున్నర లక్షల కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. అదనంగా 2,193 క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది.
మే 4న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.. ఏప్రిల్ 9న కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే.అదే విధంగా బెంగాల్లో రెండో విడత పొలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది.



